త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toli Ekadashi | పూజ చేస్తే ఫలితం.. పరమార్థం తెలిస్తేనే పరిపూర్ణం

Toli Ekadashi | తొలి ఏకాదశి వచ్చిందంటే చాలామంది దృష్టి పూజా సామగ్రిపైనే నిలుస్తుంది. ఎన్ని పూలు సమర్పించాలి.. ఏయే పండ్లు కొనాలి.. ఏ స్తోత్రాలు చదవాలి.. ఎంతసేపు పూజ చేయాలి.. ఇలాంటి సందేహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ పూజ వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం తగ్గిపోతోంది. ప్రతీ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని తర్వాతి తరానికి చేరవేస్తేనే సంప్రదాయం సజీవంగా నిలుస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

P

Devotional | Published On Jul 24, 2026, 9.20 am IST

Toli Ekadashi | పూజ చేస్తే ఫలితం.. పరమార్థం తెలిస్తేనే పరిపూర్ణం
Advertisement
  • తొలి ఏకాదశి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం
  • శ్రీహరి శ్లోకంలోని ప్రతి పదానికీ ఓ అంతరార్థం
  • యోగనిద్ర అంటే నిద్ర కాదు..!
  • భక్తి, ధర్మం, ప్రకృతితో ముడిపడిన విశిష్టత ఇదే..

Toli Ekadashi | త్రినేత్ర.న్యూస్‌ : తొలి ఏకాదశి వచ్చిందంటే చాలామంది దృష్టి పూజా సామగ్రిపైనే నిలుస్తుంది. ఎన్ని పూలు సమర్పించాలి.. ఏయే పండ్లు కొనాలి.. ఏ స్తోత్రాలు చదవాలి.. ఎంతసేపు పూజ చేయాలి.. ఇలాంటి సందేహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ పూజ వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం తగ్గిపోతోంది. ప్రతీ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని తర్వాతి తరానికి చేరవేస్తేనే సంప్రదాయం సజీవంగా నిలుస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల ఒత్తిడి, సమయాభావం కారణంగా కుటుంబ సభ్యులంతా కలిసి పూజల్లో పాల్గొనడం తగ్గిపోయింది. చాలాచోట్ల ఇంట్లోని పెద్దలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే.. యువత మాత్రం తీర్థ ప్రసాదాలను తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. అందుకే ఇంట్లో నిర్వహించే ప్రతి పూజ వెనుక ఉన్న ఉద్దేశాన్ని పిల్లలకు వివరించడం అవసరమని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ‘జ్ఞాత్వా కర్మాణి కుర్వీత’ అని శాస్త్రం చెప్పింది. అంటే ఏ కార్యం చేసినా దాని ఉద్దేశం, అంతరార్థం తెలుసుకుని చేయాలని చెబుతోంది. అప్పుడు మాత్రమే భక్తి, శ్రద్ధ రెండూ సహజంగానే పెరుగుతాయి.

శ్లోకం వెనుక రహస్యం..

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును స్మరిస్తూ పఠించే శ్లోకాల్లో ‘మేఘశ్యామం పీతకౌశేయవాసం.. శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్।.. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం.. వందే సర్వలోకైకనాథమ్॥’ శ్లోకానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ శ్లోకాన్ని రూపవర్ణనగా మాత్రమే చూడకూడదని పండితులు చెబుతున్నారు. ఇందులోని ప్రతి విశేషణం ప్రకృతి, వ్యవసాయం, ఐశ్వర్యం, ధర్మం, లోకక్షేమం వంటి అనేక అంశాలను సూచిస్తుందని వివరిస్తున్నారు. ‘మేఘశ్యామం’ అంటే మేఘంలా నీలిరంగు శరీరం కలవాడని సాధారణ అర్థం. అయితే, దీని అంతరార్థం మరింత విశాలమైంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఆహారం పండాలంటే వర్షం తప్పనిసరి. వర్షానికి మూలం మేఘం. అందుకే లోకానికి జీవనాధారమైన వర్షాన్ని ప్రసాదించే దైవశక్తికి ప్రతీకగా శ్రీహరిని ‘మేఘశ్యాముడు’గా వర్ణించారు. ఆషాఢ మాసం ప్రారంభమైన వెంటనే రైతు ఆకాశం వైపు చూడడం వెనుక కూడా ఇదే భావం ఉంది. తొలి వర్షం కురిస్తేనే హలాలు కదులుతాయి. నేల సేదతీరుతుంది. పంటల ఆశలు చిగురిస్తాయి. ప్రకృతి చైతన్యాన్ని నింపే ఆ శక్తినే ఈ పదం సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.

పీతాంబరానికి..

‘పీతకౌశేయవాసం’ అంటే పసుపుపచ్చని పట్టు వస్త్రాన్ని ధరించినవాడు. అయితే, ఈ పదానికి మరో సంకేతార్థం కూడా ఉంది. నల్లని మేఘాల మధ్య మెరిసే మెరుపు ఎలా వర్షం రాబోతోందని తెలియజేస్తుందో.. అలాగే పచ్చదనంతో కళకళలాడే భూమికి సంకేతంగా ఈ పీతాంబరాన్ని భావిస్తారు. ప్రకృతిలోని మార్పులను దైవరూపంలో ప్రతిబింబించిన అందమైన భావన ఇది. శ్రీహరి వక్షస్థలంపై కనిపించే శ్రీవత్స చిహ్నం లక్ష్మీదేవి నిత్యనివాసానికి ప్రతీకగా పురాణాలు వివరిస్తాయి. లక్ష్మీ అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్యం, ఐశ్వర్యం, సిరిసంపద, సుభిక్షం అన్నీ అందులో భాగమే. వర్షాలు కురిసి పంటలు పండితేనే ఆ లక్ష్మీ ఇంటింటా కొలువుదీరుతుందని ఈ భావం గుర్తుచేస్తుంది. శ్రీహరి కంఠంలో వెలిగే కౌస్తుభమణి దివ్యత్వానికి ప్రతీకగా చెప్పబడింది. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు. ధర్మం, ఐశ్వర్యం, లోకక్షేమ సంకల్పం కలిసిన దైవతేజస్సుకు చిహ్నంగా పురాణాలు పేర్కొంటాయి. అందుకే కౌస్తుభ ప్రభతో వెలిగే శ్రీహరి సర్వలోకాలకూ ఆశ్రయదాతగా భావించబడుతున్నాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని పురాణాల్లో పేర్కొంటారు. అయితే దీనిని సాధారణ నిద్రగా అర్థం చేసుకోవడం సరైంది కాదని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తున్నారు. భక్తుల కోరికలను ఆలకిస్తూ, లోకక్షేమాన్ని కాపాడుతూ నిరంతరం కార్యనిర్వహణలో ఉండే దైవశక్తి, తపస్సు ద్వారా మరింత పరిపుష్టి చెందే కాలాన్నే యోగనిద్రగా భావించాలని చెబుతారు. అందుకే ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యంగా పరిగణించి జపం, తపస్సు, దానం, ధర్మాచరణకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.

పుణ్యోపేతం.. భక్తుల పుణ్యానికి ప్రతీక

శ్లోకంలోని ‘పుణ్యోపేతం’ అనే పదానికి కూడా విశిష్టమైన భావం ఉంది. సాధారణంగా పుణ్యస్వరూపుడిగా అర్థం చేసుకుంటారు. అయితే, ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, వ్యాసుడు వంటి మహాభాగవతులు తమ తపస్సుతో సంపాదించిన పుణ్యఫలాన్ని భగవంతునికే సమర్పించారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల భక్తుల పుణ్యసంపదతో మరింత మహిమాన్వితుడైనవాడే శ్రీహరి అనే భావాన్ని తెలియజేస్తుంది. ప్రజలు చెల్లించే పన్నులతో పాలకుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లుగానే.. భక్తులు సమర్పించే పుణ్యఫలాన్ని భగవంతుడు సమస్త లోకాల శ్రేయస్సు కోసం వినియోగిస్తాడనే తాత్పర్యాన్ని కూడా ఇందులో చూడొచ్చని పండితులు పేర్కొంటున్నారు. ‘పుండరీకాయతాక్షం’ అంటే పద్మదళాల్లా విశాలమైన నేత్రాలు కలవాడని అర్థం. ఇది కేవలం రూపవర్ణన మాత్రమే కాదు. లోకంలోని ప్రతి జీవిని సమదృష్టితో కాపాడే దైవకరుణకు సంకేతంగా భావిస్తారు. యోగనిద్రలో ఉన్నప్పటికీ జగత్తు మీద ఆయన దృష్టి ఎప్పుడూ నిలిచే ఉంటుందనే సందేశాన్ని తెలియజేస్తుంది. సృష్టిలో ధర్మాన్ని ఆచరించే వారిని, సత్కార్యాలు చేసే వారిని, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వారిని భగవంతుడు తన కటాక్షంతో కాపాడుతాడనే విశ్వాసం.

సర్వలోకాలకు ఒకే ఆధారం

శ్లోకం చివరలో వచ్చే ‘సర్వలోకైకనాథమ్’ అనే పదం శ్రీహరి విశ్వరూపాన్ని తెలియజేస్తుంది. కాలం మారినా, యుగాలు మారినా సృష్టిని నడిపించే పరమశక్తి ఒక్కటేనని చెబుతోంది. అందుకే తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు తమ వ్యక్తిగత కోరికలకే కాకుండా లోకక్షేమం కోసం కూడా ప్రార్థించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లాడంటే లోకాన్ని వదిలేయడం, బాధ్యతల నుంచి విరామం తీసుకోవడం కూడా కాదు. జగత్తు నిర్వహణకు అవసరమైన శక్తిని తపస్సు ద్వారా మరింత బలపరుచుకునే దశగా పురాణాలు పేర్కొంటున్నాయి. రామాయణంలో రావణ సంహారానికి ముందు అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించిన ఘట్టాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. నిరంతర కార్యాచరణకు ఆధ్యాత్మిక శక్తి అవసరమనే విషయాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.

బాధ్యతల బదలాయింపే యోగనిద్ర

ఒక అధికారి కొంతకాలం విధులకు దూరంగా ఉండాల్సి వచ్చినా.. తన బాధ్యతలను సమర్థులైన సహచరులకు అప్పగించి వెళ్తాడు. వ్యవస్థ ఎక్కడా ఆగిపోకుండా చూసుకుంటాడు. అదే విధంగా జగత్తు నిర్వహణలోనూ శ్రీహరి తన ధర్మరక్షణ బాధ్యతలను ఋషులు, తపస్వులు, సజ్జనుల వంటి మహనీయుల ద్వారా కొనసాగిస్తాడని పురాణాలు వివరిస్తున్నాయి. ధర్మ పరిరక్షణ, సజ్జన సంరక్షణ, సంప్రదాయాల పరిరక్షణ వంటి బాధ్యతలను వారు నిర్వర్తిస్తుండటంతో లోకంలో ఆధ్యాత్మిక విలువలు నిలిచి ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజున పూజలు చేయడం, ఉపవాసం ఉండడం, ఆలయ దర్శనం చేయడం సంప్రదాయం. అయితే, వాటి వెనుక ఉన్న తాత్వికతను కుటుంబంలోని చిన్నారులకు వివరించడం మరింత ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. ఎన్ని పూలు సమర్పించామన్నది కాదు.. ఎందుకు సమర్పిస్తున్నామన్నది వారికి తెలియాలి. ఎన్ని శ్లోకాలు చదివామన్నది కాదు.. అందులోని సందేశాన్ని జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నామన్నదే అసలు భక్తికి కొలమానం. ఆచార వ్యవహారాలను కేవలం ఓ పనిగా కాకుండా.. విలువలను నేర్పే జీవన విధానంగా భావించి తర్వాతి తరానికి అందించగలిగితేనే తొలి ఏకాదశి వంటి పర్వదినాల అసలు పరమార్థం నెరవేరుతుంది. అప్పుడే భక్తి సంప్రదాయం కుటుంబం నుంచి సమాజానికి, సమాజం నుంచి తరతరాలకు సజీవంగా కొనసాగుతుంది.

Advertisement
Advertisement