Kondagattu Anjanna Temple | నరసింహ ముఖంతో దర్శనమిచ్చే ఆంజనేయుడు.. కొండగట్టు క్షేత్ర విశిష్టత ఇదే..
Kondagattu Anjanna Temple | హనుమాన్ భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా పేరొందింది జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం. కొండలు, లోయలు, ప్రకృతి మధ్య వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకంగా ఆకర్షణగా కూడా నిలుస్తోంది. కొండగట్టు అంజన్నగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
Devotional | Published On May 11, 2026, 11.54 am IST
- భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్న
- ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర
- దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండుముఖాలో దర్శనం
- రామాయణంతోనూ ఆలయానికి అనుబంధం
- రేపు హనుమాన్ పెద్ద జయంతి
Kondagattu Anjanna Temple | హనుమాన్ భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా పేరొందింది జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం. కొండలు, లోయలు, ప్రకృతి మధ్య వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకంగా ఆకర్షణగా కూడా నిలుస్తోంది. కొండగట్టు అంజన్నగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా హనుమాన్ దీక్షలు తీసుకున్న భక్తులు ఇక్కడే దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతో చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయ విశేషాలపై హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
పశువుల కాపరికి కలలో దర్శనమిచ్చిన అంజన్న
కొండగట్టు ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన కథ స్థానికంగా ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దాల క్రితం ముత్యంపేట ప్రాంతానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి అడవిలో పశువులు మేపుతుండగా ఓ ఆవు కనిపించకుండా పోయిందట. ఆ ఆవును వెతుకుతూ అలసిపోయిన అతడు ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడతనికి కలలో ఆంజనేయస్వామి దర్శనమిచ్చి తాను కోరంద పొదల్లో ఉన్నానని, తనకు ఆలయం నిర్మించాలని, తప్పిపోయిన ఆవు ఎక్కడ ఉందో తెలిపాడని చెబుతారు. నిద్రలేచిన సంజీవుడు అక్కడి పొదలను తొలగించగా స్వామివారి విగ్రహం కనిపించిందట. ఆనందంతో తన గ్రామస్తులతో కలిసి చిన్న ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఈ క్షేత్రం క్రమంగా మహాక్షేత్రంగా అభివృద్ధి చెందింది.
ద్విముఖ ఆంజనేయుడు ప్రత్యేకత

కొండగట్టు ఆలయంలోని ప్రధాన విశేషం స్వామివారి రూపమే. ఇక్కడ ఆంజనేయుడు ఒక వైపు నరసింహస్వామి ముఖం, మరోవైపు ఆంజనేయస్వామి ముఖంతో ద్విముఖ రూపంలో దర్శనమిస్తాడు. ఈ రూపం దేశంలో అరుదైనదిగా భావిస్తారు. అంతేకాదు స్వామివారి వక్షస్థలంపై సీతారాముల ప్రతిరూపం ఉండడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శంఖు, చక్రాలతో కూడిన ఈ స్వరూపాన్ని విష్ణు తత్వానికి సంకేతంగా భావిస్తారు.
సంజీవని పర్వతంతో ..
రామాయణ గాథతో కూడా కొండగట్టుకు అనుబంధం ఉందని స్థానికులు చెబుతారు. లక్ష్మణుడు మూర్ఛపోయిన సమయంలో హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవని పర్వతం నుంచి ఒక భాగం ఈ ప్రాంతంలో పడిందని, అదే కొండగట్టుగా మారిందనే విశ్వాసం ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని మరింత పవిత్రంగా భావిస్తారు.
500 ఏళ్ల చరిత్ర..

దాదాపు నాలుగు నుంచి ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని తరువాత కాలంలో స్థానిక పాలకులు, దేశ్‌ముఖ్‌లు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ప్రధాన గోపురం రెండు వైపులా ఏనుగు ప్రతిమలు, పైభాగంలో ఆంజనేయస్వామి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గర్భాలయానికి ఒక వైపు వెంకటేశ్వరస్వామి, ఆండాళ్ ఆలయాలు ఉండగా మరోవైపు శివపంచాయతన మందిరం ఉంటుంది. ఆలయ వెనుక భాగంలో బేతాళస్వామి ఆలయం, సమీపంలో గుహలో శివలింగం దర్శనమిస్తాయి. భక్తులు ఈ ఉపాలయాలను కూడా దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో పవిత్ర స్నానం చేసి తలనీలాలు సమర్పించడం కూడా భక్తుల ఆచారంగా కొనసాగుతోంది. ఇక్కడి మరో ప్రత్యేకత సీతమ్మ బావి. ఈ బావి నుంచి తీసుకొచ్చే నీటితో ప్రతిరోజూ స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయం. భక్తులు ఈ తీర్థాన్ని పవిత్రంగా భావిస్తారు.
40 రోజుల పూజతో కోరికలు తీరుతాయనే నమ్మకం
కొండగట్టు అంజన్నను భక్తులు ఎంతో విశ్వాసంతో ఆరాధిస్తారు. ఇక్కడ 40 రోజుల పాటు నియమ నిష్ఠలతో పూజలు చేస్తే సంతాన సమస్యలు తొలగుతాయని, మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. అందుకే పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. వేసవి కాలంలో వేలాది మంది భక్తులు హనుమాన్ దీక్షలు స్వీకరిస్తారు. 11, 21, 41 రోజుల దీక్షలను పూర్తిచేసిన భక్తులు కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష విరమిస్తారు. స్వామివారి బొట్టును ప్రసాదంగా తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉంది.
ఆలయంలో జరిగే ప్రధాన పర్వదినాలు

కొండగట్టు ఆలయంలో సంవత్సరమంతా పలు ఆధ్యాత్మిక ఉత్సవాలు వైభవంగా సాగుతుంటాయి. చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి, వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది దీక్ష భక్తులు స్వామివారిని దర్శించుకుని ముడుపులు కట్టివెళ్తారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజున స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు, ధనుర్మాసంలో తిరుప్పావై సేవలు, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. దీపావళి రోజున సహస్ర దీపాలతో ఆలయాన్ని అలంకరిస్తారు. లోకక్షేమం కోసం పవిత్రోత్సవాలు, జగత్‌కల్యాణం కోసం సుదర్శన మహాయాగం సైతం నిర్వహిస్తారు.
రోజువారీ సేవలు, దర్శన సమయాలు
ఆలయం ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. అనంతరం స్వామివారి ఆరాధన, బాలభోగ నివేదన, సూర్య దర్శనం, నిత్యహారతులు కొనసాగుతాయి. ఉదయం అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం కొంత విరామం అనంతరం తిరిగి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరాధనలు, హారతులు, వెంకటేశ్వరస్వామి సేవా ఉత్సవాలు, భజనలు జరుగుతాయి. రాత్రి 8.30 గంటలకు కవాటబంధనంతో ఆలయ సేవలు ముగుస్తాయి. భక్తులు ఆలయంలో పలు ప్రత్యేక సేవల్లో పాల్గొనవచ్చు. అంజన్న అభిషేకానికి రూ.100 టికెట్ నిర్ణయించారు. మహామండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రూ.250 చెల్లించాలి. అమ్మవారికి కుంకుమార్చన టికెట్ ధర రూ.50 కాగా, సత్యనారాయణ వ్రతానికి రూ.100గా నిర్ణయించారు. సాయంత్రం వెంకటేశ్వరస్వామి సేవా ఉత్సవంలో పాల్గొనాలంటే రూ.150 టికెట్ తీసుకోవాలి. ప్రత్యేక దర్శనం రూ.20తో అందుబాటులో ఉండగా, త్వరిత దర్శనానికి రూ.120, రూ.200 టికెట్లు ఉన్నాయి. గర్భగుడిలో ప్రత్యేక దర్శనం ఐదుగురు సభ్యులకు రూ.316గా నిర్ణయించారు. సాధారణ ధర్మదర్శనం ఉచితంగా ఉంటుంది. అయితే ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేదు.
భక్తుల కోసం వసతి సౌకర్యాలు

కొండగట్టుకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం పలు వసతి సదుపాయాలు కల్పిస్తోంది. కొండపై మూడు ప్రత్యేక గెస్ట్‌హౌస్‌లు ఉండగా, వీటికి రోజుకు సుమారు రూ.250 అద్దె ఉంటుంది. అదనంగా ధర్మశాల గదులు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయి. కొన్ని గదులు రూ.50 నుంచి ప్రారంభమవుతుండగా, మరికొన్ని గదులకు రూ.150 వరకు అద్దె ఉంటుంది. ఉచితంగా బస చేయాలనుకునే భక్తుల కోసం డార్మిటరీ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. కొండపైన హరిత హోటల్ సౌకర్యం ఉంది. గదుల వివరాల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక సమాచారం అందిస్తున్నారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలి..
కొండగట్టు ఆలయం జగిత్యాల పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి సుమారు 40 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి జగిత్యాల వైపు ఎక్కువగా బస్సులు నడుస్తుంటాయి. జగిత్యాల, కరీంనగర్ నుంచి కూడా ప్రతి అరగంటకోసారి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు కూడా సులభంగా లభిస్తాయి. నిజామాబాద్ నుంచి రైలు సైతం అందుబాటులో ఉంది.
ఆలయంలో మూడురోజుల ఉత్సవాలు..
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మూడురోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. వేడుకలను ఆదివారం మొదలయ్యాయి. వేడుకల్లో భాగంగా భద్రాచలం సీతారామ స్వామి తరఫున రామభక్తుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. మూడురోజుల పాటు ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండులక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



