Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!
Jagannath Rath Yatra | పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథుని రథయాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది ఆకాశాన్నంటేలా కనిపించే మూడు భారీ రథాలు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య రథచక్రాలు కదులుతుంటే పూరీ వీధులు ఆధ్యాత్మిక శోభతో నిండిపోతాయి. సోదరుడు, సోదరితో కలిసి జగన్నాథుడు ఆలయ గర్భగుడి నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే ఈ మహోత్సవంలో రథాలకు ప్రత్యేక స్థానం ఉంది.
Devotional | Published On Jul 16, 2026, 12.35 pm IST
Jagannath Rath Yatra | పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథుని రథయాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది ఆకాశాన్నంటేలా కనిపించే మూడు భారీ రథాలు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య రథచక్రాలు కదులుతుంటే పూరీ వీధులు ఆధ్యాత్మిక శోభతో నిండిపోతాయి. సోదరుడు, సోదరితో కలిసి జగన్నాథుడు ఆలయ గర్భగుడి నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే ఈ మహోత్సవంలో రథాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి రథం వెనుక ఓ సంప్రదాయం, ఓ చరిత్ర, ఓ ఆధ్యాత్మిక భావం దాగి ఉన్నది. జగన్నాథుడు అధిష్ఠించే రథాన్ని నందిఘోష్ అని, బలభద్రుడు కొలువుదీరే రథాన్ని తాళధ్వజం, సుభద్రాదేవి విహరించే దేవదళన అని పిలుస్తారు. రథాలు కేవలం వాహనాలు కావు.. అవి దైవ స్వరూపాలుగా భక్తులు భావిస్తారు. ప్రతి ఏడాది కొత్తగా నిర్మించే ఈ రథాలు పూరీ రథయాత్ర వైభవానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
జగన్నాథుని నందిఘోష్.. వైభవానికి ప్రతీక
జగన్నాథస్వామి ప్రయాణించే రథాన్ని నందిఘోష్ అని పిలుస్తారు. ఈ రథం మూడు రథాల్లో అతి పెద్దది. సుమారు 45 అడుగుల ఎత్తు ఉండే ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో నందిఘోష్‌ను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ రథానికి శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వ అనే నాలుగు గుర్రాలు ఉంటాయి. జగన్నాథుని రథానికి సారథి దారుకుడు. రథం జెండాపై (త్రైలోక్యమోహిని) స్వయంగా హనుమంతుడు (కపిధ్వజం) కొలువై ఉండి రథాన్ని నడిపిస్తాడని భక్తుల నమ్మకం. రథం చుట్టూ వరాహ, నరసింహ, రామ, కృష్ణ వంటి 9 మంది పార్శ్వ దేవతలు కాపలా ఉంటారు. రథంపై జగన్నాథుడితో పాటు ఆయన ప్రతిరూపమైన మదనమోహనుడిని కూడా ప్రతిష్ఠిస్తారు. రథంపై రెపరెపలాడే పతాకం, చక్ర చిహ్నాలు భక్తులను ఆకర్షిస్తాయి. నందిఘోష్ కదలడం అంటే జగన్నాథుడు స్వయంగా భక్తుల వద్దకు వస్తున్నాడనే భావన భక్తుల్లో ఉంటుంది. అందుకే ఈ రథాన్ని లాగేందుకు భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ‘రథస్థం జగన్నాథం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ అంటే రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే, కుల, మత, వర్గ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రథాన్ని లాగేందుకు ఆసక్తి చూపుతుంటారు.
బలభద్రుడి తాళధ్వజం.. శక్తి, ధైర్యానికి ప్రతీక
జగన్నాథుని అన్న బలభద్రుడు అధిష్ఠించే రథం పేరు తాళధ్వజం. ఈ రథం సుమారు 44 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయి. ఎరుపు, నీలం రంగు వస్త్రాలతో తాళధ్వజాన్ని అలంకరిస్తారు. బలభద్రుడి రథంపై చెట్టు ఆకారంలోని పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం.. ఈ రథం పైభాగంలో ఉండే ధ్వజం (జెండా)పై తాటి వృక్షం (తాళ వృక్షం) చిహ్నం ఉంటుంది. బలభద్రుడి ఆయుధాలలో, చిహ్నాలలో తాటిచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ రథానికి ‘తాళధ్వజం’ అనే పేరు వచ్చింది. ఈ రథానికి తీవ్ర, ఘోర, దీర్ఘశ్రమ, స్వర్ణనాభ నాలుగు అశ్వాలుంటాయి. ఈ రథానికి ఉండే 14 భారీ చక్రాలను.. పద్నాలుగు భువనాలకు (లోకాలకు) ప్రతీకగా భావిస్తారు. రథాన్ని అలంకరించడానికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు.. ప్రకృతికి, బలభద్రుడి వైభవానికి సంకేతం. ఈ రథాన్ని లాగడానికి వాడే పవిత్రమైన తాడును ‘వాసుకి’గా పేర్కొంటారు. బలభద్రుడి రథసారథిగా మాతలి. వినాయకు, కార్తికేయుడు, సర్వమంగళ, ప్రళయంకరుడు, హటకేశ్వరుడు, యమధర్మరాజు, ముకుందుడు, నటరాజు, అఘోర అనే తొమ్మిది మంది దేవతలు రథానికి కాపలా ఉంటారు. రథయాత్ర ప్రారంభమైనప్పుడు ముందుగా కదిలేది తాళధ్వజమే. అన్నగా బలభద్రుడు మార్గాన్ని చూపిస్తాడనే భక్తుల విశ్వాసం.
సుభద్రాదేవి దేవదళన.. శక్తి స్వరూపం
ముగ్గురు దేవతలలో ఏకైక మహిళా దేవత అయిన సుభద్రాదేవి రథం పేరు దేవదళన. దీన్ని దర్పదళన, పద్మరథం అని కూడా పిలుస్తారు. బలభద్రుడి తాళధ్వజ రథానికి, జగన్నాథుడి నందిఘోష రథానికి మధ్యలో సాగే ఈ పద్మరథానికి కూడా ఎంతో విశిష్టత ఉన్నది. పురాణాల ప్రకారం.. ‘దర్పదాలన’ అంటే ‘అహంకారాన్ని ముక్కలు చేసేది’ అని అర్థం. ఈ రథంపై ఉన్న సుభద్రా దేవిని దర్శించుకుంటే మనుషులలోని గర్వం, అహంకారం నశించి, మనసు పద్మంలా పవిత్రమవుతుందని భక్తుల నమ్మకం. జగన్నాథుడి, బలబద్రుడి రథాల కంటే పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఈ రథం ఎత్తు సుమారు 42 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. కాలచక్రంలోని 12 నెలలకు ప్రతీకగా పేర్కొంటారు. పరాశక్తి స్వరూపానికి చిహ్నంగా ఈ రథాన్ని ఎరుపు, నలుపు, ముదురు నీలం రంగు వస్త్రాలతో అత్యంత రమణీయంగా రథాన్ని అలంకరిస్తారు. ఈ రథాన్ని లాగడానికి భక్తులు ఉపయోగించే పవిత్రమైన తాడు పేరు ‘స్వర్ణచూడ’గా పిలుస్తారు. ఈ రథానికి స్వయంగా అర్జునుడు సారథిగా వ్యవహరించడం విశేషం. రథాన్ని లాగడానికి రుచికా, మోచికా, జితా, అపరాజిత అనే నాలుగు ఎరుపు రంగు గుర్రాలుంటాయి. రథం జెండాపై (నదంబిక) శక్తి స్వరూపిణి అయిన జయదుర్గ దేవి కాపలాగా ఉంటుంది. రథం చుట్టూ చాముండ, మంగళ, విమల, కాళీ, సరస్వతి, హరచండి, శూలిదుర్గ తదితర శక్తి దేవతల విగ్రహాలు కొలువై ఉంటాయి. సుభద్రాదేవితో పాటు చక్రరాజు సుదర్శనుడిని కూడా ఈ రథంలో ప్రతిష్ఠిస్తారు. దేవదళనం రథయాత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. సుభద్రాదేవి భక్తులకు కరుణామయిగా దర్శనమిస్తుందని విశ్వాసం.
ప్రతి ఏడాది కొత్త రథాలు..
పూరీ రథయాత్రలో మరో ప్రత్యేకత ప్రతి ఏడాది కొత్త రథాలను నిర్మించడం. వంశపారంపర్యంగా వస్తున్న మహారాణా కళాకారులు ప్రత్యేక నియమాలతో రథాల తయారీ చేపడతారు. రథ నిర్మాణానికి అవసరమైన కలప సేకరణ వసంత పంచమి రోజున ప్రారంభమవుతుంది. అక్షయ తృతీయ రోజున రథ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. నిర్దిష్ట కొలతలు, సంప్రదాయ పద్ధతులతో రథాలను సిద్ధం చేస్తారు. రథ నిర్మాణంలో ఒక్కో భాగానికి ప్రత్యేకమైన పేరు, ప్రాధాన్యం ఉంటుంది. చక్రాలు, స్తంభాలు, పైకప్పు, పతాకాలు అన్నీ శాస్త్రోక్త పద్ధతిలో రూపొందిస్తారు.
సుదర్శన చక్రుడే..
రథయాత్ర రోజున ముందుగా సుదర్శన చక్రుడిని తీసుకువస్తారు. అనంతరం బలభద్రుడు, సుభద్రాదేవి, చివరగా జగన్నాథుడు రథాలపైకి చేరుకుంటారు. మూడు రథాలు సింహద్వారం నుంచి బయలుదేరి గుండీచా మందిరం వైపు సాగుతాయి. ముందుగా తాళధ్వజం, ఆ తర్వాత దేవదళనం, చివరగా నందిఘోష్ రథాలు కదులుతాయి. లక్షలాది మంది భక్తులు తాళ్లను పట్టుకుని రథాలను లాగడం ఈ ఉత్సవంలో అత్యంత భక్తి భావాన్ని కలిగించే ఘట్టం. రథాల చక్రాలు తిరిగే వేళ అది కేవలం ఓ ప్రయాణం కాదు.. జగన్నాథుడు తన భక్తుల వద్దకు స్వయంగా వస్తున్న దివ్య ఘట్టంగా పూరీ ప్రజలు, భక్తులు భావిస్తారు. అందుకే పూరీ రథయాత్రలో మూడు రథాలు మూడు వాహనాలు మాత్రమే కాదు.. అవి విశ్వాసానికి ప్రతీకలు, శతాబ్దాల సంప్రదాయాలకు సజీవ రూపాలుగా పేర్కొంటారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..
- ●Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
- ●Prabhas Fauzi | అఫీషియల్ - ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ - యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ - పోస్టర్ వైరల్
- ●IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..
- ●Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు
- ●MLC Venkatram reddy | డ్రగ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్..

NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..

Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

Prabhas Fauzi | అఫీషియల్ - ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ - యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ - పోస్టర్ వైరల్

IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..





