Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!
Arunachal Karthigai Deepam | కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. తమిళనాడులోని తిరువణ్ణామలై ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. అరుణాచలేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే కార్తీక దీపోత్సవంలో అత్యంత కీలకమైన ఘట్టం మహా దీప దర్శనం. 2,668 అడుగుల ఎత్తైన అణ్ణామలైయార్ కొండ శిఖరంపై వెలిగించే ఈ అఖండ జ్యోతి భక్తులకు కనువిందు చేస్తుంది.
Devotional | Published On Nov 23, 2026, 7.18 pm IST
Arunachal Karthigai Deepam | కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. తమిళనాడులోని తిరువణ్ణామలై ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. అరుణాచలేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే కార్తీక దీపోత్సవంలో అత్యంత కీలకమైన ఘట్టం మహా దీప దర్శనం. 2,668 అడుగుల ఎత్తైన అణ్ణామలైయార్ కొండ శిఖరంపై వెలిగించే ఈ అఖండ జ్యోతి భక్తులకు కనువిందు చేస్తుంది. కొండపై వెలిగే ఈ భారీ దీపం వెనుక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 125 కిలోల బరువుండే భారీ లోహపు పాత్ర.. వేల కిలోల నెయ్యి.. కిలోమీటర్ల పొడవైన వస్త్రంతో తయారుచేసే వత్తి.. ఇలా ప్రతి అంశం ఆసక్తికరమే. ఇంతకీ ఈ మహా దీపాన్ని ఎలా సిద్ధం చేస్తారు? అందులో ఉపయోగించే పాత్ర ప్రత్యేకత ఏమిటి?
భారీ కొప్పరై.. ప్రత్యేక నిర్మాణం..

అరుణాచలేశ్వర ఆలయ కార్తీక దీపోత్సవంలో మహా దీపం వెలిగించేందుకు ఉపయోగించే భారీ లోహపు పాత్రను 'కొప్పరై'గా పిలుస్తారు. సాధారణ పాత్రల మాదిరిగా కాకుండా, దీర్ఘకాలం పాటు మండే జ్వాల వేడిని తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందిస్తారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం దీని ఎత్తు సుమారు 5 నుంచి 6 అడుగులు ఉండగా.. బరువు 130 నుంచి 300 కిలోల వరకు ఉంటుంది. కాలానుగుణంగా కొప్పరై రూపురేఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 1991లో మన్ను నాటార్ ఈ సంప్రదాయంలో తొలి కొప్పరైని తయారు చేసినట్లు చెబుతారు. 2003లో ఇనుము, రాగి మిశ్రమంతో మరో పాత్రను రూపొందించారు. సుమారు 13 ఏళ్ల పాటు దాన్ని వినియోగించారు. అనంతరం 2016లో పూర్తిగా రాగితో కొత్త కొప్పరైని తయారుచేశారు. దీని తయారీలో దాదాపు 200 కిలోల స్వచ్ఛమైన రాగిని ఉపయోగించినట్లు సమాచారం.
శివతత్వాన్ని చాటే ప్రత్యేక ఆకృతులు

కొప్పరై తయారీ కూడా ప్రత్యేకమైన ప్రక్రియే. ముందుగా అడుగు భాగం, పై భాగాలను వేర్వేరుగా రూపొందించి.. అనంతరం వాటిని కలుపుతారు. బలంగా ఉండేందుకు అవసరమైన చోట లోహపు అమరికలు చేస్తారు. నిరంతరం మంటల్లో ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీని నిర్మాణాన్ని సిద్ధం చేస్తారు. ప్రతి ఏడాది ఉత్సవాలకు ముందు శుభ్రం చేయడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపడతారు. ఇక ఈ కొప్పరైపై కనిపించే ఆధ్యాత్మిక చిహ్నాలు మరో ప్రత్యేక ఆకర్షణ. శివలింగం, నంది, అర్ధనారీశ్వరుడి రూపాలను ఇందులో పొందుపరుస్తారు. ముఖ్యంగా శివుడిలోని అర్ధనారీశ్వర తత్వం స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటుతుంది.
కొండపైకి తరలించడం ఓ సవాల్..

కొప్పరైని సిద్ధం చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని 2,668 అడుగుల ఎత్తైన కొండ శిఖరానికి చేర్చడం మరో పెద్ద పని. ఇందుకోసం ప్రత్యేకంగా దీప నాటార్ బృందం సేవలందిస్తుంది. ముందుగా ఆలయంలో కొప్పరైకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం దాన్ని భద్రంగా కట్టి, పొడవైన చెక్క కర్రల సాయంతో పైకి తీసుకెళ్తారు. బృందంలోని సభ్యులు సమన్వయంతో వంతులవారీగా ఈ భారీ పాత్రను కొండపైకి చేరుస్తారు. కొప్పరైతో పాటు దీపం వెలిగించడానికి అవసరమైన నెయ్యి, వత్తులను కూడా ముందుగానే శిఖరానికి తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
4,500 కిలోల నెయ్యి.. కిలోమీటర్ల వత్తి

మహా దీపం ప్రత్యేకతల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నెయ్యి వినియోగం. ఇంట్లో చిన్న ప్రమిదలో దీపం వెలిగించడానికి కొద్దిపాటి నూనె సరిపోతుంది. కానీ అరుణాచల కొండపై రోజుల తరబడి వెలిగే జ్యోతికి మాత్రం భారీ మొత్తంలో నెయ్యి అవసరం. 2022లో మహా దీపం కోసం సుమారు 4,500 కిలోల నెయ్యిని వినియోగించినట్లు తెలుస్తోంది. 2023లో ఐదు టన్నుల నెయ్యితో పాటు సుమారు కిలోమీటరు పొడవైన గాడా వస్త్రాన్ని కొండపైకి తీసుకెళ్లారు. ఇక ఈ ఏడాది కార్తీక దీపోత్సవానికి కూడా సుమారు 4,500 కిలోల నెయ్యిని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆలయ నిర్వహణ కమిటీ ఆవిన్ సంస్థ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది. మహా దీపానికి ఉపయోగించే వత్తి కూడా సాధారణమైంది కాదు. గాడా వస్త్రాన్ని ప్రత్యేక పద్ధతిలో చుట్టి భారీ వత్తిగా తయారు చేస్తారు. దీన్ని కొప్పరైలో ఏర్పాటు చేసి నెయ్యితో కలిపి జ్యోతిని వెలిగిస్తారు.
మహా దీపానికి ముందు భరణి దీపం
అరుణాచలంలో మహా దీపోత్సవానికి భరణి దీపంతోనే ఆధ్యాత్మికంగా శ్రీకారం చుడతారు. కార్తీక దీపం రోజున తెల్లవారుజామున ఆలయ గర్భగుడి సమీపంలో భరణి దీపాన్ని వెలిగిస్తారు. పంచభూతాలకు ప్రతీకగా ఐదు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం ఈ సంప్రదాయంలోని విశేషం. ఉదయం భరణి దీపం దర్శనం అనంతరం సాయంత్రం కొండ శిఖరంపై వెలిగించే మహా దీపం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. నిర్ణీత సమయంలో కొండపై జ్యోతి వెలిగిన క్షణం భక్తుల హరహర మహాదేవ నినాదాలతో తిరువణ్ణామలై మారుమోగుతుంది.

11 రోజుల పాటు అఖండ జ్యోతి
మహా దీపం వెలిగించిన తర్వాత అది వరుసగా 11 రోజుల పాటు ప్రకాశిస్తుందని సంప్రదాయం చెబుతోంది. ఈ కాలమంతా దీపం నిరంతరాయంగా వెలిగేందుకు అవసరమైన నెయ్యిని ముందుగానే కొండపైకి చేరుస్తారు. అవసరాన్ని బట్టి కొప్పరైలో నెయ్యిని నింపుతుంటారు. ఉత్సవం ముగిసిన అనంతరం దీపం ఆరిన తర్వాత దీప నాటార్ బృందం కొప్పరైని జాగ్రత్తగా కొండపై నుంచి కిందకు తీసుకొస్తుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భద్రపరుస్తారు. తదుపరి ఏడాది కార్తీక దీపోత్సవం కోసం దాన్ని సిద్ధం చేస్తారు. ఇలా భారీ లోహపు పాత్ర నుంచి వేల కిలోల నెయ్యి వరకు.. ప్రతి ఏర్పాటులోనూ ప్రత్యేకతను సంతరించుకున్న తిరువణ్ణామలై మహా దీపం కేవలం ఓ ఉత్సవ ఘట్టం మాత్రమే కాదు. శివతత్వానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. అందుకే ఏటా లక్షలాది మంది భక్తులు ఆ జ్యోతి దర్శనం కోసం అరుణాచలానికి తరలివస్తుంటారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ తేదీలు ఖరారు

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు






