త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Banjara Hills Gold Theft | తమ్ముడితో కలిసి సేల్స్ బాయ్ స్కెచ్.. కిలో బంగారం కొట్టేసి అడ్డంగా దొరికారు

బంజారాహిల్స్‌లో ఓ నగల సంస్థలో భారీ చోరీకి పాల్పడిన సొంత ఉద్యోగి, అతడి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలోకు పైగా బంగారాన్ని రికవరీ చేశారు.

J

Crime | Published On Jul 22, 2026, 7.36 pm IST

Banjara Hills Gold Theft | తమ్ముడితో కలిసి సేల్స్ బాయ్ స్కెచ్.. కిలో బంగారం కొట్టేసి అడ్డంగా దొరికారు
Advertisement
  • బంజారాహిల్స్‌లోని 'గురుకృపా ఎక్స్‌పోర్ట్స్'లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్
  • నిందితుల నుంచి 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలు నూరు శాతం రికవరీ
  • ఆర్థిక ఇబ్బందులతో కంపెనీకే కన్నం వేసిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ హరీష్, అతడి తమ్ముడు ఆకాష్
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మంగళ్‌హాట్‌లో నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Banjara Hills Gold Theft | త్రినేత్ర.న్యూస్ : నమ్మకంగా పనిచేయాల్సిన ఉద్యోగే కంపెనీకి కన్నం వేశాడు. ఆర్థిక ఇబ్బందులు, విలాసాలకు అలవాటు పడి తన సొంత తమ్ముడితో కలిసి పక్కా స్కెచ్‌తో భారీ చోరీకి పాల్పడ్డాడు. కానీ, హైదరాబాద్ (Hyderabad) పోలీసుల దర్యాప్తు ముందు వారి ఆటలు సాగలేదు. బంజారాహిల్స్‌లో (Banjara hills) రాత్రి వేళ జరిగిన ఈ భారీ చోరీ కేసును జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి ఏకంగా కిలోకు పైగా బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.

కేసుకు సంబంధించిన వివరాలు

సన్ కాంబ్లే హరీష్ (29), సన్ కాంబ్లే ఆకాష్ (25) సొంత అన్నదమ్ములు. వీరు కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందినవారు కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో నివాసం ఉంటున్నారు. హరీష్ బంజారాహిల్స్‌లోని 'గురుకృపా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్'లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా (Sales Executive) పనిచేస్తుండగా, తమ్ముడు ఆకాష్ హైటెక్ సిటీలోని పీడబ్ల్యూసీ (PWC) కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

పక్కా స్కెచ్.. పవర్ కట్ చేసి

వృత్తిలో భాగంగా హరీష్ నగరంలోని ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లకు (Jewellery showrooms) కొత్త డైమండ్, గోల్డ్ డిజైన్లను చూపించి ఆర్డర్లు తీసుకునేవాడు. అనంతరం ఆభరణాలను డెలివరీ చేసేవాడు. కంపెనీకి చెందిన విలువైన ఆభరణాలను ఆఫీస్ లాకర్‌లో ఉంచుతారన్న విషయం అతడికి బాగా తెలుసు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ లాకర్‌లోని బంగారాన్ని కొట్టేయాలని తమ్ముడు ఆకాష్‌తో కలిసి ప్లాన్ వేశాడు.

Hyderabad Crime Police Arrest Brothers for 1Kg Gold Theft in Banjara Hills

జూలై 16న ఆఫీసులో వీరు చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. మరుసటి రోజు (జూలై 17) రాత్రి సమయంలో ఆఫీసు పవర్ ఆఫ్ (Power cut) చేసి, బాత్రూమ్ గ్రిల్ పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌లోని బంగారు నగలను దొంగిలించి, ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆభరణాలను తమ్ముడికి అప్పగించాడు.

సీసీటీవీల సాయంతో అరెస్ట్

కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ (Task Force) బృందం.. సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage), సాంకేతిక ఆధారాలతో నిందితులను మంగళ్‌హాట్ ఏరియాలో పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 7 బంగారు నెక్లెస్‌లు, 7 జతల బంగారు కమ్మలను పోలీసులు క్షేమంగా రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం బరువు 1 కిలో 28.59 గ్రాములు ఉంటుందని టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. యాదేందర్, ఎస్సై మహమ్మద్ జాహెద్, బంజారాహిల్స్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement