త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | బాయ్‌కాట్ నిర్ణ‌యం వెన‌క్కి.. భార‌త్ తో మ్యాచ్‌కు పాక్ ఓకే..

T20 World Cup 2026 | ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో ఆడబోమంటూ పాకిస్థాన్ తీసుకున్న బాయ్‌కాట్‌ నిర్ణయంపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. ఐసీసీతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వ ప్రకటనల అనంతరం, ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్ జరుగుతుందని అధికారికంగా స్పష్టం అయ్యింది.

S

Cricket | Published On Feb 10, 2026, 7.01 am IST

T20 World Cup 2026 | బాయ్‌కాట్ నిర్ణ‌యం వెన‌క్కి.. భార‌త్ తో మ్యాచ్‌కు పాక్ ఓకే..
Advertisement

T20 World Cup 2026 | ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో ఆడబోమంటూ పాకిస్థాన్ తీసుకున్న బాయ్‌కాట్‌ నిర్ణయంపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. ఐసీసీతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వ ప్రకటనల అనంతరం, ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్ జరుగుతుందని అధికారికంగా స్పష్టం అయ్యింది. ఈ మ్యాచ్ ను టోర్నీలో అత్యంత కీలకమైన, వాణిజ్యపరంగా ముఖ్యమైన పోరుగా భావిస్తున్నారు. చివరకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీక‌రించ‌డంతో మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. శ్రీలంక, యూఏఈ సహా పలు ఐసీసీ సభ్య దేశాలు మ్యాచ్ బహిష్కరణ వద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరినట్లు తెలిపింది. ఇతర దేశాలపై ఆర్థిక ప్రభావం పడుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు పేర్కొంది.

పాక్‌కు స్నేహ పూర్వ‌క దేశాల అభ్య‌ర్థ‌న‌..

ఈ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్‌, శ్రీలంక అధ్యక్షుడు కుమార దిస‌నాయ‌కెతో నేరుగా మాట్లాడినట్లు ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించారు. బహుపాక్షిక చర్చల ఫలితంగా, స్నేహపూర్వక దేశాల అభ్యర్థన మేరకు, ఫిబ్రవరి 15, 2026న జరిగే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది. క్రికెట్ ను కాపాడడం, ఈ గ్లోబల్ క్రీడ సుస్థిర‌త‌ను నిలబెట్టడమే ఈ నిర్ణయ ఉద్దేశం.. అని ప్రకటనలో పేర్కొంది. మ‌రోవైపు ఐసీసీ కూడా చర్చలు విజయవంతమయ్యాయని వెల్లడించింది. ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన సంభాషణలు పరస్పర గౌరవం, నిష్పక్షపాతత్వం, సహకారం ఆధారంగా సాగాయని తెలిపింది. సభ్య దేశాలు టోర్నీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, టీ20 వరల్డ్‌కప్ విజయవంతంగా సాగేందుకు అందరూ సహకరించాలని అంగీకారం కుదిరిందని ఐసీసీ పేర్కొంది.

బంగ్లాదేశ్‌పై ఎలాంటి పెనాల్టీ లేదు..

ఈ చర్చల్లో మరో కీలక అంశం బంగ్లాదేశ్ గా నిలిచింది. భారత్‌లో ఆడబోమన్న కారణంతో బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించినప్పటికీ, వారికి ఎలాంటి శిక్ష విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. ఇదే పాకిస్థాన్ ప్రధాన అభ్యంతరంగా నిలిచింది. పీసీబీ చైర్మన్ మోహ్సిన్ న‌క్వీ ఈ నిర్ణయాన్ని ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలుగా పేర్కొంటూ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని కూడా బంగ్లాదేశ్ వ్యవహారంతో పాకిస్థాన్ అనుసంధానించింది. కాగా గత రెండు వారాలుగా ఐసీసీ, పీసీబీ, బీసీబీ మధ్య బ్యాక్‌డోర్ చర్చలు సాగాయి. లాహోర్‌లో జరిగిన కీలక సమావేశంలో మొహ్సిన్ నక్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమినుల్ ఇస్లాం, ఐసీసీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖ‌వాజా పాల్గొన్నారు. ఇక బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్థానే కావడం గమనార్హం. చివరకు బంగ్లాదేశ్‌కు ఎలాంటి శిక్ష లేకపోవడం, 2028-31 సైకిల్‌లో అదనపు ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు ఇవ్వడం వంటి నిర్ణయాల‌ను తీసుకున్నారు.

ఈ పరిణామాల అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌తో మ్యాచ్ ఆడాలని కూడా కోరింది. ఆ వెంటనే పాకిస్థాన్ ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించింది. ఇక భార‌త్-పాక్ మ్యాచ్‌కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయ‌ని స్ప‌ష్ట‌మైంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు మార్గం సుగ‌మం అయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ పోరు ఇక జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్ట‌మ‌వ‌డంతో ఫ్యాన్స్ సైతం హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement