త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SEBI | మార్జిన్ ట్రేడింగ్‌పై కొత్త ఆంక్షలా..? సెబీ కీలక స్పష్టత..

SEBI | మార్జిన్ ట్రేడింగ్ ద్వారా షేర్ల కొనుగోళ్లపై ఆంక్షలు విధించే ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సెబీ వర్గాలు స్పష్టం చేశాయి. కంపెనీల ఫ్రీ ఫ్లోట్‌లో మార్జిన్ నిధులతో కొనుగోలు చేసిన షేర్ల వాటాను పరిమితం చేసే అంశంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు కొత్త నిబంధనలు వచ్చే అవకాశం లేదని తెలిపాయి.

S

Business | Published On Nov 18, 2026, 1.11 pm IST

SEBI | మార్జిన్ ట్రేడింగ్‌పై కొత్త ఆంక్షలా..? సెబీ కీలక స్పష్టత..
Advertisement

SEBI | మార్జిన్ ట్రేడింగ్ ద్వారా షేర్ల కొనుగోళ్లపై ఆంక్షలు విధించే ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సెబీ వర్గాలు స్పష్టం చేశాయి. కంపెనీల ఫ్రీ ఫ్లోట్‌లో మార్జిన్ నిధులతో కొనుగోలు చేసిన షేర్ల వాటాను పరిమితం చేసే అంశంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు కొత్త నిబంధనలు వచ్చే అవకాశం లేదని తెలిపాయి.

సెబీ ప‌రిమితులు విధించ‌నుందా.?

మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) ద్వారా షేర్ల కొనుగోళ్లపై పరిమితులు విధించాలనే ప్రతిపాదనపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీల ఫ్రీ ఫ్లోట్‌లో మార్జిన్ నిధులతో కొనుగోలు చేసిన షేర్లు నిర్దిష్ట స్థాయికి చేరితే, కొత్త కొనుగోళ్లను నియంత్రించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు గతంలో రాయిటర్స్ కథనం వెల్లడించింది. అయితే, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడం, విశ్లేషించడం సెబీలో సాధారణ ప్రక్రియేనని అధికారులు తెలిపారు. ఇలాంటి అంతర్గత చర్చలను కొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రాబోతున్నాయనే సంకేతంగా భావించకూడదని స్పష్టం చేశారు. ఏవైనా మార్పులు ప్రతిపాదిస్తే సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న ఎంటీఎఫ్ కార్య‌క‌లాపాలు..

మరోవైపు, దేశీయ మార్కెట్లో మార్జిన్ ట్రేడింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. బ్రోకర్ల నుంచి రుణం తీసుకుని ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసే విధానాన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి నాలుగు రెట్ల వరకు బ్రోకర్ల నుంచి నిధులు పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా 9 నుంచి 18 శాతం మధ్య ఉంటాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఎంటీఎఫ్ ద్వారా పెండింగ్‌లో ఉన్న పెట్టుబడుల విలువ రూ.1.53 లక్షల కోట్లకు (సుమారు 16.3 బిలియన్ డాలర్లు) చేరింది. ఇది గతేడాదితో పోలిస్తే 29 శాతం అధికం కాగా, 2024 చివరి నాటితో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఈ పెట్టుబడుల్లో దాదాపు మూడింట రెండొంతులు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలోనే కేంద్రీకృతమై ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఎంటీఎఫ్‌ను నిషేధిస్తారా..?

ఫ్రీ ఫ్లోట్‌లో మార్జిన్ నిధులతో కొనుగోలు చేసిన షేర్ల వాటా 5 నుంచి 10 శాతానికి చేరినప్పుడు కొత్త ఎంటీఎఫ్ కొనుగోళ్లను నియంత్రించే ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు రాయిటర్స్ వెల్లడించింది. అయితే దీనిపై ఎలాంటి తుది పరిమితులు నిర్ణయించలేదు. ఎక్స్ఛేంజీల గణాంకాల ప్రకారం కనీసం 36 కంపెనీల షేర్లలో ఫ్రీ ఫ్లోట్‌లో 10 శాతానికి మించి మార్జిన్ నిధులతో కొనుగోళ్లు జరగ్గా, 220కు పైగా షేర్లలో ఈ వాటా 5 శాతాన్ని దాటింది. అయితే, మార్జిన్ ట్రేడింగ్‌ను పూర్తిగా నిషేధించే ఆలోచన సెబీకి లేదని నివేదిక పేర్కొంది. అధిక రుణాలతో ఒకే తరహా షేర్లలో పెట్టుబడులు కేంద్రీకృతం కావడం వల్ల తలెత్తే నష్టభయాలను తగ్గించడంపైనే ప్రతిపాదిత మార్పుల దృష్టి ఉండే అవకాశం ఉంది.

Advertisement
Advertisement