త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices | భారీగా ప‌త‌న‌మ‌వుతున్న బంగారం ధ‌ర‌లు.. కార‌ణాలేమిటి..?

Gold Prices | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలివ్వడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్ బలపడడం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి. దీంతో బంగారం 15 నెలల కనిష్ఠానికి పడిపోగా, వెండి ధర కూడా కిలోకు రూ.1.48 లక్షల స్థాయికి చేరింది.

S

Business | Published On Nov 20, 2026, 1.05 pm IST

Gold Prices | భారీగా ప‌త‌న‌మ‌వుతున్న బంగారం ధ‌ర‌లు.. కార‌ణాలేమిటి..?
Advertisement

Gold Prices | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలివ్వడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్ బలపడడం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి. దీంతో బంగారం 15 నెలల కనిష్ఠానికి పడిపోగా, వెండి ధర కూడా కిలోకు రూ.1.48 లక్షల స్థాయికి చేరింది.

ఏడాది క‌నిష్ట స్థాయిల‌కు బంగారం ధ‌ర‌..

దేశీయ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ ధర 3.84 శాతం (రూ.4,891) తగ్గి 10 గ్రాములకు రూ.1,22,561కు పడిపోయింది. గత సెషన్‌లో ఈ ధర రూ.1,27,452గా ఉంది. దీంతో బంగారం ధర ఆగస్టు 2025 తర్వాత కనిష్ఠ స్థాయికి చేరింది. మరోవైపు డిసెంబర్ డెలివరీ వెండి ఫ్యూచర్స్ ధర 5.99 శాతం (రూ.9,432) తగ్గి కిలోకు రూ.1,48,050కు చేరింది. గత ముగింపు ధర రూ.1,57,482గా ఉంది. సెప్టెంబర్ 2025 తర్వాత వెండి ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర దాదాపు 9 శాతం, తొమ్మిది సెషన్లలో 15 శాతం తగ్గింది. వెండి ధర మూడు సెషన్లలో దాదాపు 13 శాతం, ఏడు సెషన్లలో 20 శాతం క్షీణించింది.

బంగారం ధ‌ర‌ల ప‌త‌నం వెనుక ఉన్న కార‌ణాలు..

బంగారం, వెండి ధరలు పతనం కావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వెలువడుతున్న కఠిన ద్రవ్య విధాన సంకేతాలు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అవసరమైతే వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలున్నాయని ఫెడ్ అధికారులు సూచిస్తున్నారు. చికాగో ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు ఆస్టన్ గూల్స్‌బీ కూడా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. రెండో కారణం అమెరికా ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు. అమెరికా పదేళ్ల ట్రెజరీ బాండ్ యీల్డ్ వరుసగా 29 సెషన్ల పాటు 5 శాతానికి పైగా కొనసాగేందుకు సిద్ధంగా ఉంది. 2007 తర్వాత ఇలాంటి పరిస్థితి మళ్లీ కనిపించడం గమనార్హం. బాండ్ల ద్వారా అధిక రాబడులు లభించే అవకాశం ఉండడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారు.

బ‌ల‌ప‌డుతున్న డాల‌ర్‌..

మూడో కారణం అమెరికా డాలర్ బలపడడం. ఈ వారం డాలర్ సూచీ 0.7 శాతం పెరిగింది. దీంతో ఇతర కరెన్సీలలో కొనుగోలు చేసే వారికి డాలర్ విలువ ఆధారంగా నిర్ణయించే బంగారం, వెండి మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఈ మూడు పరిణామాలు కలిసి విలువైన లోహాల ధరలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. మరోవైపు 2027 చివరి నాటికి వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ప్రధాన కేంద్ర బ్యాంకులు పూర్తి చేసిన తర్వాత, అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వంటి సంస్థలు దీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లను దాదాపు స్థిరంగా కొనసాగిస్తాయని అంతర్జాతీయ పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, డాలర్ విలువ, బాండ్ రాబడుల కదలికలు బంగారం, వెండి ధరల తదుపరి గమనాన్ని నిర్ణయించనున్నాయి.

Advertisement
Advertisement