త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం

Sridhar Babu | హైదరాబాద్‌ (Hyderabad)ను ఏఐ, పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు.

S

Telangana | Published On Nov 20, 2026, 7.03 pm IST

Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం
Advertisement
  • అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇస్తాం
  • గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు వెల్ల‌డి

Sridhar Babu | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌ (Hyderabad)ను ఏఐ, పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. ఐక్యరాజ్యసమితి వేదికగా 1M1B సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని చెప్పారు. ప్రస్తుతం ఏఐ, అధునాతన తయారీ సహా నూతన సాంకేతిక రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, బలమైన పారిశ్రామిక పునాదులు రాష్ట్రానికి ప్రధాన బలమన్నారు.

సాంకేతిక అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలను వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి వంటి రంగాల్లో వినియోగించడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు, మానవాభివృద్ధి సమాంతరంగా సాగినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే బలమైన ఆవిష్కరణల వ్యవస్థ ఏర్పడుతుందన్నారు.

ఆ దిశగా తమ ప్రభుత్వం ఇన్నోవేషన్ ఆధారిత ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తోందన్నారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంతో పాటు, వారి ఆలోచనలను ప్రపంచస్థాయి ఆవిష్కరణలుగా మలిచేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి.. రైజింగ్ తెలంగాణ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను శ్రీ‌ధ‌ర్‌బాబు ఆహ్వానించారు. అంత‌కుముందు తెలంగాణలో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, ఏఐ, అధునాతన తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వివరించారు.

Advertisement
Advertisement