త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SCSS | రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో బ‌లంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఎస్‌సీఎస్‌ఎస్ ప్ర‌యోజ‌నాలేంటి..?

SCSS | రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడి పెట్టే వారికి సీనియ‌ర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఎస్‌సీఎస్‌ఎస్ ఖాతా మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత అదే పథకంలో మరో మూడు సంవత్సరాలకు కొనసాగించాలా? లేక ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లేదా ఇతర తక్కువ రిస్క్ పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలా? అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంది.

S

Business | Published On Jun 26, 2026, 2.35 pm IST

SCSS | రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో బ‌లంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఎస్‌సీఎస్‌ఎస్ ప్ర‌యోజ‌నాలేంటి..?
Advertisement

SCSS | రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడి పెట్టే వారికి సీనియ‌ర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఎస్‌సీఎస్‌ఎస్ ఖాతా మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత అదే పథకంలో మరో మూడు సంవత్సరాలకు కొనసాగించాలా? లేక ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లేదా ఇతర తక్కువ రిస్క్ పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలా? అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంది. ఈ నిర్ణయం వ్య‌క్తిగ‌త ఆర్థిక భద్రతపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఎస్‌సీఎస్‌ఎస్ డిపాజిట్ మెచ్యూరిటీ అయిన వెంటనే చాలామంది తిరిగి అదే పథకంలో మరో మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు పెట్టుబడి పెడతారు. చాలా సందర్భాల్లో ఇదే సరైన నిర్ణయంగా భావిస్తారు. అయితే మళ్లీ పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర స్థిర ఆదాయ పెట్టుబడి అవకాశాలను పోల్చి చూడటం, గత ఐదేళ్లలో వ్య‌క్తిగ‌త‌ ఆర్థిక అవసరాలు మారాయా లేదా అనే విష‌యాల‌ను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

అత్య‌ధికంగా 8.2 శాతం వ‌డ్డీ..

ఎస్‌సీఎస్‌ఎస్ ప్రస్తుతం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. వడ్డీని ప్రతి త్రైమాసికంలో ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీల్లో చెల్లిస్తారు. ఈ ఖాతాలో రూ.1వేయి గుణాంకాల్లో ఒక్క డిపాజిట్ మాత్రమే చేయవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచే రోజున పెట్టుబడిదారుడి వయస్సు కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద పన్ను మినహాయింపు పొంద‌వ‌చ్చు. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఐదేళ్ల పాటు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. మధ్యలో మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినా ఆరంభంలో నిర్ణయించిన రేటే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ హామీతో కొన‌సాగే ఈ పథకం అత్యంత భద్రమైన స్థిర ఆదాయ పెట్టుబడులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పూర్తిగా పన్నుకు లోబడి ఉంటుంది. మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే టీడీఎస్ మినహాయింపు కోసం ఫామ్‌ 15హెచ్ సమర్పించవచ్చు.

త‌రువాత ఎందులో పెట్టుబ‌డి పెట్టాలి..?

మెచ్యూరిటీ మొత్తాన్ని తిరిగి ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయంలో బ్యాంకుల సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఒక ఎంపికగా ఉంటాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఐదేళ్ల డిపాజిట్లపై సుమారు 7.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. ఇది ఎస్‌సీఎస్‌ఎస్ కంటే తక్కువే అయినప్పటికీ డబ్బును అవసరమైతే ముందుగానే ఉపసంహరించుకునే వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు జరిమానాతో ముందస్తు ఉపసంహరణకు అనుమతిస్తాయి. వైద్య ఖర్చులు లేదా అత్యవసర సమయంలో ఇది ఉపయోగపడుతుంది. ప్రతి త్రైమాసికం కాకుండా ప్రతి నెలా ఆదాయం కావాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ (POMIS) మరో ప్రత్యామ్నాయంగా ఉంది. ప్రస్తుతం ఈ పథకం సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. వడ్డీ ప్రతి నెలా జమ అవుతుంది. ఎస్‌సీఎస్‌ఎస్‌తో పోలిస్తే రాబడి తక్కువ అయినప్పటికీ నెలవారీ ఆదాయం కారణంగా రోజువారీ ఖర్చులను నిర్వహించడం సులభమవుతుంది. ఈ పథకంలో వ్యక్తిగత ఖాతాకు రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాకు రూ.15 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల ఇది రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉపయోగపడుతుంది కానీ ఒక్కటే ఆదాయ వనరుగా సరిపోదు.

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని కూడా ప‌రిగ‌ణించాలి..

కొంతమంది రిటైర్డ్ వ్యక్తులు తమ పొదుపులో చిన్న భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్లు లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశాలు ఇవి కల్పించినప్పటికీ, మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడులు పెరిగే లేదా త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమంలో కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఉదాహరణకు, పెట్టుబడికి 7.5 శాతం రాబడి వచ్చినా ప్రతి సంవత్సరం ధరలు 5 శాతం పెరిగితే, వాస్తవంగా సంపద పెరుగుదల కనిపించేంత ఎక్కువగా ఉండదు. చాలా మంది రిటైర్డ్ వ్యక్తులకు ఒకే పెట్టుబడిపై ఆధారపడటం కంటే వివిధ పథకాల కలయిక మెరుగైన ఎంపికగా ఉంటుంది. ఎస్‌సీఎస్‌ఎస్ ప్రధాన ఆదాయ వనరుగా ఉండగా, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా లిక్విడిటీ లేదా నెలవారీ నగదు ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే మార్కెట్‌కు అనుసంధానమైన పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు అనుగుణంగా..

ఏ పెట్టుబడి కలయిక సరిపోతుందనే విష‌యం వయస్సు, నెలవారీ ఖర్చులు, ఆరోగ్య పరిస్థితి, ఇప్పటికే ఉన్న పొదుపులు, పన్ను పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ పెట్టుబడుల విషయంలో కేవలం ఎక్కువ వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. మంచి రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో స్థిరమైన ఆదాయాన్ని అందించడంతోపాటు, పొదుపులను భద్రపరచాలి. అవసరమైనప్పుడు డబ్బును వినియోగించుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించాలి. కొద్దిగా ఎక్కువ రాబడి కోసం లిక్విడిటీని కోల్పోవడం లేదా అధిక పన్ను భారం మోయడం ప్రతి సందర్భంలో సరైన నిర్ణయం కాదు. అయితే ఏ ప‌థ‌కంలో అయినా పెట్టుబ‌డి పెట్టేముందు ఆర్థిక ల‌క్ష్యాలు, రిస్క్ సామ‌ర్థ్యం వంటి అంచ‌నాల‌ను స్వ‌యంగా అంచ‌నా వేయాల్సి ఉంటుంది. ఇందుకు అవ‌సరం అయితే నిపుణుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement