త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో క‌నీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?

Minimum Balance | సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు ముందుగా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కనీస బ్యాలెన్స్ మొత్తం మీరు నివసించే ప్రాంతం (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో)తోపాటు ఎంచుకునే అకౌంట్ రకాన్ని బట్టి మారుతుంది.

S

Business | Published On Aug 1, 2026, 1.53 pm IST

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో క‌నీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?
Advertisement

Minimum Balance | సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు ముందుగా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కనీస బ్యాలెన్స్ మొత్తం మీరు నివసించే ప్రాంతం (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో)తోపాటు ఎంచుకునే అకౌంట్ రకాన్ని బట్టి మారుతుంది. బ్యాంకులు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్‌ను ఖాతాలో నిర్వహించకపోతే జరిమానాలు విధిస్తాయి. దేశంలోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో అమల్లో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ సౌక‌ర్యం..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ఎస్‌బీఐలోని అన్ని సాధారణ సేవింగ్స్ అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఎలాంటి జరిమానా విధించరు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే సాధారణ సేవింగ్స్ అకౌంట్లలో చెక్‌బుక్ ఉన్నదా లేదా అనే అంశం ఆధారంగా కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చెక్‌బుక్ ఉంటే రూ.250, లేకపోతే రూ.100 బ్యాలెన్స్ ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో చెక్‌బుక్ ఉంటే రూ.500, లేకపోతే రూ.250 అవసరం. అర్బన్, మెట్రో ప్రాంతాల్లో చెక్‌బుక్ ఉన్నవారు రూ.1వేయి, చెక్‌బుక్ లేనివారు రూ.500 కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి.

ప్ర‌ధాన ప్రైవేటు బ్యాంకుల్లో..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ సేవింగ్స్ అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఇవ్వదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5వేలు, అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.10వేల కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సాధారణ సేవింగ్స్ అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం కల్పించదు. గ్రామీణ శాఖల్లో కనీసం రూ.1వేయి లేదా కొన్ని గ్రామీణ శాఖల నిబంధనల ప్రకారం రూ.2వేల వరకు నిర్వహించాల్సి ఉంటుంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5వేలు, అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.10వేల మినిమమ్ బ్యాలెన్స్ అవసరం. యాక్సిస్ బ్యాంక్ లో కూడా సాధారణ సేవింగ్స్ అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5వేలు, అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.12వేల కనీస బ్యాలెన్స్ ఉండాలి. లేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఇత‌ర బ్యాంకుల్లో..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో సాధారణ అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం లేకపోయినా ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే మినిమమ్ బ్యాలెన్స్ పరిమితులు తక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1వేయి, అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.2వేల క‌నీస బ్యాలెన్స్ నిర్వహించాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్లు ఉన్నప్పటికీ ఏ అకౌంట్‌కూ జీరో బ్యాలెన్స్ సౌకర్యం లేదు. జనరల్ సేవింగ్స్ అకౌంట్ (గ్రామీణ)కు రూ.500, బీఓఐ స్టార్ ఉమెన్స్ అకౌంట్‌కు రూ.5వేలు, బీఓఐ స్టార్ సీనియర్ సిటిజన్ అకౌంట్‌కు రూ.10వేల కనీస బ్యాలెన్స్ అవసరం. మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధిస్తారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లో సాధారణ సేవింగ్స్ అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ ఆప్షన్ లేదు. కస్టమర్ ఎంచుకునే అకౌంట్ రకాన్ని బట్టి రూ.10వేలు లేదా రూ.25వేల కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది.

సేవింగ్స్ అకౌంట్‌ల‌ను ప్రారంభిస్తే..

కోటక్ మహీంద్రా బ్యాంక్ లో కొన్ని ప్రత్యేక అకౌంట్లకు మాత్రమే జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఉంది. సంకల్ప్ సేవింగ్స్ అకౌంట్‌కు రూ.2,500, నోవా సేవింగ్స్ అకౌంట్‌కు రూ.5వేలు, ఎడ్జ్, క్లాసిక్ అకౌంట్లకు రూ.10వేలు, ఎవ్రీడే, ప్రొ అకౌంట్లకు రూ.20వేలు, ఏస్ సేవింగ్స్ అకౌంట్‌కు రూ.50వేల మినిమమ్ బ్యాలెన్స్ అవసరం. ఆర్‌బీఎల్ బ్యాంక్ లో కూడా కొన్ని ఎంపిక చేసిన అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం లభిస్తుంది. అయితే డిజిటల్, సీనియర్స్ ఫస్ట్ అకౌంట్లకు రూ.5వేలు, ప్రైమ్ ఎడ్జ్, ఉమెన్స్ ఫస్ట్ అకౌంట్లకు రూ.10వేలు, అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్‌కు రూ.25వేలు, ఆర్‌బీఎల్ రైజ్ అకౌంట్‌కు రూ.50వేల కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి. లేకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు బ్యాంక్ అందించే సౌకర్యాలతో పాటు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల వినియోగదారులకు తక్కువ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత అనుకూలంగా ఉంటాయి.

Advertisement
Advertisement