త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pre Budget | ప్రీ-బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?

Pre Budget | వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల మూడో వారం నుంచి ప్రీ-బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్‌ 20 తర్వాత ఆర్థికవేత్తలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలతో చర్చలు జరపనుంది.

P

Business | Published On Nov 15, 2026, 2.56 pm IST

Pre Budget | ప్రీ-బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
Advertisement

Pre Budget | వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల మూడో వారం నుంచి ప్రీ-బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్‌ 20 తర్వాత ఆర్థికవేత్తలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలతో చర్చలు జరపనుంది. అయితే సమావేశాల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కేంద్ర బడ్జెట్‌ తయారీలో భాగంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశాల కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అదనపు కార్యదర్శుల స్థాయిలో వివిధ శాఖలతో సంప్రదింపులు జరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలను (Revised Estimates) ఖరారు చేసేందుకు బడ్జెట్‌ విభాగం సంయుక్త కార్యదర్శి.. వ్యయ విభాగం అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశాలు ఆదివారంతో ముగియ‌నున్నాయి.

క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నుపై దృష్టి

వచ్చే బడ్జెట్‌లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులపై విధించే పన్నులకు సంబంధించి కీలక మార్పులు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG), సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (STT) రెండూ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌టీటీ (STT) కొనసాగిస్తే.. ఎల్‌జీసీటీ (LTCG) పన్నును తొలగించాలని పెట్టుబడిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 2024 జూలై బడ్జెట్‌లో కేంద్రం ఈక్విటీలపై ఎల్‌టీసీజీ పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (STCG)ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. అప్పటి నుంచి స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పన్నుల తగ్గింపుపై ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారు.

రెండేళ్ల పెట్టుబడులపై ఎల్‌టీసీజీ మినహాయింపు?

పారిశ్రామిక సంఘం అసోచామ్‌ (ASSOCHAM) ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రతిపాదనల్లో కీలక సూచనలు చేసింది. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈక్విటీల్లో పెట్టుబడి కొనసాగిస్తే LTCG పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాల‌ని, ఏడాదికి పైగా, రెండేళ్లలోపు కొనసాగించే పెట్టుబడులపై LTCG పన్నును 10 శాతానికి పరిమితం చేయాలి కోరింది. దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పన్ను రాయితీలు, ఎల్‌టీసీజీ మిన‌హాయింపు లేదంటే ఎస్‌టీటీతో ప‌న్ను స‌ర్దుబాటు చేసే వెసులుబాటు క‌ల్పించాల‌ని సూచించింది. మరోవైపు, పరిశ్రమల సంఘాలు, వ్యాపార వర్గాల నుంచి పన్నులకు సంబంధించిన విజ్ఞప్తులు ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగానికి పెద్దఎత్తున అందుతున్నాయి. వీటిని పరిశీలించి వచ్చే బడ్జెట్‌లో ఏయే మార్పులు చేపట్టాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మొత్తంగా ఈసారి బడ్జెట్‌లో పెట్టుబడిదారులకు పన్ను ఊరట, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక వృద్ధికి దోహదపడే చర్యలపై ఆసక్తి నెలకొంది.

 

 

Advertisement
Advertisement