త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pending Cases | కోర్టుల్లో కొండ‌లా కేసులు..

Pending Cases | దేశ న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోర్టుల్లో కేసులు కొండలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారించే న్యాయమూర్తుల కొరత మాత్రం తీరడం లేదు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో 7,300కు పైగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా.. హైకోర్టుల్లోనూ దాదాపు 300 పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు.

P

National | Published On Nov 15, 2026, 1.15 pm IST

Pending Cases | కోర్టుల్లో కొండ‌లా కేసులు..
Advertisement
  • దేశ‌వ్యాప్తంగా 5.8కోట్ల కేసులు పెండింగ్‌
  • న్యాయవ్యవస్థపై పెరుగుతున్న భారం
  • సుప్రీంకోర్టులోనే 95వేల దాకా..
  • జిల్లా కోర్టుల్లో 7300పైగా న్యాయ‌మూర్తుల పోస్టులు ఖాళీ
  • నియామ‌కాల్లో వేగం, కొలీజియం వ్యవస్థలో పారదర్శకత అవ‌స‌రం
  • ప్రభుత్వ శాఖల నుంచి సహకారం ఉండాలంటున్న మాజీ న్యాయ‌మూర్తులు

Pending Cases | దేశ న్యాయవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోర్టుల్లో కేసులు కొండలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారించే న్యాయమూర్తుల కొరత మాత్రం తీరడం లేదు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో 7,300కు పైగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా.. హైకోర్టుల్లోనూ దాదాపు 300 పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా దేశవ్యాప్తంగా పెండింగ్‌ కేసుల సంఖ్య 5.8 కోట్లకు చేరింది. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధితులకు ఏళ్ల తరబడి ఎదురుచూపులే మిగులుతున్నాయి.

నియామకాల్లో జాప్యమే ప్రధాన సమస్య

న్యాయమూర్తుల పదవీ విరమణ తేదీలు ముందే తెలిసినా.. ఖాళీల భర్తీ ప్రక్రియ మాత్రం వారు రిటైరైన తర్వాతే మొదలవుతోందని అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఆర్ సింగ్‌ అభిప్రాయపడ్డారు. హైకోర్టు కొలీజియం నుంచి న్యాయశాఖకు, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు.. తిరిగి కొలీజియంలకు, ప్రభుత్వానికి ఫైళ్లు చేరేందుకు ఏడాది నుంచి మూడేళ్ల వరకు సమయం పడుతోందన్నారు. ఒక ఖాళీ భర్తీ అయ్యేలోగా మరో రెండు పోస్టులు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇది చట్టంలోని లోపం కాదని, న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యమే అసలు సమస్యని స్పష్టం చేశారు.

ఆరు నెలల్లో ఖాళీల భర్తీకి ప్రతిపాదన

న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు నిర్దిష్ట గడువులు విధించాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేసీ కౌశిక్‌ సూచించారు.

  • ఖాళీ ఏర్పడటానికి ఆరు నెలల ముందే హైకోర్టు కొలీజియం పేర్లను సిఫారసు చేయాలి.
  • కేంద్ర ప్రభుత్వం 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి.
  • సుప్రీంకోర్టు కొలీజియం 90 రోజుల్లో సిఫారసులపై నిర్ణయించాలి.
  • ప్రభుత్వం స్పందించకపోతే సిఫారసుకు ఆమోదం లభించినట్లుగానే పరిగణించాలి.
  • ఏ న్యాయమూర్తి పోస్టూ ఆరు నెలలకు మించి ఖాళీగా ఉండకూడదు.

కొలీజియం వ్యవస్థలో పారదర్శకత పెరగాలని కౌశిక్‌ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులుగా ఎవరిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు? మరికొందరి పేర్లను ఎందుకు తిరస్కరిస్తున్నారు? అనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎంపిక ప్రమాణాలు, పరిశీలించిన పేర్లు, నిర్ణయాన్ని వాయిదా వేయడానికి గల కారణాలను వెల్లడించాల్సిందేన‌న్నారు.

నాలుగో వంతు పోస్టులు ఖాళీ

హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో మంజూరైన న్యాయమూర్తుల పోస్టుల్లో దాదాపు 25 శాతం ఖాళీగా ఉన్నాయని పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అంజనా ప్రకాశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కింది స్థాయి న్యాయస్థానాల్లోనే 2,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తుల కొరత కారణంగా సివిల్‌ వివాదాలు, క్రిమినల్‌ అప్పీల్స్‌, వైవాహిక సంబంధిత కేసులు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. సత్వర న్యాయం అందించాలన్న లక్ష్యానికి ఈ ఖాళీలు అడ్డంకిగా మారుతున్నాయంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సుప్రీంకోర్టులోనూ వేలాది కేసులు

నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ (NJDG) గణాంకాల ప్రకారం దేశంలోని హైకోర్టుల్లో 64 నుంచి 65.5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,122 మంజూరైన పోస్టులకు గానూ సుమారు 300 నుంచి 350 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్‌ 2026 నాటికి సుప్రీంకోర్టులోనూ దాదాపు 93వేల నుంచి 95వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు 18,375 సివిల్‌ కేసులు, 73,967 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ప్రభుత్వ శాఖల తీరుతోనూ జాప్యం

కేసుల పరిష్కారంలో ఆలస్యానికి న్యాయమూర్తుల కొరత ఒక్కటే కారణం కాదని అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్‌ మాథుర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ సంస్థల నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోందన్నారు. దేశంలో అత్యధికంగా కేసులు వేసే పక్షాల్లో ప్రభుత్వమే ముందుంటుందని, అయినప్పటికీ కోర్టు విచారణలకు సన్నద్ధత కొరవడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తగిన సమాచారంతో హాజరుకాకపోవడం, సరైన న్యాయ సలహాలు అందకపోవడం వల్ల విచారణలు వాయిదా పడుతున్నాయని వివరించారు. న్యాయమూర్తుల నియామకాల్లో వేగం, కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, ప్రభుత్వ శాఖల నుంచి సహకారం.. ఈ మూడు అంశాలపై దృష్టి సారిస్తేనే పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించి సామాన్యులకు సత్వర న్యాయం అందించే అవకాశం ఉంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement