త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | రికార్డును సృష్టించేందుకు సిద్ధమైన విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌.. దేశ చరిత్రలో పొడవైన, అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు ఇవే..!

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఫిబ్రవరి ఒకటిన తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన బడ్జెట్‌ ప్రసంగాలు దేశ బడ్జెట్‌ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి. అలాగే, భారతదేశ బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో ఆసక్తికరమైన రికార్డులు ఎన్నో ఉన్నాయి.

P

Business | Published On Jan 31, 2026, 3.00 pm IST

Union Budget 2026 | రికార్డును సృష్టించేందుకు సిద్ధమైన విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌.. దేశ చరిత్రలో పొడవైన, అతి చిన్న బడ్జెట్ ప్రసంగాలు ఇవే..!
Advertisement

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఫిబ్రవరి ఒకటిన తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన బడ్జెట్‌ ప్రసంగాలు దేశ బడ్జెట్‌ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి. అలాగే, భారతదేశ బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో ఆసక్తికరమైన రికార్డులు ఎన్నో ఉన్నాయి. పదాల సంఖ్య, ప్రసంగం సమయం, బడ్జెట్‌ను ఎవరు ఎన్ని సార్లు ప్రవేశపెట్టారు అనే అంశాల్లో పలువురు ఆర్థిక మంత్రులు ప్రత్యేక గుర్తింపు పొందారు.

గత ఏడాది (2024) సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఆ సమయంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం సుమారు 56 నిమిషాలు కొనసాగింది. అనంతరం ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో జూలై 23న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రసంగం దాదాపు గంట 25 నిమిషాల పాటు సాగింది. అంతకుముందు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆమె చేసిన బడ్జెట్‌ ప్రసంగం 87 నిమిషాలు కొనసాగింది. 2022లో సుమారు 92 నిమిషాల పాటు మాట్లాడారు. 2019లో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆమె ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు కొనసాగింది. అప్పటివరకు ఉన్న రికార్డును బద్దలైంది.

దేశ చరిత్రలోనే అతి దీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం..

భారత బడ్జెట్‌ చరిత్రలోనే అతి దీర్ఘ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. ఇదే దేశ చరిత్రలో అత్యంత పొడవైన బడ్జెట్‌ ప్రసంగం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆరోగ్య కారణాలతో ఆ రోజు ప్రసంగాన్ని పూర్తిచేయలేక రెండు పేజీలను చదవకుండా వదిలివేశారు. అంతకంటే ముందు 2019లో చేసిన 2 గంటల 17 నిమిషాల ప్రసంగం కూడా అప్పటివరకు సుదీర్ఘ బడ్జెట్‌గా నిలిచింది. అలాగే, 2021–22లో ఆమె బడ్జెట్‌ ప్రసంగం 100 నిమిషాలు కొనసాగగా.. 2022–23లో సుమారు గంటన్నర పాటు బడ్జెట్‌ ప్రసంగం సాగింది.

జస్వంత్‌ సింగ్‌ రికార్డు..

నిర్మలా సీతారామన్‌కు ముందు అత్యంత దీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత జస్వంత్‌ సింగ్‌ గుర్తింపు పొందారు. 2003లో ఆయన సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేశారు. అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2014లో బడ్జెట్‌ ప్రసంగం 2 గంటల 10 నిమిషాలు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈసారి నిర్మలా సీతారామన్‌ చేసే బడ్జెట్‌ ప్రసంగం అందరి దృష్టి నెలకొన్నది. ఈ సారి బడ్జెట్‌ ఎంత సేపు కొనసాగుతుందనే ఉత్కంఠ నెలకొన్నది.

అతి చిన్న బడ్జెట్‌ ప్రసంగం..

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో హీరుభాయ్ ఎం పటేల్ చేశారు. ఆయన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలకే పరిమితమైంది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగాల్లో అతి చిన్నదిగా వీబీ చవాన్‌ బడ్జెట్‌ ప్రసంగం నిలిచింది. ఆయన బడ్జెట్ ప్రసంగం సుమారు 9,300 పదాలతో సాగింది. దాదాపు 10వేల పదాలతో మొరార్జీ దేశాయ్ ప్రసంగం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. పదాల పరంగా చూస్తే ఇప్పటివరకు అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగాన్ని 1991లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేశారు. ఆ చారిత్రక బడ్జెట్ ప్రసంగం సుమారు 18,700 పదాలతో రికార్డు సృష్టించింది. ఆయన తర్వాత యశ్వంత్ సిన్హా చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 15,700 పదాలతో రెండో స్థానంలో నిలిచింది.

మొరార్జీ దేశాయ్ రికార్డు..

బడ్జెట్‌ను అత్యధికసార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డు నెలకొల్పారు. ఆయన మొత్తం 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన పీ చిదరంబరం ప్రణబ్ ముఖర్జీలు తొమ్మిది సార్లు చొప్పున బడ్జెట్‌ను సమర్పించారు. యశ్వంత్రావ్ చవాన్, సీడీ దేశ్‌ముఖ్‌ యశ్వంత్ సిన్హా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, మన్మోహన్ సింగ్, టీటీ కృష్ణామాచారి ఆరుసార్లు బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె జూలై 23, 2024న ఏడోసారి వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకుముందు ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆమె.. తాజాగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement