త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI Rules | కొత్త‌గా అమ‌లులోకి వ‌చ్చిన యూపీఐ నిబంధ‌న‌లు.. ఇక‌పై మ‌రింత వేగంగా పేమెంట్స్‌..

UPI Rules | యూపీఐ (UPI) వినియోగదారులకు సంబంధించిన కొత్త నిబంధనలు శ‌నివారం (ఫిబ్రవరి 14, 2026) నుంచి అమలులోకి వ‌చ్చాయి. New Rules under UPI New Rules February 2026 పేరుతో ప్రకటించిన ఈ మార్పులు యూపీఐ లావాదేవీలు ఎలా ప్రాసెస్ అవుతాయన్న విషయంలో కీలక మార్పులను తీసుకురానున్నాయి.

S

Business | Published On Feb 14, 2026, 7.00 am IST

UPI Rules | కొత్త‌గా అమ‌లులోకి వ‌చ్చిన యూపీఐ నిబంధ‌న‌లు.. ఇక‌పై మ‌రింత వేగంగా పేమెంట్స్‌..
Advertisement

UPI Rules | యూపీఐ (UPI) వినియోగదారులకు సంబంధించిన కొత్త నిబంధనలు శ‌నివారం (ఫిబ్రవరి 14, 2026) నుంచి అమలులోకి వ‌చ్చాయి. New Rules under UPI New Rules February 2026 పేరుతో ప్రకటించిన ఈ మార్పులు యూపీఐ లావాదేవీలు ఎలా ప్రాసెస్ అవుతాయన్న విషయంలో కీలక మార్పులను తీసుకురానున్నాయి. యూపీఐ సేవలను వేగవంతం చేయడం, భద్రతను పెంచడం, సర్వర్లపై భారం తగ్గించడమే లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ చర్యలు చేపట్టింది. ఈ మార్పులు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించే వినియోగదారులందరికీ వర్తిస్తాయి. అలాగే డిజిటల్ చెల్లింపులపై ఆధారపడే వ్యాపారులు, సాధారణ పౌరులు కూడా ఈ కొత్త నియమాల ప్రభావాన్ని గుర్తించ‌నున్నారు.

రోజుకు 50 సార్ల వ‌ర‌కు బ్యాలెన్స్ చెకింగ్‌కు వీలు..

సవరించిన నిబంధనల ప్రకారం, వినియోగదారులు రోజుకు ఒక్క యాప్ ద్వారా గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఒక వినియోగదారు రెండు యూపీఐ యాప్‌లు ఉపయోగిస్తే, మొత్తం 100 సార్లు వరకు బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనుమతి ఉంటుంది. పదేపదే బ్యాలెన్స్ విచారణల వల్ల ఏర్పడుతున్న అనవసర సర్వర్ లోడ్‌ను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యమ‌ని ఎన్‌పీసీఐ వెల్ల‌డించింది. అదేవిధంగా యూజర్లు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలను లిస్ట్ అకౌంట్ API ద్వారా ఒక్క యాప్‌లో గరిష్టంగా 25 సార్లు మాత్రమే పొందే వీలుంటుంది. తరచూ ఖాతాల జాబితాను రిఫ్రెష్ చేయడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిమితిని విధించారు.

ఆటోపే ప్రాసెసింగ్ ఆ స‌మ‌యంలోనే..

యూపీఐ ఆటోపే లావాదేవీలకు కూడా కొత్త సమయ పరిమితులు అమలులోకి రానున్నాయి. సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, బిల్లుల చెల్లింపులు వంటి ఆటోపే లావాదేవీలు ఇకపై పీక్ అవర్స్‌లో కాకుండా నాన్-పీక్ సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ప్రతి ఆటోపే అభ్యర్థన గరిష్టంగా 4 సార్లు (ఒక అసలు ప్రయత్నం, మూడు రీట్రైలు) మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. సర్వర్ లోడ్ తగ్గించడం, లావాదేవీల‌ వైఫల్యాలను తగ్గించడమే ఈ చర్య లక్ష్యంగా ప‌నిచేస్తుంది. గత 12 నెలలుగా వినియోగంలో లేని యూపీఐ ఐడీలు ఆటోమేటిగ్గా నిలిపివేయబడతాయి. మొబైల్ నంబర్లు తరచుగా కొత్త వినియోగదారులకు కేటాయించబడుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా బ్యాంక్ ఖాతాను యూపీఐకి లింక్ చేసే సమయంలో మరింత కఠినమైన ధ్రువీకరణ, యూజర్ ఆథెంటికేషన్ ప్రక్రియలు అమలు చేయబడతాయి. దీని ద్వారా భద్రతా ప్రమాణాలు మరింత బలపడతాయని అధికారులు తెలిపారు.

మరింత వేగంగా రియ‌ల్‌టైమ్ లావాదేవీలు..

కీలక యూపీఐ ట్రాన్సాక్షన్ APIల రెస్పాన్స్ టైమ్‌ను 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గించారు. ఈ మార్పు వల్ల రియల్‌టైమ్ లావాదేవీలు మరింత వేగంగా, సజావుగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న సంబంధిత నిబంధనలతో పాటు, ఫిబ్రవరి 14, 2026 నుంచి వినియోగదారులు బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ అందించే ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ను యూపీఐ ద్వారా ఉపయోగించి చెల్లింపులు చేయడం లేదా నిధులు ఉపసంహరించుకోవడం సాధ్యమవుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అవసరమైన వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా మార‌నుంది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యాలు సర్వర్ లోడ్‌ను నియంత్రించడం, యూపీఐ చెల్లింపులను మరింత భద్రంగా మార్చడం, లావాదేవీల వైఫల్యాలను తగ్గించడం, వినియోగదారులు, బ్యాంకులకు మెరుగైన అనుభవాన్ని అందించడమేన‌ని అధికారులు తెలిపారు.

ఈ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని NPCI హెచ్చరించింది. అవసరమైతే యాప్‌లపై లేదా బ్యాంకులపై API నిషేధాలు, జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షాపు యజమానులు, ఫ్రీలాన్సర్లు, తరచూ డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులు కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తమ లావాదేవీలను ప్రణాళిక చేయాల్సి ఉంటుంద‌ని సూచించారు.

Advertisement
Advertisement