త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబ‌డుల‌పై కన్నేసిన పెట్టుబ‌డిదారులు..

Stocks | స్టాక్ మార్కెట్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారికి ఎప్ప‌టిక‌ప్పుడు అనేక రంగాలు అవ‌కాశాల‌ను ఇస్తూనే ఉంటాయి. వాటిని స‌రిగ్గా అందిపుచ్చుకుని స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డులు పెడితే దీర్ఘ‌కాలంలో భారీ రాబ‌డుల‌ను సాధించ‌వ‌చ్చు. పేరుగాంచిన ఇన్వెస్ట‌ర్లు సైతం ఇదే విష‌యాన్ని చెబుతుంటారు.

S

Business | Published On Aug 7, 2026, 12.28 pm IST

Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబ‌డుల‌పై కన్నేసిన పెట్టుబ‌డిదారులు..
Advertisement

Stocks | స్టాక్ మార్కెట్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారికి ఎప్ప‌టిక‌ప్పుడు అనేక రంగాలు అవ‌కాశాల‌ను ఇస్తూనే ఉంటాయి. వాటిని స‌రిగ్గా అందిపుచ్చుకుని స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డులు పెడితే దీర్ఘ‌కాలంలో భారీ రాబ‌డుల‌ను సాధించ‌వ‌చ్చు. పేరుగాంచిన ఇన్వెస్ట‌ర్లు సైతం ఇదే విష‌యాన్ని చెబుతుంటారు. ఇక ప్ర‌స్తుతం మ‌ధ్య ప్రాచ్య యుద్ధం కార‌ణంగా అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌తోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ ప‌లు రంగాల్లో మాత్రం ఇంకా కొనుగోళ్ల జోరు కొన‌సాగుతోంది. వాటిల్లో భార‌త ఎరోస్పేస్‌, డిఫెన్స్ రంగం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు దేశీయ విమాన‌యాన సంస్థ‌లు, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు విదేశాల నుంచి ఆయా రంగాల‌కు చెందిన భాగాల‌ను దిగుమ‌తి చేసుకునేవి. కానీ ఇప్పుడు ఈ రంగాలు భార‌త్‌లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించాయి. దీంతో భార‌త్‌కు చెందిన ఆ కంపెనీలే ఆయా భాగాల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నాయి. దీంతో ఎరోస్పేస్‌, డిఫెన్స్ రంగాల్లో రానున్న కాలంలో భారీ వృద్ధి చోటు చేసుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల ఆయా రంగాల‌కు చెందిన సంస్థ‌ల స్టాక్‌ల‌లో పెట్టుబ‌డులు పెడితే రానున్న 5 ఏళ్ల‌లో భారీ రాబ‌డుల‌ను పొందే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

ఈక్వ‌స్‌..

ఎరోస్పేస్‌, డిఫెన్స్ రంగంలో ప్ర‌స్తుతం భార‌త్‌లో మూడు స్వ‌దేశీ కంపెనీలు గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధిస్తున్నాయి. వాటిల్లో ఎక్స్‌పోర్ట్ ప‌వ‌ర్ హౌస్ ఈక్వ‌స్ కూడా ఒక‌టి. ఇది ప‌రిమాణం దృష్ట్యా చాలా పెద్ద కంపెనీ. ఎరో స్ట్ర‌క్చ‌ర్స్‌, ఇంజిన్ సిస్ట‌మ్స్‌, ల్యాండింగ్ గేర్ విభాగాల్లో 5,740కి పైగా సంక్లిష్ట‌మైన విడి భాగాల‌ను త‌యారు చేస్తోంది. ఎయిర్‌బ‌స్‌, బోయింగ్‌, సాఫ్రాన్ వంటి భారీ విదేశీ కంపెనీల‌కు ఆయా భాగాల‌ను ఎగుమ‌తి చేస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయంలో 55 శాతం వృద్ధిని సాధించ‌గా, రూ.395.50 కోట్ల మేర లాభాల‌ను ఆర్జించింది. ఇందులో ఎరోస్పేస్ విభాగం వాటా 81 శాతం ఉండ‌డం విశేషం. అంటే మొత్తం రూ.322.2 కోట్ల‌ను ఈ విభాగాం ద్వారా సంపాదించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎరోస్పేస్ ఆదాయంలో ఎగుమ‌తుల వాటా కూడా ఏకంగా 88 శాతంగా ఉండ‌డం సంస్థ బ‌ల‌మైన వృద్ధిని తెలియ‌జేస్తోంది. ప్ర‌స్తుతం ఈక్వ‌స్ ఎరోస్పేస్ విభాగం వ‌ద్ద 1 బిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ.9500 కోట్లు) విలువైన ఆర్డ‌ర్లు ఉన్నాయి. దీంతో భ‌విష్య‌త్ ఆదాయానికి ఇది పెట్టుబ‌డిదారుల‌కు బ‌ల‌మైన హామీని ఇస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈక్వ‌స్ కంపెనీ ప్ర‌స్తుతం క‌న్‌జ్యూమ‌ర్ బిజినెస్ వ‌ల్ల తాత్కాలికంగా నెట్ లెవ‌ల్‌లో న‌ష్టాల‌ను న‌మోదు చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ త‌మిళ‌నాడులోని హోసూర్‌లో రూ.1900 కోట్ల‌తో ఎరో ఇంజిన్‌, ల్యాండింగ్ గేర్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేస్తోంది. అందువ‌ల్ల సంస్థ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

డేటా ప్యాట‌ర్న్స్‌..

ఇక ఇదే రంగాల‌కు చెందిన మ‌రో కంపెనీ డేటా ప్యాటర్న్స్‌. ఇది డిఫెన్స్ ఎల‌క్ట్రానిక్స్ రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతోంది. కాక్‌పిట్ డిస్‌ప్లేలు, రాడార్లు, యుద్ధ విమానాల ఎల‌క్ట్రానిక్ వ్య‌వ‌స్థ‌ల్లో లోతైన నైపుణ్యాల‌ను క‌లిగి ఉంది. సుఖోయ్ 30, మిగ్ 29, ఎల్‌సీఏ తేజ‌స్ త‌దిత‌ర మిలిట‌రీ విమానాల‌కు అవ‌స‌ర‌మైన కీల‌క టెక్నాల‌జీల‌ను సొంతంగా డిజైన్ చేసి అందిస్తోంది.ఈ కంపెనీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 16.8 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. ఆదాయం రూ.116 కోట్ల‌కు చేర‌గా, నిక‌ర లాభం రూ.22.1 కోట్లుగా ఉంది. ఈబిట్డా మార్జిన్లు 27 శాతం వ‌ద్ద కొన‌సాగుతున్నాయి. కంపెనీ నిక‌ర ఆర్డ‌ర్ బుక్ గ‌త జూలై నాటికి ఒప్పందాల‌తో క‌లిపి రూ.2,654 కోట్ల‌కు చేర‌గా, సుఖోయ్ 30 అప్‌గ్రేడ్ ప్రాజెక్టు (జావా బోర్డ్స్‌) ట్ర‌య‌ల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుండ‌డంతో కంపెనీకి వేల కోట్ల రూపాయ‌ల అవ‌కాశం ల‌భించ‌నుంది.

యూనిమెచ్ ఎరోస్పేస్‌..

యూనిమెచ్ ఎరోస్పేస్ అనే కంపెనీ కూడా ఈ రంగాల్లో వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తోంది. ప్రెసిష‌న్ ఇంజినీరింగ్‌, ఎరో టూలింగ్ విభాగాల్లో అద్భుత‌మైన వేగంతో వృద్ధిని న‌మోదు చేస్తోంది. రోల్స్ రాయ్స్‌, ప్య్రాట్ అండ్ విట్నీ త‌దిత‌ర గ్లోబ‌ల్ కంపెనీల‌కు విడి భాగాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది. కంపెనీ ఆదాయం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.107.6 కోట్ల‌కు చేరి 71 శాతం వృద్ధిని న‌మోదు చేసింది. నిక‌ర లాభం రూ.27.9 కోట్లుగా న‌మోదై 46 శాతం వృద్ధిని చేరుకుంది. ఈబిట్డా మార్జిన్ ఏకంగా 36.5 శాతంగా ఉండ‌డం విశేషం. కంపెనీ ఆర్డ‌ర్ బుక్ విలువ రూ.280.3 కోట్లు ఉండ‌గా, అందులో 96 శాతం ఆదాయాన్ని కేవ‌లం ఎగుమ‌తుల ద్వారానే పొందుతోంది. ఇటీవ‌లే హోబెల్ బెల్లోస్ అనే సంస్థ‌ను రూ.450 కోట్ల‌కు ద‌క్కించుకుంది. దీంతో వాణిజ్య వాహ‌నాల రంగానికి అవ‌స‌ర‌మైన విడి భాగాల త‌యారీలోకి కంపెనీ అడుగుపెట్టింది.

పెట్టుబ‌డి పెట్టాలా..

ఇలా ఈ మూడు కంపెనీలు ఎరోస్పేస్‌, డిఫెన్స్ రంగాల్లో అద్భుత‌మైన ప్ర‌గ‌తిని సాధిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఈ కంపెనీల స్టాక్స్ ప‌రిశ్ర‌మ స‌గ‌టు కంటే ప్రీమియం ద‌శ‌లో ట్రేడ్ అవుతున్నాయ‌ని, అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు త్వ‌ర‌ప‌డి స్టాక్స్ కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప‌రిశ్ర‌మ భారీ వృద్ధి వైపు అడుగులు వేస్తున్న‌ప్ప‌టికీ స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని చెబుతున్నారు. స్టాక్స్‌ను స‌రైన స‌మ‌యంలో కొనుగోలు చేస్తేనే రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని, దీర్ఘ‌కాలంలో అధిక రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని, అందువ‌ల్ల ఈ స్టాక్స్‌పై క‌న్నేసి ఉంచాల‌ని, త‌ర‌చూ ట్రాక్ చేయాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement