Sugar Prices | చక్కెర ధరలు భగ్గుమంటున్నాయ్.. కారణాలేంటి..?
Sugar Prices | దేశంలో చక్కెర ధరలు గత నెల రోజులుగా భారీగా పెరిగాయి. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో చక్కెరకు డిమాండ్ సాధారణంగా పెరుగుతున్న వేళ.. కిలో చక్కెర ధర దాదాపు రూ.7 మేర పెరిగింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 20న కిలో చక్కెర సగటు ధర రూ.48.18గా ఉండగా, ఆగస్టు 20 నాటికి రూ.55.70కి చేరింది.
Sugar Prices | దేశంలో చక్కెర ధరలు గత నెల రోజులుగా భారీగా పెరిగాయి. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో చక్కెరకు డిమాండ్ సాధారణంగా పెరుగుతున్న వేళ.. కిలో చక్కెర ధర దాదాపు రూ.7 మేర పెరిగింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 20న కిలో చక్కెర సగటు ధర రూ.48.18గా ఉండగా, ఆగస్టు 20 నాటికి రూ.55.70కి చేరింది. అంటే కేవలం నెల రోజుల్లోనే రూ.7.52 పెరిగింది. శాతాల పరంగా చూస్తే ఈ పెరుగుదల దాదాపు 15.6 గా ఉంది. చక్కెర ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశీయ చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తక్కువగా ఉండటం, పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరగడం, వాతావరణ పరిస్థితుల కారణంగా చెరకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా చక్కెర సరఫరాలు తగ్గడం, మార్కెట్‌లో ఊహాగానాలు, నిల్వలు పెంచుకోవడం వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయని పేర్కొంది.
33 లక్షల మెట్రిక్ టన్నుల లోటు..
ప్రస్తుత సీజన్‌లో దేశంలో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెరకు పండించే రాష్ట్రాలు తొలుత వేసిన అంచనా సుమారు 343 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ. దీంతో దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యతపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు చెరకు పంటలను కూడా వివిధ వ్యాధులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు దెబ్బతీశాయి. రెడ్ రాట్, టాప్ బోరర్ వంటి వ్యాధులతోపాటు కొన్ని చెరకు సాగు ప్రాంతాల్లో అధిక వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా కూడా చక్కెర సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. 2026-27 సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన చక్కెర ఉత్పత్తి ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఉత్పత్తి అంచనాలు కూడా బలహీనపడ్డాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగడం దేశీయ మార్కెట్‌లపైనా ప్రభావం చూపుతోంది.

చక్కెర ఎగుమతులపై నిషేధం..
దేశీయ చక్కెర ధరల పెరుగుదలతోపాటు అంతర్జాతీయ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూన్ 30న టన్ను చక్కెర అంతర్జాతీయ ధర 474 అమెరికన్ డాలర్లుగా ఉండగా, ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు చేరింది. అంటే రెండు నెలల్లోపే 16 శాతానికి పైగా పెరిగింది. అంతర్జాతీయ సరఫరాలు కఠినతరం కావడం, దేశీయ ఉత్పత్తి తొలుత అంచనా వేసిన స్థాయికి చేరకపోవడంతో దేశీయ మార్కెట్‌లలో చక్కెర లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దిగుమతులకు సంబంధించిన నిర్ణయాలను కూడా తీసుకుంది. మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగనుంది. దేశీయ సరఫరాలపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి..
తాజాగా దేశీయ సరఫరాలను పెంచి ధరలను నియంత్రించేందుకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎలాంటి దిగుమతి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దాదాపు దశాబ్దం తర్వాత ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి. దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యతను పెంచి ధరల ఒత్తిడిని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో రానున్న చెరకు క్రషింగ్ సీజన్‌లో దేశీయ చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. 2026-27 క్రషింగ్ సీజన్‌ను అక్టోబర్ 15 నుంచే ప్రారంభించాలని చక్కెర మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సాధారణంగా అక్టోబర్‌లో నెలకు సుమారు 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుండగా.. ఈసారి అక్టోబర్‌లోనే 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ అదనపు ఉత్పత్తి వల్ల పండుగల సీజన్‌లో చక్కెర లభ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇథనాల్ కోసం వాడారా..
పండుగల సమయంలో స్వీట్లు, ఇతర చక్కెర ఆధారిత ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల సాధారణంగా డిమాండ్ అధికంగా ఉంటుంది. అందువల్ల ముందుగానే ఉత్పత్తిని పెంచడం ద్వారా సరఫరా-డిమాండ్ మధ్య సమతుల్యత సాధించాలని ప్రభుత్వం చూస్తోంది. కాగా చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి ప్రధాన కారణమనే వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అదనపు చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్లే ధరలు పెరిగాయని చెప్పడం సరైంది కాదని స్పష్టం చేసింది. చక్కెర పరిశ్రమలో దీర్ఘకాలంగా ఉన్న నిర్మాణాత్మక సమస్యను పరిష్కరించడంలో మిగులు చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం సహాయపడిందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా దీనివల్ల చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిందని పేర్కొంది. దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యత, ధరల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా, ధరలు స్థిరంగా ఉండేలా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!
- ●తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం
- ●Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
- ●POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
- ●SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్

Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!

తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం

Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..






