త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో భారీ ర్యాలీ.. యుద్ధం ముగింపుపై పెట్టుబ‌డిదారుల ఆశావాదం..

Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం ముగుస్తుంద‌నే ఆశావాదం బ‌ల‌ప‌డ‌డంతో సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకుని ర్యాలీని కొన‌సాగించాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల నుంచి వ‌చ్చిన బ‌ల‌మైన సంకేతాలు, ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌నం అవ‌డం, డాల‌ర్ విలువ త‌గ్గ‌డం వంటి ప‌రిణామాలు సూచీల లాభాల‌కు కార‌ణమ‌య్యాయి.

S

Business | Published On May 25, 2026, 4.17 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో భారీ ర్యాలీ.. యుద్ధం ముగింపుపై పెట్టుబ‌డిదారుల ఆశావాదం..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం ముగుస్తుంద‌నే ఆశావాదం బ‌ల‌ప‌డ‌డంతో సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకుని ర్యాలీని కొన‌సాగించాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల నుంచి వ‌చ్చిన బ‌ల‌మైన సంకేతాలు, ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌నం అవ‌డం, డాల‌ర్ విలువ త‌గ్గ‌డం వంటి ప‌రిణామాలు సూచీల లాభాల‌కు కార‌ణమ‌య్యాయి. సోమ‌వారం నాటి ర్యాలీతో బీఎస్ఈలో లిస్ట్ అయి ఉన్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేష‌న్ ఈ ఒక్క సెష‌న్‌లోనే ఏకంగా రూ.6 ల‌క్ష‌ల కోట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1074 పాయింట్లు ఎగ‌బాకి 76,489 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 312 పాయింట్లు లాభ‌ప‌డి 24,032 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బ‌జాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎట‌ర్న‌ల్, ఎల్ అండ్ టీ, బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌, ఎస్‌బీఐ, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా షేర్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. ఒక్కోటి స‌గ‌టున 2 నుంచి 3 శాతం వ‌ర‌కు పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి. అయితే ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హిందుస్థాన్ యూనిలివ‌ర్, స‌న్ ఫార్మా కంపెనీల షేర్లు మాత్రం స్వ‌ల్ప న‌ష్టాల్లో ముగిశాయి.

శాంతి చ‌ర్చ‌ల వార్త‌ల వ‌ల్లే..

అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు ముగింపు ద‌శ‌కు వ‌స్తున్నాయన్న వార్త‌ల నేప‌థ్యంలో సోమ‌వారం నాడు మార్కెట్ల‌లో జోష్ క‌నిపించింది. ఆరంభం నుంచే గ్యాప‌ప్‌తో మొద‌లైన సూచీలు అదే ర్యాలీని చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించాయి. మ‌రోవైపు ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 6.10 శాతం ప‌త‌న‌మైన బ్యారెల్‌కు 97 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 5.86 శాతంక్షీణించి బ్యారెల్‌కు 90 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ముడి చ‌మురు ధ‌ర‌లు బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు దిగువ‌కు రావ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో ఆశావాదం క‌నిపించింది. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు చేప‌ట్టారు. మ‌రోవైపు గ్లోబ‌ల్ మార్కెట్లు సైతం దేశీయ సూచీల ర్యాలీకి కార‌ణ‌మ‌య్యాయి. యూరోప్ స్టాక్స్ ఏకంగా 600 పాయింట్లు ఎగిసింది. అమెరికా ఎస్ అండ్ పీ 500 ఫ్యూచ‌ర్స్ 0.9 శాతం పెరిగాయి. నాస్డాక 100 ఫ్యూచర్ల‌లో 1.4 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. డౌ జోన్స్ ఇండ‌స్ట్రియ‌ల్ యావ‌రేజ్ ఫ్యూచ‌ర్స్ 0.8 శాతం పెర‌గ్గా, ఎంఎస్ సీఐ ఆసియా ప‌సిఫిక్ సూచీ 1.4 శాతం ఎగ‌బాకింది.

భారీగా పుంజుకున్న భార‌త రూపాయి..

గ‌త కొద్ది రోజులుగా భారీగా ప‌త‌న‌మ‌వుతూ వ‌స్తున్న భార‌త రూపాయి మార‌కం విలువ సోమ‌వారం నాటి సెష‌న్‌లో భారీగా పుంజుకుంది. సూచీల ర్యాలీకి ఇది కూడా ఒక కార‌ణంగా నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాల‌ర్‌కు భార‌త రూపాయి విలువ 0.48 శాతం మేర పెరిగి డాల‌ర్‌కు 95.2 స్థాయికి దిగి వ‌చ్చింది. రూపాయి బ‌ల‌ప‌డితే విదేశీ పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఇక అమెరికా బాండ్ ఈల్డ్స్ గ‌త కొద్ది రోజులుగా భారీగా పెర‌గ్గా, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. కానీ సోమ‌వారం నాడు పెట్టుబ‌డిదారులు ఊపిరి పీల్చుకున్నారు. బాండ్ ఈల్డ్స్ కాస్త త‌గ్గాయి. అయితే ఈ సెష‌న్‌లో విదేశీ పెట్టుబ‌డిదారులు మాత్రం ఇంకా అమ్మ‌కాల ధోర‌ణిలోనే ఉన్నార‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే యుద్ధం పూర్తిగా ముగిసి, హోర్ముజ్ జ‌ల‌సంధి తెరుచుకుంటే విదేశీ పెట్టుబ‌డిదారులు మ‌ళ్లీ భార‌త్ కు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సాధార‌ణ పెట్టుబ‌డిదారులు ఆలోచించి పెట్టుబ‌డులు పెట్టాల‌ని, దూకుడుగా ఉండ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement