త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్‌బీఐ స్వాప్‌తో 73 బిలియన్‌ డాలర్లు..

RBI | భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) చేపట్టిన అమెరికన్‌ డాలర్‌-రూపాయి ఫారెక్స్‌ స్వాప్‌ సదుపాయానికి భారీ స్పందన లభించింది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి) డిపాజిట్లు, ఓవర్సీస్‌ ఫారిన్‌ కరెన్సీ బారోయింగ్స్‌ (ఓఎఫ్‌సీబీ), ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ (ఈసీబీ) ద్వారా ఆగస్టు 21 నాటికి మొత్తం 73 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిధులు సమీకరించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

S

Business | Published On Aug 26, 2026, 1.36 pm IST

RBI | ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్‌బీఐ స్వాప్‌తో 73 బిలియన్‌ డాలర్లు..
Advertisement

RBI | భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) చేపట్టిన అమెరికన్‌ డాలర్‌-రూపాయి ఫారెక్స్‌ స్వాప్‌ సదుపాయానికి భారీ స్పందన లభించింది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి) డిపాజిట్లు, ఓవర్సీస్‌ ఫారిన్‌ కరెన్సీ బారోయింగ్స్‌ (ఓఎఫ్‌సీబీ), ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ (ఈసీబీ) ద్వారా ఆగస్టు 21 నాటికి మొత్తం 73 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిధులు సమీకరించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇందులో ఫారిన్‌ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ బ్యాంక్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి)) డిపాజిట్ల వాటానే 65.40 బిలియన్‌ డాలర్లుగా ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు, ఇతర డిపాజిటర్ల నుంచి ఈ స్థాయిలో స్పందన రావడం విశేషంగా మారింది. మొదట సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉండేలా నిర్ణయించిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి) స్వాప్‌ విండోను ఆర్‌బీఐ ఇప్పుడు ఒక నెల ముందుగానే ముగించాలని నిర్ణయించింది. దీంతో ఆగస్టు 31నే ఈ సదుపాయం ముగియనుంది. లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందుగానే సాధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గ‌తంలో క‌న్నా ఎక్కువ స్పంద‌న‌..

రూపాయి విలువపై డాలర్‌ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ మూలధనాన్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో జూన్‌ 8న ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే అంచనాలను మించి వేగంగా విదేశీ నిధులు సమీకరించడంతో ఆర్‌బీఐకి ఈ చర్య గణనీయమైన ఫలితాన్ని అందించింది. 2013లో ఆర్‌బీఐ చేపట్టిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి) స్వాప్‌ పథకంతో దాదాపు మూడు నెలల వ్యవధిలో సుమారు 26 బిలియన్‌ డాలర్ల‌ను సమీకరించగా, ప్రస్తుత పథకం ద్వారా కేవలం కొన్ని వారాల్లోనే దానికి దాదాపు మూడు రెట్ల స్థాయిలో నిధులు వచ్చాయి. దీంతో ప్రస్తుత స్వాప్‌ సదుపాయానికి వచ్చిన స్పందన గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది. దీర్ఘకాలిక ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు, సంస్థాగత నిధుల భారీ సమీకరణతో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలకు మరింత బలం క‌ల‌గ‌నుంది. అదే సమయంలో బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ రంగాలకు విదేశీ కరెన్సీ వనరులు అందుబాటులోకి రానున్నాయి.

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం..?

ఈ సదుపాయానికి వచ్చిన స్పందన భారతీయ ప్రవాసుల పాత్రను మరోసారి చాటిచెప్పింది. ఎన్‌ఆర్‌ఐలు తమ పొదుపులను భారతీయ బ్యాంకింగ్‌ సాధనాల్లోకి మళ్లించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్న సమయంలోనూ ఈ స్థాయిలో విదేశీ నిధులు సమీకరించడం భారత ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఉన్న విశ్వాసానికి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. భారీగా వచ్చిన నిధులు రూపాయిపై ఒత్తిడిని ఎదుర్కోవడంలోనూ, దేశ బాహ్య ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలోనూ కీలకంగా మారనున్నాయి.

Advertisement
Advertisement