UPI | యూపీఐ ఖర్చులను ఎవరు చెల్లించాలి.. పేమెంట్స్ కౌన్సిల్ ఏం చెప్పింది..?
UPI | యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా చెల్లింపులు ఇప్పటికీ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే ప్రతి నెలా బిలియన్ల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ ఖర్చును ఎవరు భరించాలి అనే అంశంపై చర్చ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది.
UPI | యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా చెల్లింపులు ఇప్పటికీ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే ప్రతి నెలా బిలియన్ల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ ఖర్చును ఎవరు భరించాలి అనే అంశంపై చర్చ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో మర్చంట్ ఛార్జీలు, ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్), అలాగే మొత్తం వ్యవస్థ నిర్వహణ వ్యయం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నలు-సమాధానాల రూపంలో వివరణ ఇచ్చింది. యూపీఐ నిర్వహణకు అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తున్నారు ? భవిష్యత్తులో ఈ వ్యవస్థను ఎలా నిలకడగా కొనసాగించాలి ? అనే అంశాలను వివరించింది.
ఎండీఆర్ ఎవరికి వర్తించదు..?
ప్రస్తుతం జరుగుతున్న చర్చలో ప్రధానంగా రెండు అంశాల మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందని పీసీఐ తెలిపింది. ఒకటి యూపీఐను ఉపయోగించి చెల్లింపులు చేయడం, రెండోది యూపీఐ ద్వారా చెల్లింపులను స్వీకరించడం. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారులకు ఎలాంటి లావాదేవీ రుసుము విధించలేదు. ప్రస్తుతం కూడా బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు తక్షణ చెల్లింపులు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అదే విధంగా కిరాణా దుకాణాలు సహా చిన్న వ్యాపారులు కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించినప్పుడు ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపారాలకు డిజిటల్ చెల్లింపులు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడమే యూపీఐ విస్తరణలో కీలక పాత్ర పోషించింది. అయితే వినియోగదారులు చెల్లించడం లేదు, చిన్న వ్యాపారులు కూడా ఎండీఆర్ చెల్లించడం లేదు అంటే ప్రస్తుతం చర్చ ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఖర్చులను ఎవరు భరించాలి..
అసలు సమస్య యూపీఐ వ్యవస్థ నిర్వహణకు అయ్యే భారీ ఖర్చు. ఈ ఎకోసిస్టమ్‌ను నిర్వహించడానికి సాంకేతిక మౌలిక వసతులు, సైబర్ భద్రత, మోసాల నివారణ, నిబంధనల అమలు, వినియోగదారుల సేవలు, కొత్త ఆవిష్కరణల కోసం నిరంతర పెట్టుబడులు అవసరమవుతున్నాయి. దాదాపు పదేళ్లుగా బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్‌పీసీఐ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కలిసి ఈ వ్యవస్థను నిర్మించడంతోపాటు నిర్వహిస్తున్నాయి. అందువల్ల యూపీఐ వినియోగదారులకు ఉచితం కావడం వల్ల ఈ వ్యవస్థ నిర్వహణ కూడా ఉచితమే అనే భావన సరైంది కాదని పీసీఐ స్పష్టం చేసింది. మర్చంట్ ఛార్జీల విషయానికి వస్తే వ్యాపారులు, వారి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఉండే వాణిజ్య ఒప్పందాల ఆధారంగా కొన్ని సేవా రుసుములు ఉంటాయి. అయితే అలాంటి ఛార్జీలు విధించినా, వినియోగదారులు యూపీఐ ఉపయోగించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం వస్తుందని అర్థం కాదని తెలిపింది.
నిధుల సమీకరణ ఎలా..
ప్రస్తుతం జరుగుతున్న చర్చ వినియోగదారులపై ఛార్జీలు విధించడం గురించి కాదు. పెరుగుతున్న లావాదేవీల నేపథ్యంలో చెల్లింపుల వ్యవస్థ నిర్వహణకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చాలనే అంశంపైనే దృష్టి ఉందని పేర్కొంది. ఇప్పటికే యూపీఐ కేవలం ఒక చెల్లింపు విధానంగా మాత్రమే కాకుండా, దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కీలక భాగంగా మారింది. కోట్లాది మంది వినియోగదారులు, వ్యాపార సంస్థలు దీనిని ఉపయోగిస్తున్నాయి. వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థను సురక్షితంగా, అంతరాయం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంచేందుకు మరింత పెట్టుబడులు అవసరమవుతున్నాయి. సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతులు, వినియోగదారుల సేవల కోసం నిరంతర వ్యయం తప్పనిసరిగా మారుతోంది. ఇటీవల యూపీఐ ఎండీఆర్‌పై వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. భవిష్యత్తులో ఎండీఆర్ అమల్లోకి వచ్చినా యూపీఐ వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాంటి ఛార్జీలు ఉంటే అవి వ్యాపారులకే వర్తిస్తాయని, వినియోగదారులకు కాదని ఆమె స్పష్టం చేశారు.

ఇప్పటికైతే ఫీజు లేదు..
ఈ ఏడాది పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లుతో భవిష్యత్తులో యూపీఐ చెల్లింపులపై వినియోగదారుల నుంచి కూడా రుసుము వసూలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం తర్వాత ఈ వివరణ వెలువడింది. అయితే ఆ బిల్లులో ఎండీఆర్‌ను ప్రవేశపెట్టడం గానీ, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుము నిర్ణయించడం గానీ లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ విధానంలో భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వానికి నోటిఫికేషన్ ద్వారా మార్పులు చేసే చట్టపరమైన అవకాశం మాత్రమే కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఎండీఆర్ అంటే వినియోగదారుడు కాదు, వ్యాపారి చెల్లించే రుసుము. ఈ మొత్తాన్ని లావాదేవీ ప్రాసెసింగ్‌లో భాగస్వాములైన అక్వైరింగ్ బ్యాంక్, ఇష్యూయింగ్ బ్యాంక్, పేమెంట్ నెట్‌వర్క్‌లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఆయా ఒప్పందాల ప్రకారం పంచుకుంటారని పీసీఐ తెలిపింది.
పరిశీలించనున్న ఎన్‌పీసీఐ కమిటీ..
డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు, సాంకేతిక అప్‌గ్రేడ్‌లు, సైబర్ భద్రత, లావాదేవీల ప్రాసెసింగ్ ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు. ఈ అంశంపై పార్లమెంట్ బిల్లుకు ఆమోదం పొందిన నేపథ్యంలో తదుపరి ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం మాత్రం యూపీఐ వినియోగదారులకు ఎలాంటి మార్పు లేదు. ఇప్పటివరకు ఉన్నట్లుగానే ఉచిత యూపీఐ చెల్లింపుల సేవలు కొనసాగుతాయని పీసీఐ స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!
ఆగస్టు 7, 2026

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
- ●HYDRAA | హైడ్రా రిక్రూట్మెంట్కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
- ●Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
- ●Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!

Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..

US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

HYDRAA | హైడ్రా రిక్రూట్మెంట్కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత



