త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | భూముల‌ను రాత్రికి రాత్రే 22ఎ జాబితాలో పెట్టినోళ్లు.. రాత్రికి రాత్రే తీసేయ‌లేరా?

Harish Rao | రాత్రికి రాత్రే భూములను 22ఎ నిషేధిత జాబితాలో పెట్టినవాళ్లు.. రాత్రికి రాత్రే తీసేయలేరా? తప్పును సరిదిద్దుకోలేరా? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Aug 26, 2026, 1.11 pm IST

Harish Rao | భూముల‌ను రాత్రికి రాత్రే 22ఎ జాబితాలో పెట్టినోళ్లు.. రాత్రికి రాత్రే తీసేయ‌లేరా?
Advertisement
  • ప్ర‌జ‌లే ఆఫీసుల చుట్టూ ఎందుకు తిర‌గాలి?
  • బాధితులు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల‌ట‌.. వాళ్ల‌తో బేరం పెట్టుకోవ‌డానికా రేవంత్‌?
  • రెండున్న‌రేళ్ల‌లో రూ.30 వేల కోట్ల భూములు అమ్మారు
  • కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్ర‌జ‌ల‌ ఆస్తులను కాపాడుతాం
  • కూక‌ట్‌ప‌ల్లి భూ బాధితుల స‌మావేశంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాత్రికి రాత్రే భూములను 22ఎ నిషేధిత జాబితాలో పెట్టినవాళ్లు.. రాత్రికి రాత్రే తీసేయలేరా? తప్పును సరిదిద్దుకోలేరా? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. బాధ‌తులు ద‌ర‌ఖాస్తులు పెట్టుకోవాల‌ని చెబుతున్నార‌ని.. త‌ర్వాత వాళ్ల‌తో బేరం మాట్లాడుకోవ‌డానికేన‌ని ఆరోపించారు. 40,50 ఏళ్ల నుంచి ఇక్క‌డ జీవిస్తున్న ప్రజలు కబ్జాదారులా అని నిల‌దీశారు. రేవంత్ రెడ్డి అసలైన కబ్జాదారు అని ధ్వ‌జ‌మెత్తారు. రెండున్నరేళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన భూములు అమ్మారన్నారు. 22ఎ బాధితులు ఎవ‌రూ అధైర్యప‌డొద్ద‌ని.. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. బుధ‌వారం కూక‌ట్‌ప‌ల్లిలో జ‌రిగిన 22ఎ భూ బాధితుల స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

22ఎ నిషేధిత జాబితాలోని భూములకు ఎన్ఓసీలు ఇచ్చేందుకు భూ-దందాలు, బెదిరింపులు, 30% కమీషన్లకు కాంగ్రెస్ దొంగలు తెర లేపారు. రేవంత్, పొంగులేటి చేసిన తప్పులకు సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. 22ఎ బాధితులెవ్వరూ అధైర్యపడొద్దు. కేసీఆర్ నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తులను కాపాడే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది. ప్రజలను దరఖాస్తు పెట్టుకోవాలి అంటున్నరు.. ఎందుకు? దరఖాస్తు పెట్టుకున్నవాళ్లతో బేరం పెట్టుకోవడానికా?

సుప్రీంకోర్టు నియ‌మ నిబంధ‌న‌లు ఉల్లంఘించినట్లే..

2008లో రాజశేఖర్ రెడ్డి ULC భూములను రద్దు చేశాడు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ మీ భూములు 2008 కంటే ముందు ULC (అర్బన్ ల్యాండ్ సీలింగ్)లో ఉన్నాయని నిషేధిత జాబితాలో పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లే. రేవంత్ రెడ్డి బాధితులను పట్టుకొని కబ్జాదారులు అంటున్నాడు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, అసైన్డ్ భూములను లాక్కుంటూ, ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన రేవంత్ రెడ్డి అసలైన కబ్జాదారుడు.

22ఎ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కబ్జాదారులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలు కబ్జాదారులా? ప్రజలు కాదు.. రాత్రికి రాత్రి భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కట్టుకున్న ఇళ్ళల్లో 40, 50 ఏళ్ల నుంచి జీవిస్తున్న ఈ ప్రజలు కబ్జాదారులా?

గతంలో కేసీఆర్‌.. ప్రజలు కేంద్రంగా పాలన సాగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం భూములు కేంద్రంగా పాలన సాగిస్తోంది. కేసీఆర్‌ సీఎం కాగానే.. ముందుగా ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. తాగునీరు, విద్యుత్‌, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వంటి సమస్యలను పరిష్కరించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వరి దిగుబడిలో పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. కేసీఆర్‌ ప్రతి ఆలోచన పేదల సంక్షేమం కోణంలోనే ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఎక్కడ భూములున్నా.. వెంటనే అమ్మేస్తోంది. భవిష్యత్‌లో ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా అమ్ముతున్నారు. ప్రజల నుంచి భూములు సేకరించి తన అనుచరులకు కట్టబెడుతున్నారు’’అని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు హైదరాబాద్‌తో సహా రాష్ట్రమంతా కరెంటు కష్టాలు ఉండేవి. తాగునీరు, ట్రాఫిక్, సాగునీటి సమస్యలతో ప్రజలు అల్లాడిపోయారు. కానీ కేసీఆర్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, యువతకు ఉద్యోగాలు వచ్చేలా అద్భుతమైన ప్రగతిని సాధించారు.

అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 22A ఆంక్షలను తీసుకొచ్చింది? ప్రభుత్వ బాధ్యత ఏమిటి? ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, ఉద్యోగాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం.. ఆ సమస్యలను గాలికొదిలేసి కేవలం భూముల చుట్టూ ఎందుకు తిరుగుతోంది? ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగింది. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం భూములే కేంద్రంగా పరిపాలన సాగుతోంది.

కూకట్‌పల్లినే తీసుకుంటే.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇక్కడి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పెద్ద పెద్ద రిజర్వాయర్లు, పైప్‌లైన్లు, మౌలిక వసతులు నిర్మించాం. నిజాం, బ్రిటిష్ కాలంలో కట్టిన ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఆధారపడే పరిస్థితిని మార్చేసి.. నగర నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు నిర్మించాం. ఒక్క కూకట్‌పల్లిలోనే 20కి పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేశాం.

పార్కు స్థ‌లాన్ని అమ్మ‌కానికి పెట్టారు..

హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసీ భూములు.. ఇలా ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే అక్కడ బోర్డు పాతేసి అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ విధానంగా మారింది. ప్రభుత్వ భూములు అంటే మన భవిష్యత్ తరాల ఆస్తి, అవి అమ్ముకోవడానికి కాదు. హైదర్‌నగర్‌లో కిషన్ రావు, అక్కడి కాలనీవాసులు పోరాడితే పిల్లలు ఆడుకోవడానికి కేసీఆర్ వెయ్యి గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పార్కు స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టింది.

బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రభుత్వ హయాంలో హౌసింగ్ బోర్డుకు చెందిన ఒక్క గజం భూమిని కూడా అమ్మకానికి పెట్టలేదు. కానీ, రేవంత్ రెడ్డి రాగానే ఈ తక్కువ కాలంలోనే సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మేశాడు. ఇలా అడ్డగోలుగా భూములన్నీ అమ్ముకుంటూ పోతే.. రేపటి భవిష్యత్ తరాలకు ఒక దేవాలయం, మసీదు, చర్చి నిర్మించాలన్నా, ఆసుపత్రి, పాఠశాల, వాటర్ ట్యాంక్ కట్టాలన్నా.. కనీసం చనిపోతే దహన సంస్కారాలకు వైకుంఠధామం నిర్మించడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి వస్తుంది.

ఒకవైపు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతూనే, మరోవైపు దళితులు, గిరిజనులు, బీసీ వర్గాలకు గతంలో కేటాయించిన అసైన్డ్ భూములపై కన్నేశారు. లక్షలాది మంది పేదలకు భరోసాగా ఉన్న ఆ భూములను లాక్కొని దళారుల ద్వారా కమీషన్లకు కట్టబెడుతున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. 22A బాధితుల పక్షాన, సామాన్యుల ఆస్తుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచైనా సరే రాజీలేని పోరాటం చేస్తాం అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement