త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nvidia | ఎన్విడియా సీఈఓ చేసిన త‌ప్పు.. సంస్థ‌కు భారీ న‌ష్టం.. 1.57 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఆవిరి..

Nvidia | ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 26 శాతానికి పైగా పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువలో ఏకంగా 1.57 లక్షల కోట్ల డాలర్లు ఆవిరయ్యాయి. ఈ నష్టం టెస్లా మొత్తం మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. నవంబర్ 17న వెలువడనున్న త్రైమాసిక ఫలితాలపై ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది.

S

Business | Published On Nov 10, 2026, 10.20 am IST

Nvidia | ఎన్విడియా సీఈఓ చేసిన త‌ప్పు.. సంస్థ‌కు భారీ న‌ష్టం.. 1.57 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఆవిరి..
Advertisement

Nvidia | ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 26 శాతానికి పైగా పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువలో ఏకంగా 1.57 లక్షల కోట్ల డాలర్లు ఆవిరయ్యాయి. ఈ నష్టం టెస్లా మొత్తం మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. నవంబర్ 17న వెలువడనున్న త్రైమాసిక ఫలితాలపై ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది.

1.57 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఆవిరి..

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్న ఎన్విడియా కంపెనీ ప్రస్తుతం బేర్ మార్కెట్ దశలోకి ప్రవేశించింది. కంపెనీ షేరు ధర 52 వారాల గరిష్ఠ స్థాయి 243.37 డాలర్ల నుంచి 26 శాతానికి పైగా పడిపోయింది. దీంతో గ‌త సెషన్‌లో మార్కెట్ ముగిసే సమయానికి ఎన్విడియా మార్కెట్ విలువ 5.88 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.31 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. అంటే ఏకంగా 1.57 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. ఈ మొత్తం టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువైన సుమారు 1.49 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ. అయితే స్పేస్‌ఎక్స్ అంచనా మార్కెట్ విలువైన 1.93 లక్షల కోట్ల డాలర్ల కంటే తక్కువ. ప్రస్తుతం ఎన్విడియా షేరు 178.67 డాలర్ల వద్ద ఉండగా, గత వారంలో 14 శాతం, గత 30 రోజుల్లో 22 శాతం, మూడు నెలల్లో 18 శాతం, ఆరు నెలల్లో 17 శాతం పడిపోయింది.

సీఈఓపై విచార‌ణ‌..

ఎన్విడియా షేర్ల పతనం నేప‌థ్యంలో కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన పరిణామాలు కూడా సంస్థపై దృష్టిని పెంచాయి. చైనా నిఘా సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానాలు ఎదుర్కొంటున్న మహిళతో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు హువాంగ్ అంగీకరించారని వార్తలు వెలువడ్డాయి. అమెరికా నిఘా వర్గాలకు చెందిన రహస్య నివేదికలో ఆమె చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖకు చెందిన అనుమానిత వ్యక్తిగా పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. అమెరికా జాతీయ భద్రతకు లేదా కంపెనీ రహస్యాలకు ఎలాంటి ముప్పు వాటిల్లిందని భావించడం లేదని ఎన్విడియా బోర్డు స్పష్టం చేసింది. స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ బయటి న్యాయ నిపుణుల సహకారంతో విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు సహకరించేందుకు హువాంగ్ అంగీకరించగా, ఆయన సీఈఓ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

న‌వంబ‌ర్ 17న త్రైమాసిక ఫ‌లితాలు..

మరోవైపు నవంబర్ 17న ఎన్విడియా ప్రకటించనున్న త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కీలకంగా మారాయి. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ 96.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన 46.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఆదాయం 106 శాతం పెరిగింది. నికర లాభం 126 శాతం పెరిగి 59.69 బిలియన్ డాలర్లకు చేరగా, ఒక్కో షేరుపై ఆదాయం 2.46 డాలర్లుగా నమోదైంది. కంపెనీ ఆదాయంలో ప్రధాన వాటా డేటా సెంటర్ విభాగానిదే. ఈ విభాగం ద్వారా 89 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. మూడో త్రైమాసికంలో 108 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. మరోవైపు షేరు పతనం ఉన్నప్పటికీ వాల్ స్ట్రీట్ విశ్లేషకులు ఎన్విడియాపై ఆశావహంగానే ఉన్నారు.

కంపెనీని విశ్లేషిస్తున్న 62 మంది నిపుణుల్లో 59 మంది కొనుగోలు చేయాలని, ఇద్దరు హోల్డ్ చేయాలని, ఒకరు విక్రయించాలని సిఫార్సు చేశారు. సగటు 12 నెలల ధర లక్ష్యం 327.14 డాలర్లుగా ఉంది. ప్రస్తుత 178.67 డాలర్ల ధరతో పోలిస్తే ఇది సుమారు 83 శాతం పెరుగుదలకు అవకాశం ఉందని వారి అంచనా. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో షేర్ ధర‌లు భారీగా త‌గ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఎన్‌విడియా షేర్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయ‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

Advertisement
Advertisement