త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nvidia | ఎన్విడియా పతనం.. భారత ఇన్వెస్టర్లకు భారీ నష్టాల ముప్పు..?

Nvidia | ఎన్విడియా షేర్ల పతనం అమెరికా టెక్ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారతీయ ఇన్వెస్టర్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా టెక్నాలజీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే భారత ఈటీఎఫ్‌లలో భారీ ప్రీమియంతో కొనుగోలు చేసిన వారికి నష్టభయం ఎక్కువగా ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

S

Business | Published On Nov 10, 2026, 1.26 pm IST

Nvidia | ఎన్విడియా పతనం.. భారత ఇన్వెస్టర్లకు భారీ నష్టాల ముప్పు..?
Advertisement

Nvidia | ఎన్విడియా షేర్ల పతనం అమెరికా టెక్ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారతీయ ఇన్వెస్టర్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా టెక్నాలజీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే భారత ఈటీఎఫ్‌లలో భారీ ప్రీమియంతో కొనుగోలు చేసిన వారికి నష్టభయం ఎక్కువగా ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న వివాదం, కంపెనీ షేర్ల పతనం భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ పరిణామాలు ప్రభావం చూప‌నున్నాయి. మిరాయ్‌ అసెట్ ఎన్వైఎస్ఈ ఫాంగ్ ప్లస్ ఈటీఎఫ్ గ‌త సెష‌న్‌లో ఎన్ఎస్ఈలో రూ.234.91 వద్ద ముగిసింది. అయితే నవంబర్ 6 నాటికి ఈ ఫండ్ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) రూ.155.18 మాత్రమే ఉంది. దీంతో మార్కెట్ ధర, వాస్తవ ఆస్తి విలువ మధ్య సుమారు 51 శాతం ప్రీమియం నమోదైంది. అంటే రూ.100 పెట్టి ఈటీఎఫ్ కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు వాస్తవంగా సుమారు రూ.66 విలువైన అమెరికా షేర్ల వాటా మాత్రమే లభిస్తున్నట్లు లెక్క. ఈ ప్రీమియం ఎన్విడియా వివాదానికి ముందే అధికంగా ఉంది. శుక్రవారం ముగింపు నాటికి 56 శాతంగా ఉండగా, అక్టోబర్ మధ్యలో 59.5 శాతానికి చేరినట్లు డీఎస్ఐజే పేర్కొంది.

భారతీయ ఈటీఎఫ్‌లలో ఎన్విడియా వాటా..

ఎన్వైఎస్ఈ ఫాంగ్ ప్లస్ ఇండెక్స్‌లో ఎన్విడియాతోపాటు మెటా, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మైక్రాన్, పలాంటిర్, బ్రాడ్‌కామ్ కంపెనీలు ఉన్నాయి. ఈ పది కంపెనీలకు ఇండెక్స్‌లో సమాన వెయిటేజీ ఉంటుంది. మిరాయ్ అసెట్‌కు చెందిన ఈ ఫండ్ నిర్వహణలో సుమారు రూ.4,447.65 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఈటీఎఫ్‌లో ఎన్విడియా అత్యధికంగా 8.36 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. సెప్టెంబర్ 30 నాటికి యాపిల్ వాటా 7.38 శాతంగా నమోదైంది. ఈ ఫండ్ సోమవారం రూ.298.59 వద్ద ముగియగా, ఎన్ఏవీ రూ.247.64గా ఉంది. అంటే సుమారు 21 శాతం ప్రీమియంతో ట్రేడయింది. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, నావి, యాక్సిస్ సంస్థలు నిర్వహించే నాస్‌డాక్ 100 ఫండ్స్ ద్వారా కూడా భారతీయులు అమెరికా టెక్నాలజీ కంపెనీల్లో పరోక్షంగా పెట్టుబడులు పెడుతున్నారు.

ఎన్విడియా పతనం.. అసలు ప్రమాదం ఎక్కడ?

అమెరికా మార్కెట్లో ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఎన్విడియా షేరు 4.5 శాతం పడిపోయి 178.25 డాలర్లకు చేరింది. మార్కెట్ ప్రారంభానికి ముందే ఒక దశలో 5.2 శాతం వరకు క్షీణించింది. జెన్సన్ హువాంగ్ విదేశీ నిఘా ప్రయత్నానికి లక్ష్యంగా మారారా అనే అంశంపై కంపెనీ బోర్డు స్వతంత్ర విచారణ ప్రారంభించడం, తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు హువాంగ్ ఉద్యోగుల ఎదుట అంగీకరించారనే వార్తలు షేర్లపై ఒత్తిడికి కారణమయ్యాయి. పెప్పర్‌స్టోన్ రీసెర్చ్ హెడ్ క్రిస్ వెస్టన్ మాట్లాడుతూ.. ఈ పరిణామాలు కంపెనీ షేర్లకు ఏమాత్రం మేలు చేయవని మార్కెట్ సంకేతాలిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లు న్యూయార్క్ మార్కెట్ల కంటే ముందే ముగుస్తాయి. అందువల్ల అమెరికా ట్రేడింగ్ సమయంలో ఎన్విడియా షేర్లలో చోటుచేసుకునే మార్పులు తదుపరి రోజున ఈటీఎఫ్‌ల ఎన్ఏవీలో ప్రతిబింబిస్తాయి. సోమవారం మిరాయ్‌ అసెట్ ఫాంగ్ ప్లస్ ఈటీఎఫ్ 2.70 శాతం, మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఈటీఎఫ్ 1.16 శాతం పడిపోయాయి. అయితే వాటి సూచిక ఎన్ఏవీలలో పెద్దగా మార్పు కనిపించలేదు. దీంతో ఈటీఎఫ్‌లలో ఉన్న అధిక ప్రీమియం కొంత తగ్గింది.

ప్రీమియం ఎందుకు ప్రమాదకరం?

ఈటీఎఫ్‌లలో భారీ ప్రీమియం ఏర్పడడానికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడులపై ఉన్న పరిమితులు. భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ విదేశీ పెట్టుబడుల పరిమితి 7 బిలియన్ డాలర్లుగా సెబీ నిర్ణయించింది. ఈ పరిమితి పూర్తిగా వినియోగించబడడంతో ఫండ్ సంస్థలు కొత్త ఈటీఎఫ్ యూనిట్లను సృష్టించలేకపోతున్నాయి. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న పరిమిత యూనిట్ల కోసం కొనుగోలుదారుల మధ్య పోటీ పెరిగి ధరలు ఎన్ఏవీ కంటే అధికంగా నమోదవుతున్నాయి. అధిక ప్రీమియం చెల్లించి ఈటీఎఫ్‌లు కొనుగోలు చేసేవారికి అంతర్లీన షేర్ల ధరల్లో మార్పు లేకుండానే ఈటీఎఫ్ మార్కెట్ ధర ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉందని సెప్టెంబర్‌లో బీఎస్ఈ హెచ్చరించింది. అందువల్ల ఎన్విడియా షేర్ల పతనంతోపాటు ఈటీఎఫ్‌ల మార్కెట్ ధర, ఎన్ఏవీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా భారతీయ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఏర్ప‌డింది.

Advertisement
Advertisement