త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE | ఎన్‌ఎస్‌ఈ-బీఎంఈ కీలక ఒప్పందం.. మెటల్ డెరివేటివ్స్‌కు ఊతం..

NSE | నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) సోమవారం బాంబే మెటల్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (బీఎంఈ)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో నాన్-ఫెరస్ మెటల్ డెరివేటివ్స్ అభివృద్ధి, అవగాహన, వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

S

Business | Published On Jun 22, 2026, 12.20 pm IST

NSE | ఎన్‌ఎస్‌ఈ-బీఎంఈ కీలక ఒప్పందం.. మెటల్ డెరివేటివ్స్‌కు ఊతం..
Advertisement

NSE | నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) సోమవారం బాంబే మెటల్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (బీఎంఈ)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో నాన్-ఫెరస్ మెటల్ డెరివేటివ్స్ అభివృద్ధి, అవగాహన, వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఈ సహకారం ద్వారా ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ మార్కెట్ మౌలిక సదుపాయాలను మెరుగు ప‌రుస్తుంది. అలాగే బీఎంఈకి నాన్-ఫెరస్ మెటల్స్ వ్యాపార రంగంలో ఉన్న దీర్ఘకాల అనుభవం కార‌ణంగా ఇరు సంస్థ‌లు క‌లిసి మార్కెట్‌లో పాల్గొనేవారి సంఖ్యను పెంచడం, ధరల రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలను మెరుగుపరచడం, సమర్థవంతమైన హెడ్జింగ్ సాధనాల అభివృద్ధికి ప‌నిచేయ‌నున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న‌ విడుదల చేసింది.

మ‌రింత మెరుగ్గా రిస్క్ మేనేజ్‌మెంట్‌..

బీఎంఈకి తొమ్మిది దశాబ్దాలకుపైగా చరిత్ర ఉందని, ప్రపంచవ్యాప్తంగా నాన్-ఫెరస్ మెటల్స్ వ్యాపార, పరిశ్రమ రంగాల్లో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకుందని పేర్కొంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎన్‌ఎస్‌ఈ బలమైన డెరివేటివ్స్ మార్కెట్ వ్యవస్థ, బీఎంఈకి ఉన్న పరిశ్రమ నైపుణ్యం కలిసివచ్చి భారత నాన్-ఫెరస్ మెటల్స్ ఎకోసిస్టమ్‌కు మరింత బలం చేకూర్చనున్నట్లు తెలిపింది. భారత్ ప్రపంచంలోనే కాపర్, అల్యూమినియం, జింక్, లెడ్, నికెల్ వంటి పారిశ్రామిక లోహాల అతిపెద్ద వినియోగదారుల్లో ఒకటిగా ఉంది. దేశంలో తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరిస్తున్న నేపథ్యంలో ధరల హెచ్చుతగ్గులను సమర్థవంతంగా ఎదుర్కొనే పారదర్శక వ్యవస్థల అవసరం పెరుగుతోందని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా నాన్-ఫెరస్ మెటల్స్ విభాగంలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అయ్యే మెటల్ డెరివేటివ్స్ ద్వారా ధరల రిస్క్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

అన్ని వ‌ర్గాల‌కు అవ‌గాహ‌న‌..

ఉత్పత్తిదారులు, వినియోగదారులు, ప్రాసెసర్లు, ట్రేడర్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ సంఘాలు, ఆర్థిక మార్కెట్ భాగస్వాములతో కలిసి ఎక్స్ఛేంజ్ ఆధారిత రిస్క్ మేనేజ్‌మెంట్ పరిష్కారాల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయనుంది. ఈ సంద‌ర్భంగా ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ కమోడిటీ ధరల మార్పులకు గురయ్యే వ్యాపారాలకు సమర్థవంతమైన, పారదర్శక రిస్క్ మేనేజ్‌మెంట్ సాధనాలు అవసరమని అన్నారు. బీఎంఈతో భాగస్వామ్యం ద్వారా నాన్-ఫెరస్ మెటల్ డెరివేటివ్స్‌పై అవగాహన పెంచి, మార్కెట్ భాగస్వాములు ధరల రిస్క్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సహకరిస్తామని చెప్పారు. బీఎంఈ అధ్యక్షుడు సుశీల్ ఆర్ కొఠారి మాట్లాడుతూ భారత నాన్-ఫెరస్ మెటల్స్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఈతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఫిజికల్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ రిస్క్ మేనేజ్‌మెంట్ సాధనాలపై అవగాహన పెంచడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

త్వ‌ర‌లో వ‌స్తున్న ఎన్ఎస్ఈ ఐపీవో..

ఒప్పందంలో భాగంగా నాన్-ఫెరస్ మెటల్ డెరివేటివ్స్ ప్రాధాన్యం, ధరల రిస్క్ మేనేజ్‌మెంట్‌లో వాటి పాత్రపై పరిశ్రమ స్థాయి అవగాహన కార్యక్రమాలను ఎన్‌ఎస్‌ఈ, బీఎంఈ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. కాగా పెట్టుబ‌డిదారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీవో కోసం కూడా ఆ సంస్థ ఓ కీల‌క అడుగు వేసింది. ఇందుకు గాను త‌న డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట‌స్ (డీఆర్‌హెచ్‌పీ) ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి దాఖ‌లు చేసింది. దీంతో అతి త్వ‌ర‌లోనే ఎన్ఎస్ఈ ఐపీవోకు రానుంది.

Advertisement
Advertisement