త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

PMAY Urban 2.0 | సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అయితే పెరుగుతున్న ఆస్తి ధరలు, భారీ హోమ్ లోన్ వడ్డీ కారణంగా చాలా మంది ఆ కలను వాయిదా వేస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-అర్బన్ 2.0) పెద్ద ఊరటనిస్తోంది.

S

Business | Published On Jul 7, 2026, 1.31 pm IST

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..
Advertisement

PMAY Urban 2.0 | సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అయితే పెరుగుతున్న ఆస్తి ధరలు, భారీ హోమ్ లోన్ వడ్డీ కారణంగా చాలా మంది ఆ కలను వాయిదా వేస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-అర్బన్ 2.0) పెద్ద ఊరటనిస్తోంది. ఈ పథకం కింద మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే లేదా నిర్మించుకునే వారికి హోమ్ లోన్ వడ్డీపై గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీంతో ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐ భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ పథకం ప్రయోజనం పొందుతూ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటే, అర్హత, ముఖ్యమైన నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ పథకంలో కుటుంబ వార్షిక ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆయా ఆదాయ వర్గాలకు వడ్డీ సబ్సిడీ వర్తిస్తుంది.

ఇంటి విలువ ఎంత ఉండాలి..

ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు హోమ్ లోన్ పొందవచ్చు. అలాగే కొనుగోలు చేసే లేదా నిర్మించే ఇంటి మొత్తం విలువ రూ.35 లక్షల‌కు మించకూడదు. ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షల సబ్సిడీని ఐదు సమాన వార్షిక విడతలుగా, అంటే ప్రతి ఏడాది రూ.36వేల చొప్పున, నేరుగా లోన్ ఖాతాలో జమ చేస్తారు. దీంతో మీ అసలు రుణ మొత్తం తగ్గి, ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు విధించింది. అర్హులైన, నిజంగా అవసరమైన వారికి మాత్రమే ఈ స‌హాయం అందేలా ఈ నియమాలు అమల్లో ఉన్నాయి. దరఖాస్తుదారుడు లేదా అతని కుటుంబ సభ్యులు, అంటే భర్త, భార్య, అవివాహిత పిల్లల పేర్లపై దేశంలో ఎక్కడా శాశ్వత పక్కా ఇల్లు ఉండకూడదు. అలాగే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఇతర గృహ పథకాల కింద గతంలో ఎలాంటి గృహ ప్రయోజనం పొంది ఉండ‌కూడ‌దు.

ఏయే ప‌త్రాల‌ను స‌మర్పించాలి..

ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కేటగిరీలలో కొత్తగా కొనుగోలు చేసే ఇంటి రిజిస్ట్రేషన్‌లో కుటుంబంలోని ఒక వయోజన మహిళ పేరు తప్పనిసరిగా ఉండాలి. ఆమె పేరును ప్రధాన యజమానిగా లేదా సంయుక్త యజమానిగా నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. గుర్తింపు, చిరునామా రుజువుగా పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ అవసరం. ఉద్యోగులు పే స్లిప్‌లు, ఫాం-16 సమర్పించాలి. వ్యాపారులు లేదా స్వయం ఉపాధి పొందేవారు గత రెండు నుంచి మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాలి. అలాగే దేశంలో ఎక్కడా తమ పేరుపై శాశ్వత పక్కా ఇల్లు లేదని స్వీయ ప్రకటన అఫిడవిట్ ఇవ్వాలి. ఇంటికి సంబంధించిన ఆమోదిత లేఅవుట్ ప్లాన్, అమ్మకపు ఒప్పందం లేదా నిర్మాణ వ్యయ అంచనా పత్రాల‌ను కూడా సమర్పించాలి.

ఏం చేయాలి..

సబ్సిడీ పొందడానికి మొదట ప్రభుత్వం గుర్తించిన పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను ఎంపిక చేసుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ హౌసింగ్ వంటి సంస్థలు ఈ పథకం కింద రుణాల‌ను అందిస్తున్నాయి. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలోనే పీఎంఏవై-అర్బన్ 2.0 సబ్సిడీ దరఖాస్తు ఫామ్ కూడా నింపాలి. ఆదాయ ధ్రువపత్రాలు, ఆస్తి పత్రాలు, శాశ్వత ఇల్లు లేదని పేర్కొన్న అఫిడవిట్‌తోపాటు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి. బ్యాంకు వ్య‌క్తి అర్హత, సమర్పించిన పత్రాలను పరిశీలిస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటే రుణాన్ని ఆమోదించి, సబ్సిడీ అభ్యర్థనను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఆ తర్వాత కేంద్ర నోడల్ ఏజెన్సీ దరఖాస్తును పరిశీలిస్తుంది. ఆమోదం లభించిన తర్వాత సబ్సిడీ మొత్తాన్ని డీబీటీ ద్వారా నేరుగా హోమ్ లోన్ ఖాతాలో జమ చేస్తుంది. దీంతో రుణ బకాయి తగ్గి, నెలవారీ ఈఎంఐ కూడా తగ్గుతుంది.

దరఖాస్తుదారులు అధికారిక పీఎంఏవై వెబ్‌సైట్‌లో తమ అర్హతను స్వయంగా కూడా పరిశీలించుకోవచ్చు. అలాగే దరఖాస్తు సమయంలో లభించే అసెస్‌మెంట్ ఐడీ ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. అయితే రుణం యాక్టివ్‌గా కొనసాగుతూ, పథక నిబంధనలు పాటించినప్పుడే ప్రతి ఏడాది సబ్సిడీ విడతలు విడుదల అవుతాయి.

Advertisement
Advertisement