త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivasa Reddy | ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం వేగ‌వంతానికి.. క‌లెక్ట‌ర్ల‌కు అద‌న‌పు అధికారాలు

Ponguleti Srinivasa Reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్లకు అదనపు అధికారాలు అప్పగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే పథకాన్ని సమర్థంగా అమలు చేయగలమని ఆయన స్పష్టం చేశారు.

P

Telangana | Published On Apr 27, 2026, 5.24 pm IST

Ponguleti Srinivasa Reddy | ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం వేగ‌వంతానికి.. క‌లెక్ట‌ర్ల‌కు అద‌న‌పు అధికారాలు
Advertisement
  • అధికార వికేంద్రీక‌ర‌ణ‌తోనే స‌మ‌ర్థ‌వంతంగా ప‌థ‌కం అమ‌లు
  • భూ స‌ర్వేతోనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం
  • సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి
  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్ష‌

Ponguleti Srinivasa Reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్లకు అదనపు అధికారాలు అప్పగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే పథకాన్ని సమర్థంగా అమలు చేయగలమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా హౌసింగ్, రెవెన్యూ అంశాలపై వివరంగా చర్చించారు.

ద‌ర‌ఖాస్తు దారులంద‌రికీ..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి దరఖాస్తు సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామ‌ని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంద‌ని తెలిపారు. ప్రజాప్రతినిధుల సూచనలు, అభిప్రాయాలను కూడా ప్రభుత్వం సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, జిల్లా హౌసింగ్ అధికారులతో కలెక్టర్లు ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యలు రాకుండా ప్రజాప్రతినిధులతో సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గానికి సుమారు 3500 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించి, లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను పూర్తి చేయాలి..

ఇళ్ల నిర్మాణం చేపట్టలేని లబ్ధిదారులు తమకు అవసరం లేదని తెలియజేస్తే, ఆ స్థానంలో ఇతర అర్హులకు అవకాశం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. బేస్‌మెంట్ పూర్తైన వెంటనే మంజూరయ్యే రూ.లక్ష బిల్లుల విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ‌త ప్రభుత్వాల కాలంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేసి, వాటికి నీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని మంత్రి సూచించారు. పట్టణాల్లో స్థల పరిమితులను దృష్టిలో పెట్టుకుని 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య జీప్ల‌స్ వ‌న్ పద్ధతిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి భూ స‌ర్వే కీల‌కం..

భూసమస్యల శాశ్వత పరిష్కారానికి భూసర్వే కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ విధానం ప్రారంభించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ అనంతరం భూదార్ నెంబర్ కేటాయిస్తున్నట్లు వివరించారు. సాదాబైనామా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ఆర్డీవోలకే తుది అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా తహశీల్దార్ కార్యాలయాల నూతన భవనాలు నిర్మించనున్నట్లు, ప్రతి జిల్లా కేంద్రంలో ఆధునిక సదుపాయాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను ఉమ్మడి సర్వే ద్వారా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, మంత్రి జీ వివేక్, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement