త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?

EPFO | ఈపీఎఫ్ఓ (EPFO) కోట్లాది మంది పీఎఫ్ సభ్యులకు భారీ ఊరట కలిగించే కీలక డిజిటల్ సంస్కరణల‌ను పూర్తి చేసింది. అంద‌రు పీఎఫ్ సభ్యుల రికార్డులను విజయవంతంగా కేంద్రీకృత డేటాబేస్‌కు బదిలీ చేసింది. ఇటీవల జరిగిన అప్‌గ్రేడ్ అనంతరం తాత్కాలికంగా నిలిపివేసిన ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Jul 13, 2026, 2.49 pm IST

EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?
Advertisement

EPFO | ఈపీఎఫ్ఓ (EPFO) కోట్లాది మంది పీఎఫ్ సభ్యులకు భారీ ఊరట కలిగించే కీలక డిజిటల్ సంస్కరణల‌ను పూర్తి చేసింది. అంద‌రు పీఎఫ్ సభ్యుల రికార్డులను విజయవంతంగా కేంద్రీకృత డేటాబేస్‌కు బదిలీ చేసింది. ఇటీవల జరిగిన అప్‌గ్రేడ్ అనంతరం తాత్కాలికంగా నిలిపివేసిన ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ మేర‌కు తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అయితే కొత్త వ్యవస్థలో పీఎఫ్ క్లెయిమ్‌ల‌ను ఈపీఎఫ్ఓ అధికారుల వద్దకు చేరకముందే ఆటోమేటిక్‌గా పరిశీలిస్తారు. ఫామ్‌లో ఏవైనా తప్పులు లేదా లోపాలు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి సభ్యులకు తెలియజేస్తారు. దీంతో పీఎఫ్ సభ్యుల పనులు మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై సభ్యులు సమర్పించే ప్రతి పీఎఫ్ క్లెయిమ్ను ఈపీఎఫ్ఓ అధికారుల డెస్క్‌కు వెళ్లకముందే ఆటోమేటెడ్ ప్రీ-వాలిడేషన్ ప్రక్రియ ద్వారా పరిశీలిస్తారు. అంటే సిస్టమ్ మొదటి దశలోనే ఫామ్‌ను పూర్తిగా తనిఖీ చేస్తుంద‌న్న‌మాట‌.

పొర‌పాట్లు, అసంపూర్తి స‌మాచారం ఉంటే..

క్లెయిమ్ ఫాంలో ఏదైనా పొరపాటు, అసంపూర్ణ సమాచారం లేదా ఇతర లోపాలు ఉంటే కొత్త వ్యవస్థ వెంటనే గుర్తిస్తుంది. సభ్యులకు ముందుగానే సమాచారం అందడంతో వారు వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త పోర్టల్ తప్పులను గుర్తించడం మాత్రమే కాకుండా వాటిని ఎలా సరిచేయాలో కూడా మార్గదర్శకత్వం అందిస్తుంది. దీని వల్ల మొదటి ప్రయత్నంలోనే క్లెయిమ్ ఆమోదం పొందే అవకాశాలు పెరుగుతాయి. పదేపదే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇది సభ్యులకు ఉపయోగపడే మరో ముఖ్యమైన ఫీచర్ కాగా అనారోగ్యం, వివాహం, గృహ నిర్మాణం వంటి వివిధ పీఎఫ్ కేటగిరీల కింద తాము గరిష్టంగా ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చో క్లెయిమ్ దాఖలు చేయకముందే సభ్యులు తెలుసుకోగలుగుతారు. దీంతో అవసరానికి అనుగుణంగా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఏకైక డ్యాష్ బోర్డుతో అనేక సేవ‌లు..

కొత్త పోర్టల్‌లో సభ్యులకు యూనిఫైడ్ మెంబర్ డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏకైక డిజిటల్ వేదిక ద్వారా సభ్యత్వ వివరాలు, పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్థితి, పెన్షన్‌కు సంబంధించిన సర్వీస్ రికార్డు, ఇతర ప్రయోజనాలను ఒకేచోట తెలుసుకోవ‌చ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వార్షిక వడ్డీని ఆటో ప్రాసెస్ చేశారు. సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ జమ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. జూలై 15 నాటికి ఈ వడ్డీ మొత్తం సభ్యుల పాస్‌బుక్‌లలో కనిపించనుంది. ఆటో సెటిల్‌మెంట్ పరిధిని కూడా ఈపీఎఫ్ఓ విస్తరించింది. పూర్తి కేవైసీ లింకేజీ ఉన్న ఖాతాలకు రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ క్లెయిమ్‌లు ఆటో సెటిల్‌మెంట్ ద్వారా వెంటనే ప్రాసెస్ అవుతాయి. గతంలో ఈ పరిమితి కేవలం రూ.1 లక్ష వ‌ర‌కు మాత్రమే ఉండేది. యూఏఎన్, ఆధార్‌తో అనుసంధానమైన పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరిన వెంటనే పాత పీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా కొత్త ఖాతాకు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ట్రాన్స్‌ఫర్ దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం ఉండదు.

అద‌న‌పు స‌మాచారం, పత్రాలు కావాల‌న్నా..

పీఎఫ్ క్లెయిమ్‌కు సంబంధించి అదనపు సమాచారం లేదా పత్రాలు అవసరమైతే సభ్యులు నేరుగా పోర్టల్‌లోనే స్పందించి వాటిని సమర్పించవచ్చు. చిన్నచిన్న విషయాల కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదు. కొత్త వ్యవస్థలో కేంద్రీకృత చెల్లింపు విధానాన్ని అమలు చేశారు. క్లెయిమ్ ఆమోదం పొందిన రోజే ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థ ద్వారా సభ్యుల బ్యాంకు ఖాతాలో నేరుగా, సురక్షితంగా, వేగంగా నగదు జమ అవుతుంది. ఈపీఎస్ పెన్షన్ పొందుతున్న వారికి కూడా కొత్త వెసులుబాట్లు కల్పించారు. దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయంలోనైనా సేవలు పొందవచ్చు లేదా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. అలాగే పెన్షన్ క్లెయిమ్‌ను ఏ ప్రాంతీయ కార్యాలయం నుంచైనా ప్రాసెస్ చేయవచ్చు. దేశంలోని ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ జమ అయ్యే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.

మ‌రో 2 వారాల్లో పూర్తి స్థాయి సేవ‌లు..

డేటాబేస్‌ను పూర్తిగా కొత్త వ్యవస్థకు మార్చిన తర్వాత ప్రస్తుతం స్టెబిలైజేషన్ దశ కొనసాగుతోంది. అందువల్ల వచ్చే రెండు వారాల పాటు అన్ని క్లెయిమ్‌లు, సేవల అభ్యర్థనలు అదనపు పరిశీలన, ధ్రువీకరణకు లోనవుతాయి. ఇప్పటి వరకు కంపెనీ నమోదు చేసిన ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయం మాత్రమే సభ్యుల పీఎఫ్ పనులను నిర్వహించేది. అయితే కేంద్రీకృత వ్యవస్థ అమల్లోకి రావడంతో దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న అధీకృత ఈపీఎఫ్ఓ అధికారి అయినా సభ్యుల సేవల అభ్యర్థనలను ప్రాసెస్ చేయవ‌చ్చు. దీంతో పీఎఫ్ సేవల వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement