త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO | పీఎఫ్‌ విత్‌డ్రాలో ట్యాక్స్ ఎప్పుడు విధిస్తారు, కొత్త రూల్స్ ఇవే..

EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు పలు కీలక సంస్కరణలను తీసుకొచ్చింది. రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు రూపొందించిన ఈ పథకం కింద, అత్యవసర పరిస్థితుల్లో కూడా సభ్యులు తమ పొదుపులను సులభంగా ఉపయోగించుకునేలా మార్పులు చేసింది.

S

Business | Published On Jul 7, 2026, 3.47 pm IST

EPFO | పీఎఫ్‌ విత్‌డ్రాలో ట్యాక్స్ ఎప్పుడు విధిస్తారు, కొత్త రూల్స్ ఇవే..
Advertisement

EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు పలు కీలక సంస్కరణలను తీసుకొచ్చింది. రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు రూపొందించిన ఈ పథకం కింద, అత్యవసర పరిస్థితుల్లో కూడా సభ్యులు తమ పొదుపులను సులభంగా ఉపయోగించుకునేలా మార్పులు చేసింది. ఈపీఎఫ్ పథకం ప్రకారం ఉద్యోగులు ప్రతి నెల తమ జీతంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అదే మొత్తాన్ని యజమాని కూడా ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. ఈ మొత్తం కాలక్రమేణా వడ్డీతో కలిసి పెరుగుతూ రిటైర్మెంట్ సమయానికి భారీ కార్పస్‌గా మారుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ లభిస్తోంది. దీంతో ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో గణనీయమైన నిధి సమకూరుతుంది. అయితే ఉద్యోగం కోల్పోవడం, ఇల్లు కొనుగోలు చేయడం, విద్యావసరాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా ఉద్యోగులు ముందుగానే తమ పీఎఫ్ డబ్బును ఉప‌సంహ‌రించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌వో పాక్షిక విత్‌డ్రాకు అనుమతి ఇస్తుంది.

13కు బ‌దులుగా 3 విభాగాలు..

పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌వో గతంలో ఉన్న 13 వేర్వేరు విత్‌డ్రా కేటగిరీలను ఇప్పుడు మూడు ప్రధాన విభాగాలుగా మార్చింది. అవి ఎసెన్షియల్ నీడ్స్, హౌసింగ్, స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్. ఈ మార్పుతో సభ్యులు పాక్షికంగా పీఎఫ్ డబ్బు తీసుకునే ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంస్కరణలు వచ్చినప్పటికీ పీఎఫ్ విత్‌డ్రాపై వర్తించే పన్ను నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. పీఎఫ్ ఖాతా నిరంతరంగా ఐదేళ్లు పూర్తయిన తర్వాత చేసే విత్‌డ్రాలు పూర్తిగా పన్ను మినహాయింపుకు అర్హం. కానీ ఐదేళ్లు పూర్తికాకముందే డబ్బు తీసుకుంటే కొన్ని పరిస్థితుల్లో పన్ను, అలాగే టీడీఎస్ వర్తిస్తాయి. ముఖ్యంగా విత్‌డ్రా మొత్తం రూ.50 వేలకుపైగా ఉంటే టీడీఎస్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. రూ.50 వేలలోపు పీఎఫ్ విత్‌డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. విత్‌డ్రా మొత్తం రూ.50 వేలకుపైగా ఉన్నప్పటికీ ఉద్యోగి నిరంతరంగా ఐదేళ్ల సేవ పూర్తి చేసి ఉంటే కూడా టీడీఎస్ ఉండదు.

టీడీఎస్ ఏ సంద‌ర్భాల్లో ఉండ‌దు..

ఉద్యోగి ఐదేళ్లలోపు సేవ చేసినప్పటికీ పీఎఫ్ మొత్తాన్ని మరో పీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తే టీడీఎస్ ఉండదు. అలాగే అనారోగ్యం కారణంగా ఉద్యోగం కోల్పోవడం, సంస్థ మూతపడటం లేదా ఉద్యోగి నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల సేవలు ముగిసిన సందర్భాల్లో కూడా టీడీఎస్ విధించరు. ఉద్యోగి ఐదేళ్ల సేవ పూర్తికాకముందే రూ.50 వేలకుపైగా పీఎఫ్ విత్‌డ్రా చేసి, పాన్ కార్డు సమర్పించకపోతే 34.60 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అదే ఐదేళ్లలోపు రూ.50 వేలకుపైగా విత్‌డ్రా చేయాలనుకునే ఉద్యోగి పాన్ కార్డు సమర్పించి, కొత్తగా ప్రవేశపెట్టిన ఫామ్ 121ను సమర్పిస్తే టీడీఎస్ నుంచి మినహాయింపు పొందవచ్చు. అయితే ఫామ్ 121 సమర్పించకపోతే, పాన్ ఉన్నప్పటికీ 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.

కొత్త‌గా వ‌చ్చిన ఫామ్ 121..

గతంలో టీడీఎస్ మినహాయింపుకోసం ఉపయోగించిన‌ ఫామ్ 15జి, ఫామ్ 15హెచ్ స్థానంలో, 2025 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇప్పుడు ఫామ్ 121ని ప్రవేశపెట్టారు. ఆదాయ‌పు పన్ను శాఖ వివరాల ప్రకారం, పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని పన్ను చెల్లింపుదారులపై అనవసరంగా టీడీఎస్ కోత పడకుండా నిరోధించడమే ఫామ్ 121 ఉద్దేశం. దీంతో తర్వాత రీఫండ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం తగ్గడంతోపాటు పరిపాలనా భారం కూడా తగ్గుతుందని పేర్కొంది.

Advertisement
Advertisement