త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPF కొత్త రూల్స్.. ఎక్కువ జీతమా? భారీ రిటైర్మెంట్ ఫండా? ఏది మంచిది?

EPF | కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) స్కీమ్-2026ని నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలతో పీఎఫ్ (PF) కోతల లెక్కల్లో కీలక మార్పులు వచ్చాయి. దీంతో ఉద్యోగుల్లో సందిగ్ధత‌ ఏర్పడింది. కొత్త రూల్స్ ప్రకారం ఉద్యోగులు తమ పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించుకుంటే నెలవారీ టేక్-హోమ్ జీతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Jul 6, 2026, 3.43 pm IST

EPF కొత్త రూల్స్.. ఎక్కువ జీతమా? భారీ రిటైర్మెంట్ ఫండా? ఏది మంచిది?
Advertisement

EPF | కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) స్కీమ్-2026ని నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలతో పీఎఫ్ (PF) కోతల లెక్కల్లో కీలక మార్పులు వచ్చాయి. దీంతో ఉద్యోగుల్లో సందిగ్ధత‌ ఏర్పడింది. కొత్త రూల్స్ ప్రకారం ఉద్యోగులు తమ పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించుకుంటే నెలవారీ టేక్-హోమ్ జీతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేయడం నిజంగా సరైన నిర్ణయమేనా అనే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం చేతికి ఎక్కువ జీతం రావడం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో అది నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 8.25 శాతం భద్రమైన వడ్డీతో పెరుగుతున్న EPF నిధిని కొనసాగించాలా, లేక ప్రతి నెల అదనపు జీతాన్ని ఎంచుకోవాలా అనే అంశాన్ని ఉద్యోగులు జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తున్నారు.

చేతికి వచ్చే జీతం పెరుగుతుంది..

జాగుల్ కంపెనీ ట్యాక్స్‌ప్లానర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుధీర్ కౌశిక్ మాట్లాడుతూ, ఉద్యోగి EPF ఖాతాకు 12 శాతం కాంట్రిబ్యూషన్ కొనసాగుతుందని, అయితే ఆ 12 శాతం ఏ జీతంపై లెక్కించాలనే విషయంలోనే ప్రధాన మార్పు వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు చాలా కంపెనీలు ఉద్యోగి వాస్తవ బేసిక్ జీతం లేదా చట్టపరమైన రూ.15వేల వేతన పరిమితి ఆధారంగా పీఎఫ్ కోతలు విధించేవి. ఈ విధానంలో ప్రతి నెల కనీసం రూ.1,800 పీఎఫ్ ఖాతాలో జమ కావాలి. కొత్త నిబంధనల ప్రకారం తప్పనిసరి 12 శాతం కాంట్రిబ్యూషన్‌ను చట్టపరమైన వేతన పరిమితికే పరిమితం చేశారు. ఈ పరిమితికి మించి పీఎఫ్‌లో చెల్లించాలంటే అది ఉద్యోగి, కంపెనీ పరస్పర అంగీకారంతో స్వచ్ఛందంగా మాత్రమే ఉంటుంది. ఉద్యోగి కంపెనీతో అంగీకరించి ప్రతి నెల కేవలం రూ.1,800 మాత్రమే పీఎఫ్‌లో జమ చేయాలని నిర్ణయించుకుంటే, మిగిలిన బేసిక్ జీతం నేరుగా టేక్-హోమ్ శాలరీలో చేరుతుంది. దీంతో ప్రతి నెల చేతికి వచ్చే జీతం పెరుగుతుంది.

ఉదాహ‌ర‌ణ చూస్తే..

ప్రస్తుతం ఎక్కువ జీతం వస్తుందనే ఉద్దేశంతో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకోవడం భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపిస్తుంద‌ని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమోర్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిషా సంఘ్వీ ఉదాహరణగా వివరిస్తూ, ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ.50వేలు అనుకుంటే, ఇప్పటివరకు ప్రతి నెల 12 శాతం చొప్పున రూ.6వేలు పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ వ‌చ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం కేవలం తప్పనిసరి రూ.1,800 మాత్రమే పీఎఫ్‌లో జమ చేస్తే, ఉద్యోగి చేతికి వెంటనే రూ.4,200 అదనంగా వస్తుంది. అయితే ఇదే రూ.4,200 ప్రతి నెల పీఎఫ్‌లోనే కొనసాగి, 8.25 శాతం వడ్డీతో 25 సంవత్సరాల పాటు పెట్టుబడిగా ఉంటే, దాదాపు రూ.41 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు రిటైర్మెంట్ ఫండ్‌గా మారే అవకాశం ఉంటుందని చెప్పారు.

పీఎఫ్ మొత్తాన్ని తగ్గిస్తే దీర్ఘ‌కాలంలో న‌ష్ట‌మే..

అదే సమయంలో ఉద్యోగి ఈ ఎంపికను ఎంచుకున్న తర్వాత కంపెనీ కూడా తన స్వచ్ఛంద పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను నిలిపివేస్తే, రిటైర్మెంట్ నిధిపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మొత్తం నష్టం రూ.80 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చేతికి ఎక్కువ జీతం రావడం వల్ల పన్ను భారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు EPFలో కూడిన మొత్తం, దానిపై లభించే వడ్డీ నిర్దిష్ట నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతుంది. అందువల్ల తక్షణ ప్రయోజనం కోసం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించే ముందు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement