E-commerce Rules | ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. తప్పుదోవ పట్టించే డిస్కౌంట్లకు చెక్..
E-commerce Rules | ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒక వస్తువుపై 60 శాతం డిస్కౌంట్ అని కనిపించినప్పుడు.. అసలు దాని పాత ధర నిజమేనా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అలాగే వెతికిన వస్తువుకు సరిపోని లేదా ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తులే సెర్చ్ ఫలితాల్లో మొదట కనిపించడం, వాటిని దాటుకుని కావాల్సిన వస్తువు కోసం చాలా సేపు స్క్రోల్ చేయాల్సి రావడం కూడా సాధారణమే.
E-commerce Rules | ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒక వస్తువుపై 60 శాతం డిస్కౌంట్ అని కనిపించినప్పుడు.. అసలు దాని పాత ధర నిజమేనా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అలాగే వెతికిన వస్తువుకు సరిపోని లేదా ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తులే సెర్చ్ ఫలితాల్లో మొదట కనిపించడం, వాటిని దాటుకుని కావాల్సిన వస్తువు కోసం చాలా సేపు స్క్రోల్ చేయాల్సి రావడం కూడా సాధారణమే. ఇలాంటి పద్ధతులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలను తీసుకొచ్చింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ, వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు 2020లో మార్పులు చేసింది. ఈ మార్పుల ఉద్దేశం ఈ-కామర్స్ రంగంలో పారదర్శకతను పెంచడంతోపాటు వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడమే. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.
డిస్కౌంట్ ముందు ధర ఎంతో చెప్పాల్సిందే..
కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా ఉత్పత్తిపై ధర తగ్గింపు ప్రకటించినప్పుడు ఈ-కామర్స్ వేదికలు తగ్గించిన ధరతోపాటు దాని మునుపటి ధరను కూడా చూపించాలి. ఈ మునుపటి ధర అంటే డిస్కౌంట్ ప్రకటించడానికి ముందు 30 రోజుల్లో ఆ ఉత్పత్తి లేదా సేవ విక్రయించిన అత్యల్ప ధరగా నిర్వచించారు. దీంతో ఒక ఉత్పత్తిపై 50 శాతం లేదా 60 శాతం డిస్కౌంట్ అంటూ చూపించినప్పుడు, ఆ డిస్కౌంట్ నిజంగా ఎంతవరకు ఉందో వినియోగదారులు సులభంగా అంచనా వేయగలుగుతారు. ఈ-కామర్స్ వేదికలు సెర్చ్ ఫలితాలను కూడా తారుమారు చేయకుండా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. వినియోగదారుడు ఇచ్చిన సెర్చ్ ప్రశ్నకు సంబంధించిన ఫలితాల ప్రాధాన్యతను తప్పుదోవ పట్టించే విధంగా మార్చడం లేదా సెర్చ్ ఫలితాలను దెబ్బతీసే విధంగా వాటిని మార్చడం నిషేధం. ఉదాహరణకు వినియోగదారుడు తక్కువ ధరలో ఉన్న ఉత్పత్తి కోసం వెతికితే, దానికి బదులుగా ఎక్కువ ధర ఉన్న వస్తువును లేదా ప్లాట్‌ఫామ్ సొంత సంస్థకు చెందిన ఉత్పత్తిని కావాలనే ముందుగా చూపించడం వంటి పద్ధతులకు అడ్డుకట్ట పడనుంది.
డార్క్ ప్యాటర్న్స్‌పై నిబంధనలు కఠినతరం..
అదేవిధంగా చెల్లింపు చేసి ముందుకు తీసుకువచ్చిన లేదా ప్రాయోజిత ఉత్పత్తులను స్పష్టంగా గుర్తించేలా ఈ-కామర్స్ సంస్థలు చర్యలు తీసుకోవాలి. ప్రాయోజిత జాబితాలకు స్పష్టమైన, ప్రముఖమైన సమాచారం ఇవ్వాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో సాధారణ సెర్చ్ ఫలితంగా కనిపిస్తున్న ఉత్పత్తి నిజంగా సంబంధిత ఫలితమా, లేక డబ్బు చెల్లించి పైకి తీసుకొచ్చిన ప్రకటననా అనేది వినియోగదారులు గుర్తించగలుగుతారు. వినియోగదారులను ప్రభావితం చేసే డార్క్ ప్యాటర్న్స్ పై కూడా కొత్త నిబంధనలు కఠినతరం చేశారు. 2023లో తీసుకొచ్చిన డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ మార్గదర్శకాలను ఈ-కామర్స్ సంస్థలు పాటించాలి. అలాగే ప్రతి ఏడాది స్వీయ ఆడిట్ నిర్వహించి, నిబంధనలు పాటిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని ప్రముఖంగా ప్రదర్శించాలి.

యాప్ డిజైన్ సైతం..
వినియోగదారులను వారు ఉద్దేశించని నిర్ణయాలు తీసుకునేలా వెబ్‌సైట్ లేదా యాప్ డిజైన్‌ను ఉపయోగించడం డార్క్ ప్యాటర్న్‌గా పరిగణిస్తారు. ఇందులో తప్పుడు అత్యవసరతను చూపించడం, కొనుగోలు సమయంలో వినియోగదారు కోరని వస్తువులను బాస్కెట్‌లో చేర్చడం, సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఉద్దేశపూర్వకంగా కష్టతరం చేయడం, ప్రకటనలను సాధారణ సిఫార్సుల్లా చూపించడం, కీలకమైన సమాచారాన్ని దాచడం వంటి పద్ధతులు ఉంటాయి. 2023 మార్గదర్శకాల్లో తప్పుడు అత్యవసరత, బాస్కెట్ స్నీకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, బలవంతపు చర్య, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్, బైట్ అండ్ స్విచ్, డ్రిప్ ప్రైసింగ్, ప్రకటనను మారువేషంలో చూపించడం, పదేపదే అడిగే విధానం, ట్రిక్ ప్రశ్న, సాస్ బిల్లింగ్, రోగ్ మాల్‌వేర్ వంటి డార్క్ ప్యాటర్న్స్‌ను పేర్కొన్నారు. కొత్త నిబంధనల ద్వారా వీటిపై ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల అమలు మరింత స్పష్టంగా ఈ-కామర్స్ నిబంధనల్లోకి వచ్చింది.
ఫిర్యాదులపై మరింత స్పష్టత..
వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వారికి మరింత స్పష్టత లభించనుంది. ప్రతి ఈ-కామర్స్ సంస్థ తమ ఫిర్యాదుల పరిష్కార అధికారి నమోదు చేసిన ఫిర్యాదు ప్రతిని ఫిర్యాదుదారుడికి అందించాలి. దీంతో వినియోగదారు ఏ సమస్యపై ఫిర్యాదు చేశారో, సంస్థ అధికారికంగా ఏ వివరాలను నమోదు చేసిందో స్పష్టమైన రికార్డు లభిస్తుంది. ఈ-కామర్స్ సంస్థలు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌తో కూడా అనుసంధానం కావాలి. ప్రతి ఈ-కామర్స్ సంస్థ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ సమన్వయ ప్రక్రియలో భాగస్వామి కావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతో మరింత సన్నిహితంగా అనుసంధానం చేయడమే దీని ఉద్దేశం. ఫిర్యాదుల సంఖ్య కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాల్లో ఒకటి. 2025లో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు మొత్తం 17,71,622 ఫిర్యాదులు అందగా, వాటిలో 5,11,196 ఫిర్యాదులు, అంటే దాదాపు 29 శాతం, ఈ-కామర్స్‌కు సంబంధించినవే.

ఉత్పత్తులు, విక్రేతల వివరాలు తప్పనిసరి..
ఉత్పత్తులు, విక్రేతలకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా మార్కెట్‌ప్లేస్ వేదికలు అందించాల్సి ఉంటుంది. ఉత్పత్తి బెస్ట్ బిఫోర్ లేదా యూజ్ బిఫోర్ తేదీలు, రిటర్న్, రీఫండ్ నిబంధనలు, వారంటీ, డెలివరీ, చెల్లింపు వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు వినియోగదారులకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధం లేని సేవల కోసం అనవసరంగా కలిపిన రుసుములను వసూలు చేయడంపైనా నిబంధనలు ఉన్నాయి. నిర్దిష్ట నిబంధనల ప్రకారం వచ్చే లాయల్టీ లేదా మెంబర్‌షిప్ కార్యక్రమాలను మినహాయించి, సంబంధం లేని సేవల కోసం బండిల్ చేసిన రుసుములను మార్కెట్‌ప్లేస్ ఈ-కామర్స్ సంస్థలు వసూలు చేయకూడదు. ఉదాహరణకు, 1000 రూపాయల విలువైన షూలను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారు కోరని అకౌంట్ ప్రొటెక్షన్ వంటి సేవ పేరుతో అదనంగా 50 రూపాయలు వసూలు చేయడం సాధ్యం కాదు.
విదేశీ వస్తువులు అయితే..
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విషయంలో కూడా మరింత సమాచారం ఇవ్వాలి. ఆ ఉత్పత్తిని దిగుమతి చేసిన సంస్థ పేరు, దానికి సంబంధించిన వివరాలతోపాటు ఉత్పత్తి ఏ దేశం నుంచి వచ్చిందో మార్కెట్‌ప్లేస్ వేదికలు వెల్లడించాలి. వినియోగదారుల సమాచార వినియోగంపైనా కొత్త నిబంధనలు పరిమితులు విధిస్తున్నాయి. మార్కెట్‌ప్లేస్ ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల సమాచారాన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించాలంటే వినియోగదారుడి స్పష్టమైన, సానుకూల సమ్మతి పొందాలి. ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల కార్యకలాపాల ద్వారా ఏర్పడే సమాచారాన్ని సంస్థలు లేదా వాటికి అనుబంధంగా ఉన్న విక్రేతలు కొన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే సందర్భాల్లో ఈ నిబంధన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. వినియోగదారు చురుకుగా అంగీకరించకుండా అలాంటి సమాచారాన్ని నిర్దిష్ట వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడంపై స్పష్టమైన పరిమితి విధించారు.
ఈ మార్పులు ఆన్‌లైన్ షాపింగ్‌లో వినియోగదారుడి ప్రయాణంలోని దాదాపు ప్రతి దశలో పారదర్శకతను పెంచేలా ఉన్నాయి. ఉత్పత్తి కోసం సెర్చ్ చేసినప్పటి నుంచి ధర, డిస్కౌంట్ చూసే వరకు, ప్రకటనను గుర్తించడం, విక్రేత వివరాలు తెలుసుకోవడం, కొనుగోలు చేయడం, చివరకు ఫిర్యాదు చేయడం వరకు వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం, మెరుగైన రక్షణ కల్పించడమే కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం.
తాజావార్తలు
- ●Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ .... వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్
- ●Etala Rajendar | దూరమవుతున్న స్నేహ, బంధుత్వాలను ఈ ఉత్సవాలు దగ్గర చేస్తాయి: ఈటల రాజేందర్
- ●OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ - ఫస్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్
- ●అపారమైన సిరిసంపదలు ఉన్నా.. పోరాడే సైనిక బలం లేదా? సౌదీ రక్షణ వ్యవస్థలో అసలు లోపమేంటి?
- ●Apple | ఐఫోన్లను అమ్మేందుకు యాపిల్ పాట్లు.. పెరిగిన ధరలకు కౌంటర్‌గా ఆఫర్లు..
- ●Revanth Reddy Vinayaka Chaviti | కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేషన్ .... వినాయకచవితి రోజు ఫొటోతో కన్ఫామ్ చేసిన తెలుగు డైరెక్టర్

Etala Rajendar | దూరమవుతున్న స్నేహ, బంధుత్వాలను ఈ ఉత్సవాలు దగ్గర చేస్తాయి: ఈటల రాజేందర్

OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ - ఫస్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్

అపారమైన సిరిసంపదలు ఉన్నా.. పోరాడే సైనిక బలం లేదా? సౌదీ రక్షణ వ్యవస్థలో అసలు లోపమేంటి?






