త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramachander Rao | అది ‘యాంటీ భారత్ సమ్మిట్’

N Ramachander Rao | హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది అసలు భారత్ సమ్మిట్ కాదని, పక్కా ‘యాంటీ భారత్ సమ్మిట్’ అని అభివర్ణించారు.

S

Telangana | Published On Nov 11, 2026, 3.42 pm IST

N Ramachander Rao | అది ‘యాంటీ భారత్ సమ్మిట్’
Advertisement

దాని వెనుక రాహుల్ గాంధీ రాజకీయ రీలాంచ్ కుట్ర
భార‌త్ స‌మ్మిట్‌పై ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆరోప‌ణ‌లు

N Ramachander Rao | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది అసలు భారత్ సమ్మిట్ కాదని, పక్కా ‘యాంటీ భారత్ సమ్మిట్’ అని అభివర్ణించారు. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే విదేశీ శక్తులకు ఈ సదస్సు వేదికగా మారుతోందని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలు, వ్యక్తులు ‘ప్రోగ్రెసివ్ అలయెన్స్’ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డారని, అందులో రాహుల్ గాంధీ కూడా భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీతో ఈ కూటమికి చెందిన నాయకులు దిగిన ఫొటోలను పరిశీలిస్తే వారి సంబంధాలు స్పష్టమవుతాయని వ్యాఖ్యానించారు.

‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ సంస్థ ప్రతినిధుల బృందంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీలో సమావేశమయ్యారని, 10 జనపథ్‌లో సోనియా గాంధీ సైతం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారని రాంచందర్ రావు ఆరోపించారు. ఈ సంస్థ వెనుక జార్జ్ సోరోస్ వంటి భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు ‘రెజీమ్ చేంజ్’ పేరుతో కుట్రపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. స్పెయిన్, ఫ్రాన్స్, అల్బేనియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో ఈ కూటమి తీవ్ర అలజడులకు కారణమైందని ఆరోపించారు. ఇప్పుడు అదే శక్తులను భారత్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

రాహుల్ గాంధీని మళ్లీ ప్రజల ముందుకు తీసుకురావడమే

ఇలాంటి విదేశీ శక్తుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘భారత్ సమ్మిట్’ నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశం రాజకీయంగా విఫలమైన రాహుల్ గాంధీని మళ్లీ ప్రజల ముందుకు తీసుకురావడమేనని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులతో కలిసి సదస్సులు నిర్వహించడం సరికాదని అన్నారు. ప్రోగ్రెసివ్ అలయెన్స్‌లోని దేశాల్లో 42 దేశాలు ఇస్లామిక్ దేశాలని, మిగిలినవాటిలో ఎక్కువ దేశాలు వామపక్ష భావజాలం కలిగినవని పేర్కొన్నారు. భారతదేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, అశాంతి సృష్టించేందుకు విదేశీ శక్తులు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ సదస్సును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది

భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ విజన్‌ను వినాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇప్పటికే దేశ ప్రజల మద్దతు కోల్పోయిన రాహుల్ గాంధీని 100 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విదేశీ ప్రతినిధులను అడ్డుపెట్టుకుని రాహుల్ గాంధీని రాజకీయంగా తిరిగి లాంచ్ చేయాలనుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు, ప్రోగ్రెసివ్ అలయెన్స్ అండతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement