త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MSTC Share Price | క్యూ2 ఫలితాలతో ఎంఎస్‌టీసీ షేర్లకు జోష్.. 6 నెల‌ల్లో 81 శాతం లాభాలు..

MSTC Share Price | రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధిని నమోదు చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ షేర్లు దూసుకెళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. కంపెనీ నికర లాభం 51.8 శాతం పెరగడంతోపాటు, బొగ్గు, ఇతర ఖనిజాల ఎక్స్ఛేంజీల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుండడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

S

Business | Published On Nov 13, 2026, 1.27 pm IST

MSTC Share Price | క్యూ2 ఫలితాలతో ఎంఎస్‌టీసీ షేర్లకు జోష్.. 6 నెల‌ల్లో 81 శాతం లాభాలు..
Advertisement

MSTC Share Price | రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధిని నమోదు చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ షేర్లు దూసుకెళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. కంపెనీ నికర లాభం 51.8 శాతం పెరగడంతోపాటు, బొగ్గు, ఇతర ఖనిజాల ఎక్స్ఛేంజీల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుండడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

భారీ ర్యాలీ దిశ‌గా షేర్లు..

ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ (MSTC) షేర్లు క్యూ2 ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీని నమోదు చేశాయి. బీఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్‌లోనే షేరు ధర 20 శాతం పెరిగి రూ.783.65కు చేరుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాది ఇదే కాలంలోని రూ.49.15 కోట్ల నుంచి 51.8 శాతం పెరిగి రూ.74.60 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 29.43 శాతం వృద్ధితో రూ.85 కోట్ల నుంచి రూ.110.02 కోట్లకు పెరిగింది. నిర్వహణ పరంగా ఈబీఐటీడీఏ 43 శాతం పెరిగి రూ.73.89 కోట్లకు చేరగా, ఈబీఐటీడీఏ మార్జిన్ 60.62 శాతం నుంచి 67.15 శాతానికి మెరుగుపడింది.

కీల‌క స్థాయిలు ఇవే..

భవిష్యత్ వ్యాపార అవకాశాల్లో భాగంగా బొగ్గు, ఇతర ఖనిజాల ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఎంఎస్‌టీసీ వెల్లడించింది. అదేవిధంగా ట్రెడ్స్ (TReDS) ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఇందుకు అవసరమైన అనుమతుల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసినట్లు తెలిపింది. సాంకేతిక విశ్లేషకుడు, కుష్ బోహ్రా వ్యవస్థాపకుడు కుష్ బోహ్రా అభిప్రాయం ప్రకారం.. ఇటీవల రూ.530 స్థాయి మద్దతు ధర నుంచి షేరు దాదాపు 40 శాతం కోలుకుంది. రూ.800 కీలక నిరోధక స్థాయిని అధిగమిస్తే కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్‌అవుట్‌కు అవకాశముందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత స్థాయిల్లో కొత్తగా కొనుగోళ్లు చేపట్టే విషయంలో జాగ్రత్త అవసరమని, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు కొంత లాభాలను స్వీకరించడంతోపాటు మిగిలిన షేర్లకు రూ.755 వద్ద స్టాప్‌లాస్‌ను కొనసాగించాలని సూచించారు.

ఎంఎస్‌టీసీ షేర్లు గత నెలలో 15 శాతం, మూడు నెలల్లో 35 శాతం, ఆరు నెలల్లో 81 శాతం రాబడిని అందించాయి. ఏడాది కాలంలో 48 శాతం పెరిగాయి. గత మూడేళ్లలో 85 శాతం వృద్ధి నమోదు చేయగా, ఐదేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. శుక్ర‌వారం ఉదయం 10:15 గంటల సమయానికి బీఎస్ఈలో షేరు 19.29 శాతం లాభంతో రూ.779 వద్ద ట్రేడయింది. అయితే ఇప్పటికే భారీగా పెరిగిన నేపథ్యంలో తదుపరి ర్యాలీ కొనసాగుతుందా లేదా అన్నది కీలక నిరోధక స్థాయిలను అధిగమించడం, కంపెనీ భవిష్యత్ వ్యాపార పురోగతిపై ఆధారపడి ఉంటుంది.

Advertisement
Advertisement