RS Praveen Kumar | ‘తెలంగాణ రేవంత్ సైన్యమే’ కవిత పార్టీ
RS Praveen Kumar | సీఎం రేవంత్ స్క్రిప్ట్ రాసిస్తే కవిత (Kavitha) మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ (TRS) అంటే ‘తెలంగాణలో రేవంత్ సైన్యం’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు.
- టీఆర్ఎస్ అంటే అర్థం అదే
- కాంగ్రెస్‌కు నాలుగో అనుబంధ సంస్థ అది
- రేవంత్‌రెడ్డి సౌజన్యంతోనే పాంచజన్య కార్యక్రమం నడిపిస్తోంది
- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ రేవంత్ ఇస్తేనే కవిత చేతికి వచ్చిందని అర్థమైతుంది
- కవితపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజం
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సైన్యమని.. సీఎం రేవంత్ స్క్రిప్ట్ రాసిస్తేనే కవిత (Kavitha) మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. కాగ్రెస్‌కు నాలుగో అనుబంధ సంస్థ టీఆర్ఎస్ అని విమర్శించారు. రేవంత్ ఇస్తేనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ కవిత చేతికొచ్చిందని ఆరోపించారు. మల్లన్నసాగర్ భూ కంపం వచ్చే ప్రాంతంలో కట్టారని అనడం హాస్యాస్పదమన్నారు. కొండపోచమ్మ ఆయకట్టులోనే కేసీఆర్ భూమి ఉందని.. నీళ్లు పోతే కవితకు వచ్చే సమస్య ఏంటని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఘాటు విమర్శలు చేశారు.
కేసీఆర్‌కు ధన్యవాదాలు..
కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించినందుకు కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక దుర్మార్గమైన పెను దోపిడీ నుంచి రక్షించినట్లు అర్థమైతుంది. రేవంత్‌రెడ్డి సౌజన్యంతో పాంచజన్య అనే కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని కవితగారు ఏర్పాటు చేశారు. పాంచజన్యం పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న కవిత గురించి ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉన్నది. లేకపోతే ప్రజల భవిష్యత్ ప్రమాదంలో పడొచ్చు.
పొత్తన్న పెట్టాలి.. లేదా గొంతన్న కలపాలి
ప్రభుత్వం తీసుకుంటున్న దుందుడుకు చర్యలపై ప్రతిపక్షాలు మాట్లాడాలి. కానీ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అక్రమంగా సిట్ లు వేసినా, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తింపినా ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. బాగా కొట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీతోటి పొత్తన్న కలపాలి.. లేదా గొంతన్న కలపాలి. కానీ జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్‌ను కవిత మరమనిషి అన్నారు. కేటీఆర్‌ను ఎన్నోసార్లు దూషించారు. హరీశ్ రావును అయితే అనని మాట లేదు. కానీ ఆయన ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు.
ఆమె గళమంతా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపైన్నే
కవితగారు! మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు యూత్ కాగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐతో పాటు ఇవాళ నాలుగో అనుబంధ సంస్థ వచ్చింది. అదే తెలంగాణ రక్షణ సేన పార్టీ. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ సైన్యం.. అనేదే టీఆర్ఎస్. రేవంత్ మీద ఈగ కూడా వాలకుండా టీఆర్ఎస్ కాపాడుతుంది. దాని నాయకురాలు కవిత. అధికార పార్టీ చేస్తున్న భూ దందాల మీద కొట్లాడాలి. ఎండిపోయిన పంటల కోసం కొట్లాడాలి. హైదరాబాద్ తాగునీటి కోసం కొట్లాడాలి. బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలపై కొట్లాడాలి. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా గళమెత్తాలి. కానీ ఈ గళమంతా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీదనే ఎత్తుతున్నది.
సృజన్‌రెడ్డి కన్‌స్ట్రక్షన్‌కు వచ్చేవిధంగా చేసింది కవితగారే..
2012లో ఆదికోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్ ఎవరంటే అనుముల రేవంత్‌రెడ్డి. 2010లో కల్వకుంట్ల కవిత ఒక డైరెక్టర్. సృజన్ సూదిని అనే ఇంకొక డైరెక్టర్. ఈన రేవంత్‌రెడ్డికి సమీప బంధువు. షోదా కన్‌స్ట్రక్షన్ అధినేత కూడా. ఈ ముగ్గురు కలిసి ఆదీకోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని నడుపుతున్నారు. ఇదిగో డాక్యుమెంట్. ఇది కల్పితం కాదు. కఠోరమైన నిజాలివి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో గజా ఇన్‌ఫ్రా అనే కంపెనీకి కెనాల్ కాంట్రాక్టులు వస్తే అందులోంచి వెయ్యి కోట్ల రూపాల కాంట్రాక్ట్ సూదిని సృజన్‌రెడ్డి కన్‌స్ట్రక్షన్‌కు వచ్చేవిధంగా చేసింది కవితగారే. ఇప్పుడు చెప్పండి.. మీ పాంచజన్యం రేవంత్ సౌజన్యంతో నడవట్లేదని ప్రజలు నమ్మాలే? బీఆర్ఎస్ అధికారం నుంచి పోగానే మీకు ఇంకా ఆలోచనలు ఎక్కువైనయ్.
మీరు జియాలాజిస్ట్ కాదు
ఇక సిద్దిపేటలో కవితగారు అంటరు.. మల్లన్న సాగర్ ప్రాజెక్టును భూ కంపం వచ్చే ప్రాంతంలో కట్టిర్రు అంటున్నరు. అమ్మా కవితగారు.. మీరు చదివింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. మీరు జియాలాజిస్ట్ కాదు. మా పూర్వీకులకు తెల్వని భూకంపం మీకెట్ల తెలిసిందో. మల్లన్నసాగర్ ఏమన్నా రేవంత్ బ్రదర్స్ ఫోర్త్ సిటీలో ప్లాట్ ఆ? భూమిని ట్రీట్ చేసి ఎట్ల కడుతరు? సెంట్రల్ వాటర్ కమిషన్, జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వస్తేనే 50 టీఎంసీలున్న రిజర్వాయర్ కట్టారు. ఇది కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన డైరెక్షన్ మాత్రమే ఇచ్చారు. హరీశ్ర రావు ఇంజనీర్లను సూపర్‌వైజ్ చేశారు.
అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ప్రకారం నేరం కాదా?
విజిలెన్స్ రిపోర్ట్ చూపిస్తూ ఇంజినీర్ ఇన్ చీఫ్ రిటైర్డ్ మురళీధర్‌రావు, హరిరామ్, వేణు.. ఈ ముగ్గురి మీద యాక్షన్ తీసుకొమ్మని అన్నరు. నేను పోలీస్ ఆఫీసర్‌గా 26 సంవత్సరాలు పని చేసిన. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎప్పుడు కూడా రిపోర్ట్‌లు పబ్లిష్ చేయదు. వాళ్లు కేవలం ముఖ్యమంత్రికే పంపిస్తరు. ఆ రిపోర్టులు మీ చేతిలోకి ఎట్ల వచ్చినయ్? రేవంత్‌రెడ్డి ఇస్తేనే కదా. ఇది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ప్రకారం నేరం కాదా కవిత గారు? రేపు 19న సిద్దిపేటకు పోయి రేవంత్ కూడా అదే మాట్లాడుతడు.. మీ ఇంట్ల మనిషే చెప్పింది కదా అని. ప్రజలారా.. ఇది రాసి పెట్టుకోండి. రేవంత్ స్పీచ్‌లో బరాబర్ ఇదే ఉంటది.
ఫోన్ ట్యాపింగ్ లో చాలా ఆశ్చర్యకర విషయాలు వస్తాయని సీఎం అంటున్నారు. ఎలా తెలుసు, ఆయన సిట్ అధిపతా? ఎవరి పేర్లు పెట్టాలో, ఎలా చేయాలో సీఎం చెబుతున్నారా?
కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోకి కెనాల్ పోయిందని అంటుంది. కవిత గారికి కామన్‌సెన్స్ లేకపోవడం అనేది నిజంగా నవ్వొస్తుంది. కొండపోచమ్మ కెపాసిటీ 15 టీఎంసీలు. ఆయకట్టు కనీసం ఒక లక్షా ఇరవై వేలు. కేసీఆర్‌కు ఉన్న భూమి అక్కడ 150 ఎకరాలు. ప్రాజెక్ట్ నుంచి సూర్యాపేట, బస్వాపూర్ వంటి ప్రాంతాలకు నీళ్లు పోవాలి కదా. ఆయకట్టులోనే కేసీఆర్ భూమి ఉంది. అందులోకి నీళ్లొస్తే మీకు ఏం ప్రాబ్లమ్? రేవంత్ స్క్రిప్ట్ రాసిస్తే మీరు మాట్లాడుతున్నరు .
తెలంగాణ రేవంత్ సేనను డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి
హరీశ్ రావుపై, బీఆర్ఎస్ నేతలపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నిరాధార ఆరోపణలు చేస్తే మేం ఊరుకోబోం. ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమే. ఇంకా చాలా అంశాలను ఆధారాలతో సహా బయటపెడతాం. కవిత కూడా క్షమాపణలు చెప్పే రోజు వస్తుంది, సిద్ధంగా ఉండండి. అబద్ధాలతో ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరు. కవితను ముందు పెట్టి దోపిడీ ఎలా చేయాలో, బీఆర్ఎస్ గొంతు ఎలా నొక్కాలో రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కవిత రాజకీయాలకు పనికిరారు. రాజకీయ సన్యాసం తీసుకోవాలి. తెలంగాణ రేవంత్ సేనను డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి.
బీఆర్ఎస్ నేతలపై అనుచిత ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కోవాలన్నది పార్టీ నిర్ణయం. కవిత చాలా మంది బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. న్యాయపరంగా వెళ్లే అవకాశాలను పరిశీలిస్తాం.
కవిత చూపిచ్చిన రిపోర్ట్‌లో డేట్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదు
నిమ్స్‌లో 200 కోట్ల స్కామ్ చేసిండని కవిత మాట్లాడారు. నిమ్స్‌లో 232 మంది ఉద్యోగులు 1989లో అటానమస్ బాడి అయినప్పటి నుంచి పని చేస్తున్నరు. ఈపీఎఫ్, జీపీఎఫ్ ఆ అనేది ప్రభుత్వం వాళ్లకు ఆప్షన్ ఇచ్చింది. అందులో 232 మంది ఉద్యోగులు ఈపీఎఫ్ కావాలని అడిగిండ్రు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మారొచ్చు. నిన్న కవిత చూపిచ్చిన రిపోర్ట్‌లో డేట్ లేదు. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేదు. ఆఫీస్ బేరర్, మెంటర్ పేర్లూ లేవు. నకిలీ ఉత్తరం ఇది.
హరీశ్ రావును బద్నాం చేయడమే మీ ఉద్దేశం
నేను ఆరోగ్యం బాలేకపోతే నిమ్స్‌కే పోతా.. అక్కడ నాకు చాలా మంది దోస్తులున్నరు. పెన్షనర్స్ అసోసియేషన్ ఉందా అని అడిగితే లేదని చెప్పారు. సంతకం పెట్టినోళ్లెవరో తెల్వదు. జీపీఎఫ్ వాళ్ల డబ్బులు ఈపీఎఫ్ వాళ్లకు ఇస్తున్నరని జీపీఎఫ్ వాళ్లు పోయి కవితను కలిశారంట. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇంకొక ప్రభుత్వ ఉద్యోగికి నష్టం జరగాలని అసోసియేషన్‌లు పెట్టరు. కవిత ఒక ఫేక్ అసోసియేషన్‌ను క్రియేట్ చేశారు. నిజంగా వీళ్లు ఉంటే తీసుకురండి.. నేన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తా. వాళ్లతోనే మాట్లాడుదాం. మీ ఉద్దేశం అంతా ఏందంటే హరీశ్ రావును బద్నాం చేయాలే. ఈపీఎఫ్ ఎంప్లాయీస్ రిటైర్ అయినప్పుడు పెన్షన్ కావాలని కోరుకుంటున్నరు.. తప్పేముంది? కవిత ఎవరి పక్షమో చెప్పాలి. ఉద్యోగుల పక్షమా? రేవంత్‌రెడ్డి పక్షమా?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది
- ●Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ
- ●Ntr | ఊహించని కాంబో సెట్ - అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
- ●FPI Investments | విదేశీ పెట్టుబడిదారుల యూ టర్న్.. ఈ నెలలో రూ.84వేల కోట్లు రాక.. కారణాలేమిటి..?
- ●Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో 'సినిమాటికా ఎక్స్పో 2026'.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
- ●ISRO Apprentice | సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో 400 అప్రెంటిస్‌లు

Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది

Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ

Ntr | ఊహించని కాంబో సెట్ - అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ

FPI Investments | విదేశీ పెట్టుబడిదారుల యూ టర్న్.. ఈ నెలలో రూ.84వేల కోట్లు రాక.. కారణాలేమిటి..?




