త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inactive NGOs | విదేశీ నిధులు ఏమయ్యాయి? ఆ ఎన్టీవోలకు కేంద్రం షాక్!

2021 నుంచి వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనని సంస్థలపై కేంద్రం ఎక్కుపెట్టింది. ఎందుకు వరుసగా మూడేళ్లపాటు సంస్థలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

J

Business | Published On Dec 27, 2025, 5.16 pm IST

Inactive NGOs | విదేశీ నిధులు ఏమయ్యాయి? ఆ ఎన్టీవోలకు కేంద్రం షాక్!

సంక్షిప్త సారాంశం

విదేశాల నుంచి కోట్ల నిధులు ఎన్జీవోలకు విడుదల అవుతుంటాయి. ఎన్జీవోల ద్వారా చాలామంది సేవా కార్యక్రమాలను నిర్వహించాలని అనుకుంటారు. అయితే.. గత మూడేళ్ల నుంచి కోట్ల కొద్ది విదేశీ నిధుల రూపంలో డబ్బు ఎన్జీవోలకు వస్తున్నా... కొన్ని ఎన్జీవోలు వాటిని వినియోగించడం లేదు? దానికి కారణాలు ఏంటి? ఎందుకు ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి? కొన్ని ఎన్జీవోలు ఎందుకు ఇన్‌యాక్టివ్ అవుతున్నాయి?

Advertisement

Inactive NGOs | ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు వాటినే ఎన్జీవోలు అని అంటాం. ఈ పేరుతో చాలా సంస్థలు సామాజిక కార్యక్రమాలను చేపడతాయి. అయితే... కొన్ని ఎన్జీవోలు కొన్ని రోజుల పాటు యాక్టివ్‌గా ఉండి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ తర్వాత ఇన్‌యాక్టివ్ అవుతున్నాయి. అందుకే యాక్టివ్‌గా లేని ఎన్జీవోలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. వాటికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాకిచ్చింది.

గత మూడేళ్ల నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా, విదేశాల నుంచి వచ్చిన నిధులు వినియోగించకుండా ఉన్న ఇన్‌యాక్టివ్ ఎన్టీవోలకు షోకాజ్ నోటీసులను తాజాగా జారీ చేసింది. దీని కోసం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(FCRA) ను కేంద్రం వాటిపై ప్రయోగించింది. ఆ యాక్ట్ 2010లో ఉన్న నిబంధనల ప్రకారం ఆయా సంస్థలకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది.

Inactive NGOs | 21 రోజుల్లోపు ఆధారాలతో వివరణ ఇవ్వాలి

2021 నుంచి వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనని సంస్థలపై కేంద్రం ఎక్కుపెట్టింది. ఎందుకు వరుసగా మూడేళ్లపాటు సంస్థలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇటువంటి సంస్థల రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ హోం శాఖ హెచ్చరించింది.

ఎఫ్‌సీఆర్ఏ లోని సెక్షన్ 14(1)ఈ ప్రకారం ఏ ఎన్జీవో అయితే వరుసగా రెండు సంవత్సరాల పాటు సమాజం కోసం, సేవా కార్యక్రమాల కోసం నిధులను వినియోగించకుండా ఉంటుందో, పూర్తిగా వినియోగించడం ఆపేస్తుందో.. ఆసంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఉంటుంది. అందుకే షోకాజ్ నోటీసులు అందుకున్న ఎన్జీవోలు 21 రోజుల్లోగా తగిన ఆధారాలతో వివరణ ఇవ్వాలి. నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆ సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని నోటీసుల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఎఫ్‌సీఆర్ఏ గుర్తింపును రద్దు చేసినా, సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేసినా ఆ సంస్థలకు విదేశీ నిధులు రావు.

నిధులు వాడుకోకపోతే దుర్వినియోగం అయినట్లు కాదు

వరుసగా మూడేళ్ల పాటు నిధులను వాడకపోతే ఆ నిధులు దుర్వినియోగం అయినట్లు కాదు కదా అని కొందరు నిపుణులు ఈ నోటీసులపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ నిధులు బ్యాంకుల్లో ఉన్నా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలో జాప్యం, ఇతర టెక్నికల్ రీజన్స్ వల్ల నిధుల వినియోగం జరగడం లేట్ అయ్యే చాన్స్ ఉంటుదని.. దీనిపై ప్రభుత్వం ఒకసారి పునరాలోచించడం బెటర్ అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

విదేశీ నిధులు రిలీజ్ అయినా, వాటిని వినియోగించకుండా నిరుపయోగంగా ఉండటం వల్ల వాటి పర్యవేక్షణకు ఆటంకం కలగడం, వాటి వినియోగంపై పారదర్శకత ఉండదని, తద్వారా చాలా సమస్యలు వస్తాయని 2020లోనే సవరించిన నిబంధనల ప్రకారం కేంద్రం ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement