త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MeitY | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వాలు కొనాలంటే కొత్త నిబంధ‌న‌లు.. భార‌త్‌లో త‌యార‌వ్వాల్సిందే..

MeitY | ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, సర్వర్లు సహా ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీలో దేశీయ విలువ జోడింపును పెంచేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త నిబంధనలను ప్రకటించింది. ప్రభుత్వ ఆర్డర్లు పొందాలంటే మదర్‌బోర్డ్ అసెంబ్లీ, తుది పరీక్షలు భారత్‌లోనే నిర్వహించాలి. దేశీయ పరిశోధన, భారతీయ డిజైన్, మేధో సంపత్తి హక్కులకు కూడా ప్రాధాన్యం కల్పించింది. ఈ నిబంధనలు 2027 మే నుంచి అమల్లోకి రానున్నాయి.

S

Business | Published On Nov 24, 2026, 4.38 pm IST

MeitY | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వాలు కొనాలంటే కొత్త నిబంధ‌న‌లు.. భార‌త్‌లో త‌యార‌వ్వాల్సిందే..
Advertisement

MeitY | ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, సర్వర్లు సహా ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీలో దేశీయ విలువ జోడింపును పెంచేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త నిబంధనలను ప్రకటించింది. ప్రభుత్వ ఆర్డర్లు పొందాలంటే మదర్‌బోర్డ్ అసెంబ్లీ, తుది పరీక్షలు భారత్‌లోనే నిర్వహించాలి. దేశీయ పరిశోధన, భారతీయ డిజైన్, మేధో సంపత్తి హక్కులకు కూడా ప్రాధాన్యం కల్పించింది. ఈ నిబంధనలు 2027 మే నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆరు ర‌కాల ఉత్ప‌త్తుల‌కు రూల్స్‌..

ప్రభుత్వ కొనుగోళ్లలో పాల్గొనే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, సర్వర్లు, ఇతర ఐటీ హార్డ్‌వేర్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్థానిక ఉత్పత్తి విలువను లెక్కించే విధానాన్ని సవరించింది. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రిఫరెన్స్ టు మేక్ ఇన్ ఇండియా) ఆర్డర్-2017 కింద దేశీయ విలువ జోడింపు (DVA) లెక్కింపు విధానంలో ఈ మార్పులు చేసింది. ఈ ఆరు రకాల ఉత్పత్తులకు సంబంధించి 2020 సెప్టెంబర్ 7న జారీ చేసిన పాత నోటిఫికేషన్‌లోని నిబంధనల స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. డెస్క్‌టాప్, ఆల్ ఇన్ వన్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, థిన్ క్లయింట్లు, సర్వర్లు, కంప్యూటర్ మానిటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.

భార‌త్‌లోనే త‌యారీ ఉండాలి..

కొత్త విధానం ప్రకారం ప్రతి ఉత్పత్తి బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BoM) ఆధారంగా దేశీయ విలువ జోడింపును లెక్కిస్తారు. భారత్‌లో నిర్వహించే తయారీ ప్రక్రియలకు ప్రత్యేకంగా వెయిటేజీ కేటాయించారు. తుది అసెంబ్లీ, టెస్టింగ్, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (SMT) ద్వారా మదర్‌బోర్డుల తయారీ, డిస్‌ప్లేల అసెంబ్లీకి ప్రాధాన్యం ఉంటుంది. ర్యామ్, ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్‌తోపాటు భారతీయ సరఫరాదారుల నుంచి బేర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCB), ఛాసిస్, పవర్ మాడ్యూళ్ల కొనుగోలుకు కూడా వెయిటేజీ లభిస్తుంది. ఉత్పత్తి మొత్తం బిల్ ఆఫ్ మెటీరియల్స్‌లో మదర్‌బోర్డ్ అసెంబ్లీకి 15 నుంచి 25 శాతం, బేర్ పీసీబీ తయారీకి 10 శాతం, ర్యామ్, స్టోరేజ్ అసెంబ్లీకి గరిష్ఠంగా 10 శాతం వెయిటేజీ నిర్ణయించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో అర్హత పొందాలంటే మదర్‌బోర్డ్ అసెంబ్లీతో పాటు తుది పరీక్షలు కూడా భారత్‌లోనే నిర్వహించడం తప్పనిసరి.

దేశీయంగా త‌యార‌య్యే ఉత్ప‌త్తుల‌కు వెయిటేజీ..

దేశీయ పరిశోధన, అభివృద్ధి (R&D), భారతీయ డిజైన్, మేధో సంపత్తి హక్కులకు (IPR) కూడా కొత్త నిబంధనల్లో ప్రాధాన్యం ఇచ్చారు. దేశీయంగా నిర్వహించే ఇన్‌హౌస్ పరిశోధన, అభివృద్ధికి ఉత్పత్తి బిల్ ఆఫ్ మెటీరియల్స్‌లో 8 శాతం వెయిటేజీ కేటాయించగా, భారతీయ డిజైన్, మేధో సంపత్తి హక్కులకు 8 నుంచి 10 శాతం వరకు ప్రాధాన్యం కల్పించారు. తద్వారా ఐటీ హార్డ్‌వేర్ రంగంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, భారతీయ సంస్థల మేధో సంపత్తి యాజమాన్యాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే దేశీయ విలువ జోడింపును లెక్కించి ప్రకటించేందుకు తయారీ సంస్థలన్నీ ఒకే విధమైన స్వీయ ధ్రువీకరణ నమూనాను అనుసరించాల్సి ఉంటుంది. దీనివల్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మారడంతో పాటు కంపెనీలు ప్రకటించిన వివరాలను అవసరమైనప్పుడు తనిఖీ చేసేందుకు వీలవుతుంది. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైన ఆరు నెలల తర్వాత ఈ మార్పులు అమల్లోకి వస్తాయని, సవరించిన నిబంధనలు 2027 మే నుంచి వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement