త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Home Loan | హోమ్ లోన్ భారం కాదు.. ఈ 5 లాభాలు చాలా మందికి తెలియ‌వు..

Home Loan | సొంత ఇల్లును క‌లిగి ఉండ‌డం అనేది క‌ల‌. ముఖ్యంగా న‌గ‌రాల్లో నివాసం ఉండే వారికి అయితే అది తీర‌ని కోరిక‌గానే మిగులుతుంది. కానీ ఎంత భారీ ఎత్తున ధ‌ర క‌లిగిన ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ అయినా స‌రే హోమ్ లోన్ తీసుకుంటే సుల‌భ‌త‌రం అవుతుంది. నెల నెలా సుల‌భ‌మైన వాయిదా ప‌ద్ధ‌తుల్లో డ‌బ్బు చెల్లిస్తూ సొంత ఇంటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చు.

S

Business | Published On Feb 3, 2026, 11.18 am IST

Home Loan | హోమ్ లోన్ భారం కాదు.. ఈ 5 లాభాలు చాలా మందికి తెలియ‌వు..
Advertisement

Home Loan | సొంత ఇల్లును క‌లిగి ఉండ‌డం అనేది క‌ల‌. ముఖ్యంగా న‌గ‌రాల్లో నివాసం ఉండే వారికి అయితే అది తీర‌ని కోరిక‌గానే మిగులుతుంది. కానీ ఎంత భారీ ఎత్తున ధ‌ర క‌లిగిన ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ అయినా స‌రే హోమ్ లోన్ తీసుకుంటే సుల‌భ‌త‌రం అవుతుంది. నెల నెలా సుల‌భ‌మైన వాయిదా ప‌ద్ధ‌తుల్లో డ‌బ్బు చెల్లిస్తూ సొంత ఇంటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చు. పైగా అద్దె ఇళ్ల‌లో ఉండ‌డం క‌న్నా అదే అద్దెకు కాస్త ఎక్కువ మొత్తాన్ని జోడించి ఇంటి లోన్‌కు ఈఎంఐ క‌ట్టుకుంటే బాగుంటుంది క‌దా, అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుక‌నే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా హోమ్ లోన్ల‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఇక స్థోమత లేదా ఆదాయాన్ని బ‌ట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు కూడా వినియోగ‌దారుల‌కు ఇంటి రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి. అయితే ఇంటి రుణాలు తీసుకోవ‌డం అంటే కొంద‌రు భారంగా భావిస్తారు. కానీ అందులో చాలా లాభాలు ఉంటాయ‌న్న సంగతి అధిక శాతం మందికి తెలియ‌దు.

ప‌న్ను మిన‌హాయింపు..

హోమ్ లోన్ తీసుకుంటే లభించే ప్రధాన లాభం ఆదాయపు పన్నులో ఉంటుంది. ఇంటి రుణంతో ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో లక్షల‌ రూపాయలు పన్ను రూపంలో ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 (బి) కింద వడ్డీ చెల్లింపుపై సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అలాగే, అసలు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడంపై సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ సహ-దరఖాస్తుదారుడితో కలిసి హోమ్ లోన్ తీసుకుంటే, ఇద్దరూ విడివిడిగా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా మొత్తం మీద దాదాపు రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా చేసే అవకాశం ఉంటుంది.

వివాద‌ర‌హితం అన్న భ‌రోసా..

హోమ్ లోన్ మంజూరు చేసే ముందు బ్యాంకులు ఆస్తికి సంబంధించిన హక్కులు, రికార్డులు పూర్తిగా పరిశీలిస్తాయి. ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే రుణాన్ని మంజూరు చేస్తాయి. చట్టపరమైన ధ్రువీకరణ ద్వారా అన్ని పత్రాలను తనిఖీ చేయడం వల్ల, కొనుగోలుదారుడికి తాను కొనుగోలు చేస్తున్న ఇల్లు లేదా ఫ్లాట్‌ వివాదరహితం అన్న భరోసా లభిస్తుంది. ఇది హోమ్ లోన్ తీసుకునే వారికి లభించే మరో పెద్ద ప్రయోజనం. ఇక హోమ్ లోన్ వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాలు లేదా ఇతర రుణాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతో హోమ్ లోన్లు మరింత చ‌వ‌కగా మారాయి. భవిష్యత్తులో ఇంకా తక్కువయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి కోసం మీ మొత్తం పొదుపును ఖర్చు చేయడం కంటే, తక్కువ వడ్డీతో హోమ్ లోన్ తీసుకోవడం మేలైన నిర్ణయం. దీనివల్ల ఇల్లు కూడా మీ సొంతమవుతుంది, పొదుపు కూడా నిల్వ ఉంటుంది. ఆ పొదుపును రిటైర్మెంట్ అవసరాలకు లేదా లాభదాయక పెట్టుబడులకు మ‌ళ్లించ‌వ‌చ్చు.

టాప్‌-అప్ లోన్‌, మ‌హిళ‌ల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటు..

హోమ్ లోన్‌పై టాప్-అప్ లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఇది ఒకరకంగా వ్యక్తిగత రుణంలా ఉండి, తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తుంది. టాప్-అప్ లోన్ తిరిగి చెల్లింపు కాలపరిమితి మీ హోమ్ లోన్ కాలపరిమితికి అనుగుణంగా ఉంటుంది. అంటే 10, 15 లేదా 20 సంవత్సరాల్లో సౌకర్యంగా చెల్లించవచ్చు. అదనపు హిడెన్ చార్జిలు ఉండవు. ఇలా తీసుకునే టాప్‌-అప్ లోన్‌ను వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు లేదా మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ, పిల్ల‌ల అవ‌స‌రాల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. చెల్లింపు విధానం కూడా సుల‌భ‌త‌రంగానే ఉంటుంది. ఇక హోమ్ లోన్‌ను సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. సహ-దరఖాస్తుదారుగా మహిళ ఉంటే, కొన్ని బ్యాంకులు వడ్డీ రేటులో స్వల్ప తగ్గింపు కూడా ఇస్తాయి. సాధారణంగా మహిళ సహ-దరఖాస్తుదారుగా ఉంటే 0.05 శాతం వరకు తక్కువ వడ్డీకి రుణం లభించే అవకాశం ఉంటుంది. హోమ్ లోన్‌ను దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరం లేదు. ముందస్తు చెల్లింపు లేదా పూర్తిగా క్లోజ్ చేయ‌డానికి సౌలభ్యం ఉంటుంది. ముందస్తుగా రుణం చెల్లించడం వల్ల వినియోగ‌దారుడి ఆర్థిక స్థితి బలంగా ఉందన్న సంకేతం బ్యాంకులకు వెళ్తుంది, దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం పడుతుంది.

ఈ విధంగా చూస్తే.. హోమ్ లోన్ అనేది కేవలం అప్పు కాదు.. సరైన ప్రణాళికతో తీసుకుంటే అది ఒక తెలివైన ఆర్థిక నిర్ణయంగా మారుతుంది. అందుకే సంపన్నులు కూడా హోమ్ లోన్‌ను ఎంచుకుంటుంటారు. అధిక శాతం మంది గృహ రుణాల‌ను తీసుకుని ఇళ్ల‌ను లేదా అపార్ట్‌మెంట్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. డ‌బ్బులు ఆదా చేయ‌డంతోపాటు బ‌హుళ ప్ర‌యోజ‌నాల‌ను అందించేందుకు హోమ్ లోన్‌ ఎంతగానో స‌హాయం చేస్తుంది.

Advertisement
Advertisement