త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lohia Corp IPO | లోహియా కార్ప్ ఐపీఓ ఓపెన్.. పెట్టుబడిదారులకు చ‌క్క‌ని అవ‌కాశం..

Lohia Corp IPO | టెక్నికల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమకు యంత్రాలు, పరికరాలను తయారు చేసే లోహియా కార్ప్ తన ప్రారంభ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,101.28 కోట్లను సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉండగా, 2.59 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి.

S

Business | Published On Jul 23, 2026, 12.19 pm IST

Lohia Corp IPO | లోహియా కార్ప్ ఐపీఓ ఓపెన్.. పెట్టుబడిదారులకు చ‌క్క‌ని అవ‌కాశం..
Advertisement

Lohia Corp IPO | టెక్నికల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమకు యంత్రాలు, పరికరాలను తయారు చేసే లోహియా కార్ప్ తన ప్రారంభ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,101.28 కోట్లను సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉండగా, 2.59 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. 2023లో స్థాపించిన లోహియా కార్ప్ సంస్థ‌ టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగానికి అవసరమైన యంత్రాలను తయారు చేస్తోంది. ముఖ్యంగా పీపీ (పాలీప్రొపిలిన్), హెచ్‌డీపీఈ (హై డెన్సిటీ పాలీథిలిన్) వోవెన్ ఫ్యాబ్రిక్స్, సాక్స్ తయారీలో ఉపయోగించే యంత్రాల తయారీలో ఈ సంస్థ ప్రత్యేకతల‌ను కలిగి ఉంది. కంపెనీ ఉత్పత్తులు సిమెంట్, ఎరువుల సంచులు, ఎఫ్‌ఐబీసీలు, జియోటెక్స్‌టైల్స్, టార్పాలిన్లు, తాళ్లు, ట్వైన్స్ వంటి ప్యాకేజింగ్, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 240 టేప్ ఎక్స్‌ట్రూజన్ లైన్లు, 13,800 సర్క్యులర్ లూమ్స్, 1,08,000 విండర్స్ గా ఉంది.

లాట్ సైజు, ధ‌ర ఎంతంటే..

ఐపీఓలో కనీసం 35 షేర్లతో ఒక లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే నిష్పత్తిలో మరిన్ని లాట్లకు బిడ్ చేయవచ్చు. గరిష్ఠ ధర ప్రకారం ఒక లాట్‌కు రిటైల్ పెట్టుబడిదారు కనీసం రూ.14,875 పెట్టుబడి పెట్టాలి. రిటైల్ విభాగంలో గరిష్ఠంగా 13 లాట్ల‌ (455 షేర్లు) వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, అందుకు రూ.1,93,375 పెట్టుబడి అవసరం. చిన్న హెచ్‌ఎన్‌ఐలు 14 లాట్ల (490 షేర్లు) కోసం కనీసం రూ.2,08,250, పెద్ద హెచ్‌ఎన్‌ఐలు 68 లాట్ల‌ (2,380 షేర్లు) కోసం కనీసం రూ.10,11,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఐపీఓకు సంబంధించిన షేర్ల కేటాయింపు ప్రక్రియ జూలై 28న ఖరారు కానుంది. కంపెనీ షేర్లు జూలై 30న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ కానున్నాయి. గ్రే మార్కెట్‌లో లోహియా కార్ప్ ఐపీఓకు ప్రస్తుతం రూ.36 గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) నమోదైంది. ధరల ఎగువ శ్రేణిని పరిగణనలోకి తీసుకుంటే, లిస్టింగ్ రోజున సుమారు 8.47 శాతం లాభం వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పెరిగిన ఆస్తులు, త‌గ్గిన రుణాలు..

ఈ ఐపీఓకు ఈక్విరస్ క్యాపిటల్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది. ఆర్థిక ఫలితాల పరంగా కూడా లోహియా కార్ప్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం 25.3 శాతం పెరిగి రూ.1,737.87 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.1,386.47 కోట్లుగా ఉంది. పన్ను అనంతర లాభం (పీఏటీ) 64.2 శాతం పెరిగి రూ.193.45 కోట్లకు చేరగా, ఈబిట్డా 48.5 శాతం వృద్ధితో రూ.339.45 కోట్లకు పెరిగింది. మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రూ.1,304.66 కోట్లు ఉండగా, రిజర్వులు, మిగులు రూ.519.16 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో మొత్తం రుణాలు తగ్గి రూ.152.78 కోట్లకు చేరడం కంపెనీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసింది.

Advertisement
Advertisement