త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIC Smart Pension Plan | రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.23వేల పెన్షన్.. ఎల్‌ఐసీలో అద్భుత‌మైన ప‌థ‌కం..

LIC Smart Pension Plan | దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల కోసం పలు బీమా పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఎల్‌ఐసీ పెన్షన్ పథకాలు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.

S

Business | Published On Jul 23, 2026, 1.07 pm IST

LIC Smart Pension Plan | రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.23వేల పెన్షన్.. ఎల్‌ఐసీలో అద్భుత‌మైన ప‌థ‌కం..
Advertisement

LIC Smart Pension Plan | దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల కోసం పలు బీమా పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఎల్‌ఐసీ పెన్షన్ పథకాలు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఒకటి. ఈ పథకం జీవితాంతం హామీతో కూడిన పెన్షన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ను ఎల్‌ఐసీ గ‌తేడాది ప్రారంభించింది. ఇది ఒక ఇమ్మిడియట్ యాన్యుటీ ప్లాన్. అంటే ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించిన వెంటనే పాలసీదారుడు పెన్షన్ పొందడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జీవితాంతం నిర్ణయించిన విధంగా పెన్షన్ చెల్లింపులు కొనసాగుతాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారి కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్ కావడంతో మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. పాలసీ తీసుకున్న సమయంలో నిర్ణయించిన పెన్షన్ రేటు జీవితాంతం అదే విధంగా కొనసాగుతుంది.

గ‌రిష్ట ప‌రిమితి లేదు..

ఈ పథకంలో భర్త-భార్య కలిసి జాయింట్ ప్లాన్‌గా లేదా వ్యక్తిగతంగా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన పొందేందుకు ఎంపిక ఉంటుంది. ప్రతి ఏడాది పెన్షన్‌ను 3 శాతం లేదా 6 శాతం చొప్పున పెంచుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నుంచి పదవీ విరమణ పొందిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు. అలాగే పాలసీదారుడు మరణించిన తర్వాత పెట్టుబడి మొత్తాన్ని నామినీకి తిరిగి అందించే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో కనీస యాన్యుటీ కొనుగోలు పరిమితిని రూ.1 లక్షగా నిర్ణయించారు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.

నెల‌కు రూ.20వేలు కావాలంటే..

నెలకు సుమారు రూ.20వేల నుంచి రూ.24వేల వరకు పెన్షన్ పొందాలనుకునే వారు ఈ పథకంలో సుమారు రూ.35 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు సంవత్సరానికి సుమారు రూ.2.87 లక్షల పెన్షన్, నెలకు సుమారు రూ.23,940 వరకు హామీతో కూడిన పెన్షన్ లభిస్తుందని ఎల్‌ఐసీ లెక్కలు తెలియ‌జేస్తున్నాయి. అయితే ఎందులో అయినా పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం ఉత్త‌మం.

Advertisement
Advertisement