త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ivory Coast vs Curacao | ఐవరీ కోస్ట్‌ హిస్టరీ

Ivory Coast vs Curacao | ఫిఫా ప్రపంచకప్‌లో ఐవరీ కోస్ట్‌ చరిత్ర సృష్టించింది. గ్రూప్-ఈలో గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కురకావోపై 2-0తో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌లోకి ప్రవేశించింది.

P

Sports | Published On Jun 26, 2026, 2.54 pm IST

Ivory Coast vs Curacao | ఐవరీ కోస్ట్‌ హిస్టరీ
Advertisement
  • తొలిసారిగా నాకౌట్‌లోకి ఎంట్రీ
  • టెక్సాస్‌ సిటీకి టికెట్‌ ఖాయం చేసిన పెపే
  • నికోలస్‌ పెపే డబుల్‌ ధమాకా..
  • కురకావోపై 2-0 తేడాతో విజయం

Ivory Coast vs Curacao | ఫిఫా ప్రపంచకప్‌లో ఐవరీ కోస్ట్‌ చరిత్ర సృష్టించింది. గ్రూప్-ఈలో గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కురకావోపై 2-0తో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌లోకి ప్రవేశించింది. స్టార్ వింగర్ నికోలస్ పెపే రెండు గోల్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 2006, 2010, 2014 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశను దాటలేకపోయిన ఐవరీ కోస్ట్‌ ఈసారి మాత్రం రౌండ్‌ ఆఫ్‌ 32లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్-ఈలో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు రౌండ్ ఆఫ్ 32లో టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లో గ్రూప్-ఐ రన్నరప్‌తో తలపడనుంది.

నికోలస్‌ పెపే మెరుపులు..

మ్యాచ్ ప్రారంభం నుంచే కురకావో బంతిపై ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేసినా.. ఏడో నిమిషంలో చేసిన పొరపాటు కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ప్రత్యర్థి డిఫెండర్ల తప్పిదాన్ని 19 ఏళ్ల యాన్ డియోమాండే అందిపుచ్చుకుని బంతిని గోల్ ముందు ఉన్న నికోలస్ పెపేకు అందించాడు. వచ్చిన అవకాశాన్ని పెపే ఎక్కడా చిన్న తప్పు చేయకుండా బంతిని గోల్‌గా మలిచి ఐవరీ కోస్ట్‌కు ఆధిక్యం అందించాడు. తొలి గోల్ అనంతరం ఐవరీ కోస్ట్‌ ఆటపై పట్టు సాధించినప్పటికీ కురకావో సత్తా చాటేందుకు ప్రయత్నించింది. టోర్నీలో జర్మనీ చేతిలో 7-1తో ఘోర పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు ఆ ప్రభావాన్ని అధిగమించి ధైర్యంగా పోరాడింది. తొలి అర్ధభాగం ముగిసే ముందు లియాండ్రో బకూనా చేసిన ప్రయత్నం కాస్త తేడాతో గోల్‌ను చేజార్చుకోగా.. ద్వితీయార్థం ప్రారంభంలోనూ షెరెల్ ఫ్లోరానస్ కొట్టిన షాట్ క్రాస్‌బార్‌పైగా వెళ్లింది.

రెండో గోల్‌తో..

టోర్నీలో ఐవరీ కోస్ట్ తరఫున తొలి గోల్ చేసిన అమాద్ డియాలో ద్వితీయార్థంలో గాయంతో బరిలోకి దిగలేదు. దాంతో జట్టు కొంత వరకు ఆందోళనకు గురైంది. అయినప్పటికీ ఆటపై ఆధిపత్యాన్ని కొనసాగించిన ఐవరీ కోస్ట్‌ 64వ నిమిషంలో మరో గోల్ సాధించింది. ఇబ్రహీం సంగారే ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న పెపే.. కురకావో డిఫెన్స్‌ను దాటుకుని గోల్‌కీపర్ ఎలోయ్ రూమ్‌ను బురిడీ కొట్టిస్తూ బంతిని పోస్టులోకి పంపించాడు. ఈ గోల్‌తో తన ఖాతాలో రెండో గోల్ నమోదు చేసుకున్న పెపే జట్టు చారిత్రక విజయాన్ని ఖరారు చేశాడు. ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన పెపే.. ఇటీవల ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ప్రపంచకప్‌లో రెండు గోల్స్‌ చేసి హీరోగా నిలిచాడు. అలాగే ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు, అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన ఐదో ఐవరీ కోస్ట్ ఆటగాడిగా డిడియర్ డ్రోగ్బా, గెర్విన్యో, అరుణా డిండానే, విల్‌ఫ్రెడ్ బోనీ సరసన చోటు సంపాదించాడు.

ఒడినా ఆకట్టుకున్న కురకావో..

ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ కురకావో అదర్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నది. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా చరిత్ర సృష్టించిన ఆ జట్టు.. తొలి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో భారీ ఓటమి అనంతరం ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకొని నాకౌట్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. యూరప్‌లోని చిన్న లీగ్‌లలో ఆడే ఆటగాళ్లతో కూడిన కురకావో జట్టు అంచనాలకు మించి రాణించింది. ఐవరీ కోస్ట్‌కు దీటుగా పోరాడినా గోల్స్ మాత్రం సాధించలేకపోయింది. ఇక ఐవరీ కోస్ట్‌కు ఈ విజయం ఎన్నో ఏళ్ల నాకౌట్‌ కోరిక నెరవేరింది. వరుసగా మూడు సార్లు గ్రూప్ దశలోనే వెనుదిరిగిన ఆ జట్టు.. ఈసారి నాకౌట్‌కు చేరి కొత్త చరిత్ర రాసింది. కీలక సమయంలో పెపే మళ్లీ గోల్స్ చేయడం ఆ జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

Advertisement
Advertisement