త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio Black Rock | జియో ఈటీఎఫ్ వ‌చ్చేసింది.. రూ.500 ఉంటే చాలు..

Jio Black Rock | జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్‌ఎస్‌ఎల్), బ్లాక్‌రాక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్ జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తన తొలి ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ను ప్రవేశ‌పెట్టింది. ఈ ప్రారంభంతో భారత ఈటీఎఫ్ మార్కెట్‌లో కంపెనీ అధికారికంగా అడుగుపెట్టింది.

S

Business | Published On Aug 6, 2026, 11.53 am IST

Jio Black Rock | జియో ఈటీఎఫ్ వ‌చ్చేసింది.. రూ.500 ఉంటే చాలు..
Advertisement

Jio Black Rock | జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్‌ఎస్‌ఎల్), బ్లాక్‌రాక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్ జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తన తొలి ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ను ప్రవేశ‌పెట్టింది. ఈ ప్రారంభంతో భారత ఈటీఎఫ్ మార్కెట్‌లో కంపెనీ అధికారికంగా అడుగుపెట్టింది. పెట్టుబడులను మరింత సులభంగా, అందుబాటులో ఉండేలా, తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఆగస్టు 11న ముగియనుంది. ఈ ఈటీఎఫ్ నిఫ్టీ 50 ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. దీంతో పెట్టుబడిదారులు ఒకే పెట్టుబడి ద్వారా దేశంలోని 50 అతిపెద్ద, స్థిరపడిన లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం పొంద‌వ‌చ్చు. ఈ ఏడాది మార్చి 30 నాటికి భారత స్టాక్ మార్కెట్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో సుమారు 53.73 శాతం వాటాకు నిఫ్టీ 50 ఇండెక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్లకు ఇది ప్రధాన బెంచ్‌మార్క్‌గా కొనసాగుతూ, దేశ దీర్ఘకాలిక ఆర్థిక, కార్పొరేట్ వృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని పెట్టుబడిదారులకు అందిస్తోంది.

నిఫ్టీ50 ఇండెక్స్ బెంచ్ మార్క్‌గా..

ఈ స్కీమ్ కింద నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని కంపెనీల కూర్పును అనుసరించే ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో పాసివ్ పెట్టుబడుల‌ను పెడతారు. అయితే ట్రాకింగ్ ఎర్ర‌ర్లకు లోబడి ఉండే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. అలాగే ఈ పథకం పెట్టుబడి లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందనే హామీ లేదని స్పష్టం చేసింది. ఈ పథకానికి నిఫ్టీ 50 ఇండెక్స్ (టీఆర్‌ఐ) బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్‌ స్వామినాథన్ మాట్లాడుతూ భారత ప్రముఖ కంపెనీల దీర్ఘకాలిక వృద్ధిలో పెట్టుబడిదారులు సులభంగా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ను రూపొందించామని తెలిపారు. విభిన్నీకరణ, పారదర్శకత, సరళత వంటి ప్రయోజనాలను ఒకే పెట్టుబడి ద్వారా అందించే విస్తృత మార్కెట్ ఇండెక్స్ చాలా మంది పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోకు బలమైన పునాదిగా నిలుస్తుందని చెప్పారు.

ఎలా పెట్టుబ‌డి పెట్టాలి..

ప్రపంచంలోనే అతిపెద్ద ఈటీఎఫ్ ప్రొవైడర్ బ్లాక్‌రాక్ తన ఐషేర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 6 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఈటీఎఫ్, ఇండెక్స్ ఆస్తులను నిర్వహిస్తోంది. బ్లాక్‌రాక్‌కు ఉన్న పెట్టుబడి సాంకేతికత, పోర్ట్‌ఫోలియో నిర్వహణ నైపుణ్యాలను, జియోకు ఉన్న డిజిటల్ సామర్థ్యాలు, భారత వినియోగదారులపై ఉన్న అవగాహనతో కలిపి, ప్రపంచ స్థాయి ఈటీఎఫ్ పెట్టుబడి అనుభవాన్ని భారత పెట్టుబడిదారులకు అందించడమే లక్ష్యమని సంస్థ వెల్లడించింది. జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జియో బ్లాక్‌రాక్ ఏఎంసీ వెబ్‌సైట్, జియోఫైనాన్స్ యాప్, మైజియో యాప్‌లో అవకాశం అందుబాటులో ఉందని సంస్థ తెలిపింది.

రూ500 ఉంటే చాలు..

ఇక జియో, బ్లాక్ రాక్ లాంచ్ చేసిన ఈ ఈటీఎఫ్ పాసివ్ ఫండ్‌గా ప‌నిచేస్తుంది. ఇందులోని పెట్టుబ‌డిని ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత మార్కెట్ల‌లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. ఈ ఫండ్ ప‌నితీరును నిఫ్టీ 50 టోట‌ల్ రిట‌ర్న్స్ ఇండెక్స్‌లో పోల్చి చూస్తారు. ఈ కొత్త ఫండ్‌ను త‌న్వి క‌చేరియా, ఆనంద్ సాహా, హ‌రేష్ మెహ‌తాలు నిర్వ‌హించ‌నున్నార‌ని సంస్థ‌లు తెలిపాయి. ఎన్ఎఫ్‌వో ప్రస్తుతం అందుబాటులో ఉండ‌గా, ఇందులో క‌నీస పెట్టుబ‌డి రూ.500గా ఉంది. పెట్టుబ‌డిదారులు చాలా స్వ‌ల్ప మొత్తంతో ఈ ఫండ్‌లో చేర‌వ‌చ్చు. త‌రువాత కావ‌ల్సిన మొత్తాల‌ను పెట్టుబ‌డి పెడుతూ ముందుకు సాగ‌వచ్చు. ఈ స్కీమ్ 95-100 శాతం నిధుల‌ను ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 0 నుంచి 5 శాతం నిధుల‌ను డెట్‌, మ‌నీ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడుతుంది. పెట్టుబ‌డులు పెట్టేముందు ఇన్వెస్ట‌ర్లు ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం ఉత్త‌మం.

Advertisement
Advertisement