త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR Filing | ఐటీఆర్‌ను ఫైల్ చేశారా.. ఈ 5 అంశాల‌ను చెక్ చేయండి..

ITR Filing | జూలై 31 ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువు సమీపిస్తుండటంతో కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్‌ను వేగంగా ఫైల్ చేస్తున్నారు. అయితే గడువులోపు పూర్తి చేయాలనే తొందరలో చిన్నపాటి పొరపాట్లు చేయడం వల్ల భారీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Jul 30, 2026, 1.46 pm IST

ITR Filing | ఐటీఆర్‌ను ఫైల్ చేశారా.. ఈ 5 అంశాల‌ను చెక్ చేయండి..
Advertisement

ITR Filing | జూలై 31 ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు గడువు సమీపిస్తుండటంతో కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్‌ను వేగంగా ఫైల్ చేస్తున్నారు. అయితే గడువులోపు పూర్తి చేయాలనే తొందరలో చిన్నపాటి పొరపాట్లు చేయడం వల్ల భారీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తప్పు బ్యాంక్ వివరాలు నమోదు చేయడం, ఆదాయ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం వంటి కారణాలతో ట్యాక్స్ రీఫండ్ ఆలస్యం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువ‌ల్ల ఐటీఆర్ ను ఫైల్ చేసిన అనంత‌రం 5 ముఖ్య‌మైన అంశాల‌ను త‌ప్ప‌కుండా ప‌రిశీలించాల‌ని నిపుణులు చెబుతున్నారు.

ఐటీఆర్ వెరిఫికేష‌న్‌, ఫామ్‌లు..

మొదటగా.. మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌ను తప్పనిసరిగా వెరిఫై చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కేవలం ఐటీఆర్ ఫైల్ చేయడం మాత్రమే సరిపోదు. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా అందుబాటులో ఉన్న ఇతర ఆన్‌లైన్ విధానాల ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అవసరమైతే సంతకం చేసిన ఐటీఆర్-వి (ITR-V)ని ఆదాయపు పన్ను శాఖకు పంపాలి. ఐటీఆర్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే ఆ రిటర్న్‌ను దాఖలు చేయనట్లుగానే పరిగణిస్తారు. రెండో అంశంగా.. ఏఐఎస్ (AIS), టీఐఎస్ (TIS), ఫామ్‌ 26ఏఎస్ (Form 26AS)లను మరోసారి పరిశీలించాలి. ఐటీఆర్ దాఖలు చేసే ముందు వీటిని చూసినా, దాఖలు చేసిన తర్వాత మరోసారి చెక్ చేయడం మంచిది. బ్యాంకులు, యజమానులు, ఇతర సంస్థలు తర్వాత కూడా వడ్డీ ఆదాయం, జీతం వివరాలు లేదా టీడీఎస్ (TDS) వంటి సమాచారాన్ని అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వివరాలు మీ ఐటీఆర్‌లోని సమాచారంతో సరిపోలకపోతే సవరించిన రిటర్న్ (రివైజ్డ్ రిటర్న్) దాఖలు చేయాల్సి వ‌స్తుంది.

బ్యాంకు ఖాతా వివ‌రాలు, డిడ‌క్ష‌న్స్‌..

మూడో అంశంగా.. ట్యాక్స్ రీఫండ్ పొందేందుకు నమోదు చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) కోడ్ సరైనవిగా ఉండటంతోపాటు, ఆ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను పోర్టల్‌లో ప్రీ వాలిడేట్ అయి ఉండాలి. తప్పు వివరాలు ఉంటే రీఫండ్ ఆలస్యం అవుతుంది. నాలుగో అంశంగా.. మీరు పొందే అన్ని అర్హత కలిగిన తగ్గింపులు (డిడక్షన్స్), మినహాయింపులు (ఎగ్జెంప్షన్స్) సరిగ్గా క్లెయిమ్ చేశారో లేదో పరిశీలించాలి. అలాగే పన్ను లెక్కల్లో ఎలాంటి పొరపాట్లు లేవని నిర్ధారించుకోవాలి. లెక్కల్లో తప్పులు ఉంటే అదనపు పన్ను డిమాండ్ లేదా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఐదో అంశంగా.. మొత్తం ఐటీఆర్‌ను మరోసారి పూర్తిగా పరిశీలించాలి. జీతం, ఇతర ఆదాయాలు, బ్యాంక్ వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ, షేర్లు లేదా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మూలధన లాభాలు, అద్దె ఆదాయం, అర్హత కలిగిన అన్ని తగ్గింపులు, మినహాయింపులు, విదేశీ ఆస్తుల వివరాలు (అవసరమైతే) వంటి అంశాలను సరిగ్గా నమోదు చేశారో లేదో ధ్రువీకరించాలి.

ఆందోళ‌న అవ‌స‌రం లేదు..

ఐటీఆర్ దాఖలు చేసి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా ఏదైనా పొరపాటు గుర్తిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదాయంలో ఏదైనా మిస్ అయినా, తప్పుగా తగ్గింపులు క్లెయిమ్ చేసినా లేదా ఇతర లోపాలు ఉన్నా సవరించిన రిటర్న్ (రివైజ్డ్ రిటర్న్) దాఖలు చేయవచ్చు. ఇది మొదట దాఖలు చేసిన ఐటీఆర్‌ను భర్తీ చేస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ లేదా రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement