త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..

ICICI Lombard | ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌పై రూ.1 కోటి జరిమానా విధించింది. 2019లో నిర్వహించిన తనిఖీలో గుర్తించిన కొన్ని అవకతవకలకు సంబంధించి నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది.

S

Business | Published On Sep 8, 2026, 3.45 pm IST

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్‌కు రూ.1 కోటి జరిమానా.. అసలు కారణం ఇదే..
Advertisement

ICICI Lombard | ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌పై రూ.1 కోటి జరిమానా విధించింది. 2019లో నిర్వహించిన తనిఖీలో గుర్తించిన కొన్ని అవకతవకలకు సంబంధించి నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీలో ముఖ్యంగా బీమా సంస్థ నమోదు చేసిన సేల్స్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ సపోర్ట్ ఖర్చులను పరిశీలించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ లాంబార్డ్ సేల్స్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ సపోర్ట్ ఖర్చుల కింద రూ.709.57 కోట్లను నమోదు చేసింది. ఇందులో సుమారు రూ.35-37 కోట్లను ఇతర బీమా సంస్థలకు చెందిన వ్యక్తిగత ఏజెంట్లకు చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఏజెంట్లను ఈవెంట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాల కోసం ఉపయోగించిన అంశంపైనే ఐఆర్‌డీఏఐ ప్రధానంగా దృష్టి సారించింది.

త‌గిన విధంగా లేని న‌మోదు..

ఐఆర్‌డీఏఐ ప్రకారం.. ఇతర బీమా సంస్థలకు అనుబంధంగా ఉన్న ఏజెంట్ల ద్వారా కొన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవల‌ను నిర్వహించారు. అయితే ఈ కార్యకలాపాలను తగిన విధంగా గుర్తించి, అవుట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ గా నమోదు చేయలేదు. ఈ ఏర్పాట్లకు సంబంధించి సరైన ఆధార పత్రాలు కూడా అందుబాటులో లేవని నియంత్రణ సంస్థ పేర్కొంది. ఈ కార్యకలాపాలను అవుట్‌సోర్సింగ్ పరిధిలోకి తీసుకురావడం కీలకమైన అంశంగా మారింది. ఎందుకంటే అవుట్‌సోర్స్ చేసిన కార్యకలాపాలకు ప్రత్యేక నియంత్రణ పర్యవేక్షణ, రిపోర్టింగ్ నిబంధనలు ఉంటాయి. అయితే సంబంధిత ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలను ఆ విధంగా వర్గీకరించకపోవడంతో వాటిని నిర్దేశిత సమయంలో ఐఆర్‌డీఏఐకి సమర్పించాల్సిన అవుట్‌సోర్సింగ్ రిటర్న్స్ లో చేర్చలేదు. ఈ అంశాన్ని కేవలం ఖర్చులకు ఇచ్చిన అకౌంటింగ్ లేబుల్‌కు సంబంధించిన సమస్యగా కాకుండా, నియంత్రణ పర్యవేక్షణకు సంబంధించిన అంశంగా ఐఆర్‌డీఏఐ పరిగణించింది. అవుట్‌సోర్సింగ్‌కు సంబంధించిన పరిశీలనకు లోబడాల్సిన కార్యకలాపాలు ఆ మార్గంలో నియంత్రణ సంస్థకు నివేదించలేదని ఆదేశాల్లో పేర్కొంది.

ఐఆర్‌డీఏఐ అభ్యంత‌రాలు..

ఈ కేసులో విక్రేతలు, థర్డ్‌పార్టీ సేవల నిర్వహణ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. బీమా సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల్లో వివిధ రకాల బాహ్య సేవా సంస్థలు, వ్యక్తుల సేవలను వినియోగిస్తుంటాయి. అయితే అవుట్‌సోర్సింగ్ కారణంగా సంస్థ బాధ్యత, సరైన డాక్యుమెంటేషన్, పర్యవేక్షణ బలహీనపడకుండా ఉండేందుకు నియంత్రణ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ కేసులో కొన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లకు సంబంధించిన డాక్యుమెంటేషన్, వర్గీకరణ, నియంత్రణ సంస్థకు రిపోర్టింగ్ విధానాలపైనే ఐఆర్‌డీఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ చర్య కేవలం అకౌంటింగ్ వర్గీకరణ సమస్యకే పరిమితం కాకుండా, థర్డ్‌పార్టీ కార్యకలాపాలపై సంస్థలో ఉన్న గవర్నెన్స్ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించిన నియంత్రణ తనిఖీ 2019లోనే జరిగింది. అనంతరం సాగిన నియంత్రణ ప్రక్రియ, తనిఖీలో గుర్తించిన అంశాల ఆధారంగా ఐఆర్‌డీఏఐ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే సంబంధిత లావాదేవీలు లేదా విధానాలను పరిశీలించిన చాలా కాలం తర్వాత కూడా నియంత్రణ చర్యలు వెలువడే అవకాశం ఉందని ఈ కేసు తెలియ‌జేస్తోంది.

బాహ్య సంస్థ‌లు లేదా వ్యక్తుల సేవ‌లు అయితే..

బీమా సంస్థలకు ఈ వ్యవహారం ఒక కీలక సందేశాన్ని ఇస్తోంది. సంస్థ ప్రధాన బీమా కార్యకలాపాలకు నేరుగా సంబంధం లేని సేవలను బాహ్య సంస్థలు లేదా వ్యక్తుల ద్వారా నిర్వహించినప్పటికీ అవి నియంత్రణ పరిశీలనకు లోబడి ఉంటాయి. అందువల్ల థర్డ్‌పార్టీ ఏర్పాట్లకు సంబంధించి స్పష్టమైన పర్యవేక్షణ, సరైన డాక్యుమెంటేషన్, క‌చ్చితమైన వర్గీకరణ, నియంత్రణ సంస్థలకు సమయానుకూలంగా రిపోర్టింగ్ చేయడం అత్యంత కీలకం. ఈ లాప్స్‌కు సంబంధించి ఐఆర్‌డీఏఐ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌పై రూ.1 కోటి ద్రవ్య జరిమానా విధించింది. అయితే సంస్థ నమోదు చేసిన మొత్తం సేల్స్, మార్కెటింగ్ ఖర్చుల్లో ప్రతి చెల్లింపూ తప్పుగా ఉందని నియంత్రణ సంస్థ నిర్ధారించిందని దీనర్థం కాదు. ఐఆర్‌డీఏఐ ఆదేశాల్లో గుర్తించిన నిర్దిష్ట ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు, వాటి వర్గీకరణ, డాక్యుమెంటేషన్, రిపోర్టింగ్‌కు సంబంధించిన లోపాలపైనే జరిమానా ఆధారపడి ఉంటుంది.

Advertisement
Advertisement