త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E-Pantry Services | మెయిల్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో ఐఆర్‌సీటీసీ ఈ-ప్యాంట్రీ సేవ‌లు

E-Pantry Services | రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవల‌ను ప్రారంభించింది. ఈ విషయంపై వివరాలు వెల్లడించిన ఐఆర్‌సీటీసీ అధికారి మాట్లాడుతూ ప్యాంట్రీ కార్ ఉన్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రారంభించ‌బ‌డిన‌ ఈ-ప్యాంట్రీ మీల్స్‌ బుకింగ్ సౌకర్యానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంద‌ని తెలిపారు.

S

Business | Published On Feb 24, 2026, 11.41 am IST

E-Pantry Services | మెయిల్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో ఐఆర్‌సీటీసీ ఈ-ప్యాంట్రీ సేవ‌లు
Advertisement

E-Pantry Services | రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవల‌ను ప్రారంభించింది. ఈ విషయంపై వివరాలు వెల్లడించిన ఐఆర్‌సీటీసీ అధికారి మాట్లాడుతూ ప్యాంట్రీ కార్ ఉన్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రారంభించ‌బ‌డిన‌ ఈ-ప్యాంట్రీ మీల్స్‌ బుకింగ్ సౌకర్యానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంద‌ని తెలిపారు. ఈ రైళ్లలో భోజనం టికెట్ ధరలో భాగం కాద‌ని, ప్రయాణ సమయంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఎంపిక చేసిన మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముందస్తుగా భోజనం బుక్ చేసుకునేందుకు ఈ-ప్యాంట్రీ డిజిటల్ సదుపాయం అందుబాటులో ఉంద‌ని తెలిపారు.

ప్ర‌యాణికుల నుంచి విశేష రీతిలో స్పంద‌న‌..

మొదట ఈ సేవల‌ను దేశంలోనే అత్యంత పొడవైన దూరం ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 25 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. ఏప్రిల్ 2025 నుంచి దశలవారీగా ప్రారంభించిన తర్వాత సేవల‌కు మంచి ఆదరణ లభించింద‌ని, ఇప్పటివరకు ఐఆర్‌సీటీసీ ఈ-ప్యాంట్రీ ద్వారా 65వేల‌కు పైగా భోజనాలు బుక్ అయ్యాయ‌ని తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ విభాగాల్లో 17వేల‌కు పైగా బుకింగ్‌లు నమోదయ్యాయ‌ని, ఉదయం, సాయంత్రం టీ కోసం 8వేల‌కు పైగా ఆర్డర్లు వచ్చాయ‌ని వివ‌రించారు. లంచ్ సేవకు కూడా 15వేల‌కు పైగా ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. 2025 డిసెంబర్ నెలలో అత్యధికంగా 16,500 మీల్స్ బుక్ అయ్యాయ‌ని, ట్రైన్ నంబర్లు 12649-50/12629-30 (వైపీఆర్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్) సుమారు 8,300 ఆర్డర్లతో ముందంజలో నిలిచింద‌ని అన్నారు.

బుకింగ్ ఇలా..

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ తో సమగ్రంగా అనుసంధానించిన ఈ సదుపాయం ద్వారా కన్ఫర్మ్, ఆర్‌ఏసీ లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్ కలిగిన ప్రయాణికులు ముందస్తుగా స్టాండర్డ్ మీల్స్‌, రైల్ నీర్ బుక్ చేసుకోవచ్చు. ఈ భోజనాలను ప్యాంట్రీ కార్ సిబ్బంది నేరుగా సీటుకు చేరవేస్తారు. టికెట్ బుకింగ్ సమయంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కన్ఫర్మేషన్ పేజీ లేదా మై ట్రాన్సాక్షన్ విభాగంలోని బుక్డ్ ఫుడ్ హిస్టరీలో ఈ-ప్యాంట్రీ ఆప్ష‌న్ ను ఎంచుకోవచ్చు. బుకింగ్ అనంతరం ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్‌ను పంపిస్తారు. అలాగే మీల్ వెరిఫికేషన్ కోడ్ (ఎంవీసీ) అందుతుంది. ప్రయాణ రోజు ఆ కోడ్‌ను విక్రేతకు తెలియజేస్తే, ముందుగా బుక్ చేసిన భోజనాన్ని సీటుకు అందజేస్తారు.

రీఫండ్ స‌దుపాయం..

ఈ సేవతో ప్రయాణికులు ఆన్‌లైన్‌లో బ్రేక్‌ఫాస్ట్, స్టాండర్డ్ లంచ్, డిన్నర్ లేదా రైల్ నీర్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. చెల్లింపులు డిజిటల్ పద్ధతుల్లోనే జరుగుతాయి. దీంతో ప్రయాణ సమయంలో నగదు లావాదేవీల‌ అవసరం ఉండదు. ఈ-ప్యాంట్రీ సేవలో భాగంగా ఎంవీసీ ద్వారా సరైన ప్రయాణికుడికే భోజనం అందిస్తారు. అన్ని ఆర్డర్లను డిజిటల్ డ్యాష్‌బోర్డుల ద్వారా పర్యవేక్షిస్తారు. ఇక బుక్ చేసిన భోజనాన్ని అందించ‌క‌పోతే ప్రయాణికులు రీఫండ్ ను కోర‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో మీల్స్ క్యాన్సిలేష‌న్ లేదా రీఫండ్ వివరాల‌ను ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement