త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India GST Collection October | రికార్డు సృష్టించిన అక్టోబర్ జీఎస్టీ కలెక్షన్లు: రూ.2.31 లక్షల కోట్లు వసూలు.. తెలంగాణ వాటా ఇదే!

అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ. 2.31 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు.. తెలంగాణ ఆదాయం ఎంతంటే?

J

Business | Published On Nov 1, 2026, 2.48 pm IST

India GST Collection October | రికార్డు సృష్టించిన అక్టోబర్ జీఎస్టీ కలెక్షన్లు: రూ.2.31 లక్షల కోట్లు వసూలు.. తెలంగాణ వాటా ఇదే!

సంక్షిప్త సారాంశం

అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ (Gross GST) వసూళ్లు 22.9% వృద్ధితో రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. రీఫండ్లు మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం 25.6% పెరిగి రూ.2.03 లక్షల కోట్లుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రూ.5,958 కోట్లు (14% పెరుగుదల), ఆంధ్రప్రదేశ్ రూ.4,307 కోట్లు (24% పెరుగుదల) సాధించాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర రూ.35,150 కోట్లు నమోదు చేయగా, అస్సాం ఏకంగా 47% వృద్ధిరేటుతో అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

India GST Collection October | త్రినేత్ర న్యూస్ : భారత ఆర్థిక వ్యవస్థ పండుగల సీజన్‌లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ (GST) వసూళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళలాడింది. గత ఏడాదితో పోలిస్తే స్థూల జీఎస్టీ కలెక్షన్లు ఏకంగా 22.9 శాతం పెరిగి రూ. 2.31 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ రెవెన్యూ 25.6 శాతం వృద్ధితో రూ. 2.03 లక్షల కోట్లుగా నమోదైంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న మొదటి ఏడు నెలల కాలాన్ని పరిశీలిస్తే, మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 14.78 లక్షల కోట్లకు చేరుకుని, వార్షిక ప్రాతిపదికన 13.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

దిగుమతులు, డొమెస్టిక్ మార్కెట్‌లో భారీ జంప్

ఈ నెలలో దిగుమతులపై వచ్చిన జీఎస్టీ భారీ ఊపునిచ్చింది. దిగుమతి చేసుకున్న వస్తువుల ద్వారా వచ్చిన ఆదాయం 42.2 శాతం ఎగబాకి రూ. 72,246 కోట్లకు చేరింది. మరోవైపు దేశీయ లావాదేవీల (Domestic Revenue) ద్వారా వచ్చిన ఆదాయం కూడా 15.8 శాతం పెరిగి రూ. 1.59 లక్షల కోట్లను తాకింది.

అక్టోబర్ కలెక్షన్ల విభజన ఇలా ఉంది

సెంట్రల్ జీఎస్టీ (CGST): రూ. 42,935 కోట్లు

స్టేట్ జీఎస్టీ (SGST): రూ. 51,340 కోట్లు

ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST): రూ. 1.37 లక్షల కోట్లు

మొత్తం రీఫండ్లు: రూ. 27,934 కోట్లు (గతేడాది కంటే 6.5% పెరుగుదల)

తెలుగు రాష్ట్రాల్లో జోరు: ఏపీలో 24%, తెలంగాణలో 14% వృద్ధి

జీఎస్టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాలు కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి.

తెలంగాణ: 14 శాతం వృద్ధితో రూ. 5,958 కోట్ల పన్ను వసూళ్లను సాధించింది.

ఆంధ్రప్రదేశ్: అద్భుతమైన పనితీరు కనబరుస్తూ 24 శాతం వృద్ధితో రూ. 4,307 కోట్లను నమోదు చేసింది.

అగ్రస్థానంలో మహారాష్ట్ర.. అస్సాంలో ఊహించని గ్రోత్

దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యధికంగా రూ. 35,150 కోట్ల రెవెన్యూతో (13% పెరుగుదల) మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక రూ. 15,922 కోట్లతో (18% గ్రోత్) రెండో స్థానంలో ఉండగా, గుజరాత్ రూ. 13,516 కోట్లు (16% గ్రోత్), తమిళనాడు రూ. 11,661 కోట్లతో (3% గ్రోత్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పెద్ద రాష్ట్రాల్లో వృద్ధి రేటు పరంగా అస్సాం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే అస్సాం కలెక్షన్లు ఏకంగా 47 శాతం జంప్ అయి రూ. 1,934 కోట్లకు చేరాయి. జార్ఖండ్ 31 శాతం, మధ్యప్రదేశ్ 29 శాతం, పంజాబ్ 25 శాతం మేర వృద్ధిని కనబరిచాయి.

కొన్ని ప్రాంతాల్లో తగ్గిన వసూళ్లు

అధికారిక నివేదిక ప్రకారం పలు ప్రాంతాల్లో వసూళ్లు క్షీణించాయి. సిక్కింలో అత్యధికంగా 28 శాతం తగ్గుదల నమోదై రూ. 221 కోట్లు మాత్రమే వచ్చాయి. లడఖ్‌లో 20 శాతం తగ్గి రూ. 63 కోట్లకు, పుదుచ్చేరిలో 7 శాతం తగ్గి రూ. 179 కోట్లకు పడిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా స్వల్పంగా 2 శాతం క్షీణత కనిపించింది.

దేశీయంగా వ్యాపార లావాదేవీలు ఊపందుకోవడం, పండుగ వేళ వినియోగదారుల కొనుగోళ్లు పెరగడం వల్లే అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి జీఎస్టీ రాబడి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్స్:

Andhra Pradesh GST RevenueGstGST Gross Collection GrowthIndia GST Collection OctoberMinistry Of Finance GST DataOctober GST Revenue RecordsState Wise GST CollectionTelangana GST Collection October
Advertisement
Advertisement