త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీల‌లో స్వ‌ల్ప న‌ష్టాలు..

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అలాగే గత ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన బలమైన ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలు ఒత్తిడిలో కొన‌సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 70 పాయింట్లు (0.09 శాతం) తగ్గి 76,765.92 వద్ద ముగిసింది.

S

Business | Published On Jul 28, 2026, 4.09 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌కు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీల‌లో స్వ‌ల్ప న‌ష్టాలు..
Advertisement

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అలాగే గత ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన బలమైన ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలు ఒత్తిడిలో కొన‌సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 70 పాయింట్లు (0.09 శాతం) తగ్గి 76,765.92 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 11 పాయింట్లు (0.04 శాతం) పడిపోయి 23,985.35 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.08 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.22 శాతం క్షీణించింది. గత సెషన్‌లో నమోదైన భారీ లాభాల తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతోపాటు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కొనసాగుతున్న అనిశ్చితి మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.

భారీగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులను నిలిపివేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ఇరు దేశాల మధ్య వివాదాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత తగ్గి బ్యారెల్‌కు 85 డాలర్ల వద్దకు చేరాయి. ఇక భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 12 పైసలు బలపడి డాలర్‌కు 95.87 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణలు కీలక దశలో ఉన్న సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భౌగోళిక రాజకీయ పరిణామాలతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయంపైనా పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ఇంధన ధరల అస్థిరత కారణంగా ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్ జూలై 29న తన విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

అప్ర‌మ‌త్తంగా ఉన్న పెట్టుబ‌డిదారులు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వ్యయాలపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయని అన్నారు. అయితే ఈ వారం ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి ప్రధాన కేంద్ర బ్యాంకుల విధాన సమావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారని తెలిపారు. ఎనర్జీ మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత, భౌగోళిక రాజకీయ ప్రమాదాలు ఈ ఏడాది గ్లోబల్ బాండ్ యీల్డ్‌లను అధిక స్థాయిలో ఉంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ జూలై ద్రవ్య విధాన సమావేశాల్లో ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తాయనే అంచనాలు మార్కెట్‌ల‌కు కొంత మద్దతు అందించాయని చెప్పారు.

భారీ లాభాల్లో ఐటీ షేర్లు..

నిఫ్టీ 50లో హిందుస్తాన్ యూనిలీవర్, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా షేర్లు అత్యధిక లాభదాయక షేర్లుగా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ 3.32 శాతం ఎగిసి వరుసగా మూడో సెషన్‌లో బలమైన ర్యాలీని కొనసాగించింది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్‌ల్లోనే ఈ సూచీ దాదాపు 7 శాతం పెరిగింది. ఆకర్షణీయమైన విలువల కారణంగా ఐటీ రంగంలో పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. నిఫ్టీ రియాల్టీ సూచీ 2.17 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీ 1.08 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ 0.58 శాతం క్షీణించగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 0.39 శాతం నష్టంతో ముగిసింది.

Advertisement
Advertisement