త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

Stock Markets | భారత స్టాక్‌ మార్కెట్లు మంగ‌ళ‌వారం నష్టాల్లో ముగిశాయి. టెక్నాలజీ, ఆర్థిక సేవలు, ఎఫ్‌ఎంసీజీ రంగాల‌ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అయితే ఇంట్రాడే కనిష్ఠ స్థాయిల నుంచి సూచీలు గణనీయంగా కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లలో కనిపించిన సానుకూల ధోరణికి అనుగుణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఉద‌యం లాభాలతో ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Sep 22, 2026, 4.01 pm IST

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..
Advertisement

Stock Markets | భారత స్టాక్‌ మార్కెట్లు మంగ‌ళ‌వారం నష్టాల్లో ముగిశాయి. టెక్నాలజీ, ఆర్థిక సేవలు, ఎఫ్‌ఎంసీజీ రంగాల‌ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అయితే ఇంట్రాడే కనిష్ఠ స్థాయిల నుంచి సూచీలు గణనీయంగా కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లలో కనిపించిన సానుకూల ధోరణికి అనుగుణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఉద‌యం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే సెషన్‌ తొలి భాగంలో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా పెరగడంతో ప్రధాన సూచీలు రోజు కనిష్ఠ స్థాయిలో 0.61 శాతం వరకు నష్టపోయాయి. అనంతరం కొనుగోళ్ల ఆసక్తి తిరిగి పెరగడంతో సూచీలు కోలుకున్నాయి. దీంతో ఇంట్రాడే నష్టాల్లో దాదాపు సగాన్ని పూడ్చుకోగలిగాయి. ప్రపంచ మార్కెట్‌ పరిస్థితులు కొనుగోలుదారులకు కొంత అనుకూలంగా మారినప్పటికీ, మదుపరులు మాత్రం అప్రమత్తంగానే వ్యవహరించారు.

తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి..

ముడి చమురు ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌ గణనీయంగా తగ్గడం సానుకూల సంకేతాలుగా కనిపించినప్పటికీ, చమురు ధరల్లో ఇటీవలి పతనం కొనసాగుతుందా? దీనివల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌కు దీర్ఘకాలికంగా మద్దతు లభిస్తుందా? అనే విషయంలో స్పష్టత లేకపోవడం మదుపరులను జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. నిఫ్టీ 50 సూచీ 0.36 శాతం నష్టంతో 23,329 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 0.27 శాతం తగ్గి 74,529 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లు కూడా బలహీనంగానే కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీలు రెండూ నష్టాలతో సెషన్‌ను ముగించాయి. రంగాల వారీగా చూస్తే మిశ్రమ పరిస్థితి కనిపించింది. టెక్నాలజీ, సిమెంట్‌, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు-గ్యాస్‌, ఔషధ రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు మీడియా, రియాల్టీ, కెమికల్స్‌, లోహాల రంగాలు లాభాల్లో ముగిశాయి.

భారీగా ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌వ‌డం మార్కెట్ల‌లో చివ‌రి నిమిషాల్లో ర్యాలీకి కార‌ణ‌మైంది. క్రూడ్ ధ‌ర అమాంతం ప‌డిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.67 శాతానికి పైగా త‌గ్గి బ్యారెల్‌కు 94 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.51 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ముడి చమురు ధరలు ఒక దశలో 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, ఆ లాభాలను పూర్తిగా కోల్పోయి బ్యారెల్‌కు 93 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. వరుసగా ఐదో సెషన్‌లోనూ చమురు ధరలు తగ్గడం గమనార్హం. రెండు వారాల కనిష్ఠ స్థాయికి బ్రెంట్‌ ధర చేరింది. అమెరికా ఇరాన్‌ పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉంంద‌న్న వార్తలు చమురు ధరలపై ప్రభావం చూపాయి. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించే దిశగా తొలి చర్యలు తీసుకుంటే ఏడు రోజుల్లో హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉందని ఆ దేశ సీనియర్‌ ప్రభుత్వ అధికారి క్యోడో న్యూస్‌కు తెలిపారు. అమెరికాతో చర్చలను పునరుద్ధరించేందుకు టెహ్రాన్‌ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని రాయిటర్స్‌ పేర్కొంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్‌ అధ్యక్షుడితో భేటీ అయ్యే అవకాశం ఉందా అనే అంశాన్ని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు సంబంధించిన పరిణామాలు చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే కీలక అంశంగా మారాయి.

Advertisement
Advertisement