త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 564 పాయింట్లు పెరిగి 74,859 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 23,414 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ 23,400 మార్క్ పైన ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 112 పాయింట్లు పెరిగి 56,471 వద్ద నిలిచింది. అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 178 పాయింట్లు తగ్గి 62,013 వద్ద ముగిసింది.

S

Business | Published On Sep 21, 2026, 4.05 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 564 పాయింట్లు పెరిగి 74,859 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 23,414 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ 23,400 మార్క్ పైన ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 112 పాయింట్లు పెరిగి 56,471 వద్ద నిలిచింది. అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 178 పాయింట్లు తగ్గి 62,013 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లలో సోమవారం కొనుగోళ్ల జోరు కనిపించింది. కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ షేరు 5 శాతానికి పైగా లాభపడింది. కంపెనీకి చెందిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్ యూనిట్‌పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని పరిశీలనలు చేసినప్పటికీ ఈ షేరు రాణించింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నిఫ్టీ లాభాలకు ప్రధానంగా దోహదపడ్డాయి. సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు దాదాపు 8 శాతం పెరిగింది.

ఒత్తిడిలో క్యాపిట‌ల్ మార్కెట్ షేర్లు..

క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించిన షేర్లు మాత్రం ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ లిమిటెడ్ దాదాపు 3 శాతం నష్టపోయింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ షేరు 8 శాతానికి పైగా పడిపోయింది. కంపెనీ మాతృసంస్థ రుణాలకు సంబంధించిన ఆందోళనలపై వచ్చిన నివేదికలు ఈ షేరుపై ప్రభావం చూపాయి. భారత వాతావరణ శాఖ వర్షపాతం లోటు ఉంటుంద‌ని అంచనా వేయడంతో వోల్టాస్, బ్లూ స్టార్ షేర్లు 3 శాతం వరకు లాభపడ్డాయి. ఈఎస్డీఎస్ సాఫ్ట్‌వేర్ వరుసగా మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేసి 5 శాతం లాభంతో ముగిసింది. మరోవైపు భారీ బ్లాక్ డీల్స్ నేపథ్యంలో లెన్స్‌కార్ట్, అనుపమ్ రసాయన్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. ఆర్డర్లు దక్కించుకున్న నేపథ్యంలో వెల్‌స్పన్ కార్ప్, రెఫెక్స్ ఇండస్ట్రీస్, టేగా ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. టేగా ఇండస్ట్రీస్ 52 వారాల గరిష్ఠాన్ని తాకింది.

భారీగా ప‌డిపోయిన టెక్స్‌టైల్ షేర్లు..

రష్యా ఆంక్షలకు సంబంధించిన బిల్లులపై వచ్చిన తాజా సమాచారం కారణంగా టెక్స్‌టైల్ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు 4 శాతానికి పైగా పడిపోయింది. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటాన్ కంపెనీ ప్రధానంగా లాభపడిన షేర్లుగా నిలిచాయి. భారతి ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు నష్టపోయాయి. జేఎం ఫైనాన్షియల్‌కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్, ఫండ్ మేనేజర్ ఆశిష్ చతుర్మోహ్తా మాట్లాడుతూ విస్తృత మార్కెట్‌ల‌లో కొంతకాలం పక్కదారి ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనేక లార్జ్‌క్యాప్ షేర్లు ఇంకా ర్యాలీలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావడం లేదని తెలిపారు. అయితే మార్కెట్‌లోని కొన్ని విభాగాలు బలమైన వృద్ధిని చూపిస్తున్నాయని చెప్పారు.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా మార్కెట్ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 2.57 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 97 డాల‌ర్ల‌కు దిగువ‌కు చేర‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 3.01 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 97 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ కాస్త పెరిగింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.80 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.06 శాతం లాభ‌ప‌డింది.

Advertisement
Advertisement