త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OnePlus N6 Lite | వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

OnePlus N6 Lite | మొబైల్స్ త‌యారీ సంస్థ వన్‌ప్లస్‌ భారత్‌లో వన్‌ప్లస్‌ ఎన్6 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యతరహా ధరల విభాగంలోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో బ్యాటరీ బ్యాకప్‌, మన్నిక, వేగవంతమైన డిస్‌ప్లేకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా ఇందులో 7,000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీని అందించింది.

S

Technology | Published On Sep 22, 2026, 3.47 pm IST

OnePlus N6 Lite | వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..
Advertisement

OnePlus N6 Lite | మొబైల్స్ త‌యారీ సంస్థ వన్‌ప్లస్‌ భారత్‌లో వన్‌ప్లస్‌ ఎన్6 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యతరహా ధరల విభాగంలోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో బ్యాటరీ బ్యాకప్‌, మన్నిక, వేగవంతమైన డిస్‌ప్లేకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా ఇందులో 7,000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీని అందించింది. సాధారణ వినియోగంలో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే మూడు రోజుల వరకు బ్యాకప్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. తయారీదారు లెక్కల ప్రకారం సుమారు 55.5 గంటల వాయిస్‌ కాలింగ్‌, 29.9 గంటల నావిగేషన్‌, 26.8 గంటల నిరంతర వీడియో ప్లేబ్యాక్‌ చేయవచ్చు. ఈ ఫోన్‌లో వైర్డ్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఇతర పరికరాలు, యాక్సెసరీలను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 1,600 ఛార్జింగ్‌ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతానికి పైగా సామర్థ్యాన్ని కొనసాగిస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది. అంటే దాదాపు ఆరు సంవత్సరాల వినియోగం తర్వాత కూడా బ్యాటరీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

మిలిట‌రీ గ్రేడ్ మ‌న్నిక‌తో..

వన్‌ప్లస్‌ ఎన్6 లైట్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేట్‌, గరిష్ఠంగా 900 నిట్స్‌ ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఇందులో వన్‌ప్లస్‌ ఆక్వా టచ్‌ టెక్నాలజీ ఉంది. స్క్రీన్‌పై నీటి చుక్కలు, తేమ లేదా నూనె ఉన్నప్పటికీ టచ్‌ రిజిస్ట్రేషన్‌ కొనసాగేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్‌ మందం 8.95 మిల్లీమీటర్లుగా, బరువు సుమారు 215 గ్రాములుగా ఉంది. ప్రమాదవశాత్తూ కిందపడడం, దెబ్బలు తగలడం, రోజువారీ వినియోగంలో ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్‌ మన్నిక కోసం ఎంఐఎల్‌-ఎస్‌టీడీ-810హెచ్‌ ధ్రువీకరణ పొందింది. అలాగే ఐపీ64 స్థాయి దుమ్ము, నీటి జ‌ల్లుల‌కు నిరోధకతను కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్‌ పరంగా ఇందులో 36 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్‌ను అందించారు. మూడు సంవత్సరాల వినియోగంలో ఫోన్‌ పనితీరు తగ్గకుండా సిస్టమ్‌ స్థాయి ఆప్టిమైజేషన్ల‌ను చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఏఐ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌కు వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా ఉంది. హై-రిజల్యూషన్‌ మోడ్‌ ద్వారా 50 మెగాపిక్స‌ల్‌ వరకు ఫొటోలు తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్‌ ఫొటోల్లో ముఖాలను మెరుగుపరిచేందుకు ఏఐ క్లియర్‌ ఫేస్‌, ఫొటోల్లో అవసరం లేని వస్తువులను తొలగించేందుకు ఏఐ ఎరేజర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాస్క్‌ మేనేజ్‌మెంట్‌, సెర్చ్‌ వంటి పనుల కోసం గూగుల్‌ జెమినిని కూడా ఇందులో అనుసంధానించారు. ఇందులో 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్‌ యూనిసాక్ టి7250 ప్రాసెసర్ ఉంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్‌ 16తో పనిచేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌ సదుపాయంతోపాటు ప్రత్యేక మైక్రో ఎస్‌డీ స్లాట్‌ ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్‌ కెమెరా ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, కిందివైపు స్పీకర్లు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌, గ్లోనాస్‌, గెలీలియో, క్యుజెడ్‌ఎస్‌ఎస్‌, బీడౌ వంటి సదుపాయాలు ఉన్నాయి. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీకి 15 వాట్ల ఛార్జింగ్‌, 5 వాట్ల రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇచ్చారు. వన్‌ప్లస్‌ ఎన్6 లైట్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఒకే వేరియంట్‌లో లభిస్తోంది. దీని రిటైల్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. బ్యాంక్‌ ఈఎంఐ ఆఫర్లతో ప్రారంభ ధర రూ.16,249కి తగ్గుతుంది. మిడ్‌నైట్‌ హైప్‌, నియో గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌, అమెజాన్‌ ఇండియా, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత భాగస్వామి విక్రయ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement