త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మిడిల్ ఈస్ట్ మంటలు.. స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం..

Stock Markets | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప‌శ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి.

S

Business | Published On Jun 11, 2026, 10.14 am IST

Stock Markets | మిడిల్ ఈస్ట్ మంటలు.. స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం..
Advertisement

Stock Markets | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప‌శ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ50 రెండూ ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీగా నష్టాల్లో మొద‌ల‌య్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా పడిపోయి 73,600 స్థాయికి చేరగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా క్షీణించి 23,100 మార్క్ వద్ద ట్రేడ్ అయింది. విస్తృత మార్కెట్‌ల‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు సుమారు 0.6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌లో ఇండిగో, కోట‌క్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎస్బీఐ షేర్లు 3 శాతం వరకు క్షీణించి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ప‌వ‌ర్ గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్ సహా కొన్ని షేర్లు స్వల్ప లాభాల‌ను నమోదు చేశాయి.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి విలువ‌..

సెక్టోరల్ సూచీలన్నీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయి అత్యధిక నష్టాలను చవిచూసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తదితర సూచీలు సుమారు 1 శాతం మేర క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 1,740 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవగా, 696 షేర్లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. 97 షేర్లలో మార్పు కనిపించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 95 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ 92 డాలర్ల వద్దకు చేరాయి. మరోవైపు రూపాయి కూడా ఒత్తిడికి లోనై డాలర్‌తో పోలిస్తే 35 పైసలు బలహీనపడి 95.60 స్థాయికి పడిపోయింది.

ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌లు..

కాగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కుదరకపోతే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ నాయకత్వం వెంటనే ఒప్పందంపై సంతకం చేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ గురువారం హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై కాల్పులు జరుపుతామని హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌తో అనుసంధానించే కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు క‌లిగిన ఈ జలసంధి ద్వారా ప్రపంచ రోజువారీ చమురు, గ్యాస్ రవాణాలో 20 శాతానికి పైగా సరఫరా జరుగుతుంది. అయితే పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు మళ్లీ బ్రెంట్ క్రూడ్ ధరలను 95 డాలర్ల వద్దకు తీసుకురాగా, అమెరికాలో ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరగడం వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును పరిశీలించే అవకాశం ఉందని విశ్లేష‌కులు చెబుతున్నారు. దీనివల్ల అమెరికా బాండ్ యీల్డ్స్ మరింత పెరిగి, అమెరికా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయ‌ని అంటున్నారు.

Advertisement
Advertisement