Stock Markets | భారత స్టాక్ మార్కెట్లకు గడ్డుకాలం.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా..?
Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 50 గురువారం 22,200 స్థాయి దిగువకు చేరింది. అయితే సెషన్ ముగిసే సమయానికి 22,200 పైన స్థిరపడినప్పటికీ సూచీపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గత 8 వారాల పాటు నష్టాల్లో కొనసాగిన సూచీ ఈ వారం అయినా కోలుకుంటుందని ఆశించారు. కానీ ఈ వారం పరిస్థితి మరింత దిగజారింది.
Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 50 గురువారం 22,200 స్థాయి దిగువకు చేరింది. అయితే సెషన్ ముగిసే సమయానికి 22,200 పైన స్థిరపడినప్పటికీ సూచీపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గత 8 వారాల పాటు నష్టాల్లో కొనసాగిన సూచీ ఈ వారం అయినా కోలుకుంటుందని ఆశించారు. కానీ ఈ వారం పరిస్థితి మరింత దిగజారింది. ఈ వారంలో ట్రేడింగ్‌కు ఇంకా ఒక్క సెషన్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఒక్క రోజులో భారీ ఎత్తున కోలుకుని వారం పాజిటివ్‌గా ముగియడం కష్టమే అని చెప్పవచ్చు. దీంతో నిఫ్టీ 50 వరుసగా 9 వారం కూడా నష్టాల్లో ముగిసేందుకు సిద్ధమవుతోంది. అయితే స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి ఉన్నవారు ఈ నష్టాలకు భారీ ఎత్తున ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదా, మళ్లీ ఎప్పుడు పాజిటివ్‌గా కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త పెట్టుబడిదారులు సైతం మార్కెట్లు పై దిశగా కదులుతూ స్థిరపడితే కొత్తగా పెట్టుబడులు పెట్టాలని వేచి చూస్తున్నారు. అయితే ఈ పరిస్థితిపై నిపుణులు తమ విశ్లేషణలు, అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
కారణాలేమిటి..
పెడిగ్రీ అడ్వైజరీ వ్యవస్థాపకుడు దిలీప్ భట్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సూచీల్లో ప్రస్తుతం భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొందని తెలిపారు. సూచీల్లో కొనసాగుతున్న బలహీనత తీవ్రంగా ఉందని, అందువల్ల ఇప్పట్లో మార్కెట్లు కోలుకుంటాయని ఆశించకూడదని హెచ్చరించారు. విస్తృత సూచీలు, జీడీపీ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అధికమవుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్ రాబడులు, ఎల్‌నినో ప్రభావం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ పడడం వంటి ప్రధాన కారణాల వల్ల మార్కెట్లలో అనిశ్చితి నెలకొందన్నారు. అందువల్ల ఆయా అంశాల్లో స్పష్టత వస్తే గానీ మార్కెట్లు కోలుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ప్రధాన షేర్లలో భారీ అమ్మకాలు..
ప్రధాన షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నప్పటికీ, ఈక్విటీ ధరల కదలికకు మధ్య అంతరం మరింత పెరిగింది. దీర్ఘకాలిక వృద్ధికి సంబంధించిన సూచీలు స్థిరంగానే ఉన్నప్పటికీ, కీలక సాంకేతిక స్థాయిల పతనం, సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే పడిపోయిన షేర్లను కొనుగోలు చేయడంలో తొందరపడవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్లు విస్మరించలేని సంకేతాన్ని ఇస్తున్నాయని దిలీప్ భట్ పేర్కొన్నారు. బుల్ మార్కెట్ అయినా, బెయర్ మార్కెట్ అయినా ఎంపిక చేసిన షేర్లలో అవకాశాలు ఉంటాయని, అయితే వాటిని ఎప్పుడు ఎంచుకోవాలన్నదే కీలకమని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పతన దశలో కూడా అవకాశాలు వస్తాయని, అయితే సరైన సమయం కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పడిపోతున్న మార్కెట్‌లో వెంటనే కొనుగోళ్లకు దిగడం కంటే సంస్థాగత పెట్టుబడిదారుల స్థిరీకరణకు స్పష్టమైన సంకేతాలు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. ఒక షేరు 5 శాతం పెరిగిన తర్వాత, మార్కెట్‌లో విస్తృత స్థిరత్వం కనిపిస్తే కొనుగోలు చేయడం మరింత మంచిదని తెలిపారు.
కొనాలా, వద్దా..
వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ వ్యూహకర్త క్రాంతి బతిని కూడా ఇదే తరహా జాగ్రత్త వైఖరిని వ్యక్తం చేశారు. అస్థిర మార్కెట్‌లో రిటైల్ పెట్టుబడిదారులు తాత్కాలికంగా రక్షణ కల్పించే షేర్ల కోసం వెతకడం కంటే, ఓపికగా పెట్టుబడులు పెట్టేవారికి క్రమంగా ఏర్పడుతున్న విలువైన అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ స్వల్పకాలిక ట్రేడర్లకు అధిక రిస్క్‌తో కూడుకున్నదని, అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు నిజమైన అవకాశాలు కనిపిస్తున్నాయని క్రాంతి బతిని తెలిపారు. ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, ఎంపిక చేసిన రక్షణ రంగ షేర్లతోపాటు తక్కువ విలువ వద్ద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మార్కెట్లపై ఒత్తిడి చూపుతున్న స్థూల ఆర్థిక అంశాల గురించి మాట్లాడుతూ ద్రవ్య విధానం, ఇంధన ధరలు కీలకంగా మారాయని ఆయన తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ముందుచూపుతో ఇచ్చిన మార్గదర్శకాలు మార్కెట్‌లో స్పష్టమైన కఠిన వైఖరి వాతావరణాన్ని సృష్టించాయని, ఇది విస్తృత మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని వివరించారు.
నిఫ్టీ50 కీలక స్థాయిలు..
ప్రస్తుతం బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ50 కీలక స్థాయిల వద్ద ఉందని విశ్లేషకులు తెలిపారు. 22,200, 21,700ల వద్ద కీలక మద్దతు స్థాయిలు ఉన్నాయని, ఆ స్థాయిలను దాటి కిందకు వెళితే మరింత పతనం సంభవిస్తుందని తెలిపారు. ఇక 22,800, 23,000 స్థాయిల వద్ద కీలక నిరోధక స్థాయిలు ఉన్నాయని, వాటిని దాటితే మార్కెట్లలో కొంత స్థిరత్వం ఏర్పడి మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తాయని చెప్పారు. అందువల్ల ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు లేదా కొత్తవారు అయినా తొందరపడి షేర్లను కొనవద్దని, స్థిరత్వం వచ్చాక కొనుగోలు చేస్తే దీర్ఘకాలికంగా మంచి వృద్ధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. మార్కెట్లలో క్రమశిక్షణ ముఖ్యమని, దీర్ఘకాలంలో సంపద సృష్టికి అది కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






